దూకుడు పెంచిన రఘురామ.. జగన్ సర్కార్ కు చుక్కలేనా?
posted on May 21, 2021 @ 11:36AM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరింత దూకుడు పెంచారు. కొంత కాలంగా జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న రఘురామ.. న్యాయ పోరాటాలు తీవ్రతరం చేశారు. రాజద్రోహం కేసులో తనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. తాజాగా జగన్ సర్కారు మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటివరకు సీఎం జగన్ వ్యక్తిగత అంశాల మీద విమర్శలు సంధించే రఘురామ.. తాజాగా అందుకు భిన్నంగా ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తుల్ని గుజరాత్ కు చెందిన అమూల్ కు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ ఆస్తుల్ని అమూల్ సంస్థకు అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న జీవో 117ను జారీ చేసిందని.. దీని కారణంగా రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు రఘురామ. రఘురామ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామన్నారు. ప్రభుత్వ సొమ్మును అమూల్ వాణిజ్య అవసరాలకు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఘురామ తరఫు న్యాయవాది కోరారు. అయితే విచారణ అనంతరం అలాంటిది చేస్తే ఆసొమ్ము వెనక్కి రాబట్టేలా చేస్తామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని.. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెబుతామని హైకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రఘురామ తరఫు న్యాయవాది.. మే నాలుగున ఏపీ మంత్రివర్గం ఆస్తుల్ని అమూల్ చేతికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని.. వేసవి సెలవుల తర్వాత విచారణ జరిపితే పిల్ వ్యర్థమవుతుందన్నారు. డెయిరీ ఆస్తుల బదలాయింపులపై స్టే కావాలని భావిస్తే.. ఆ జీవోను సవాలు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం కోరింది. ఈ మేరకు అనుబంధ పిటిషన్ ధాఖలు చేస్తామని చెప్పగా.. అందుకు అంగీకరించి ఈ నెల 27న జరిగే ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చేలా వాయిదా వేశారు.
రఘురామ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. తదుపరి వాయిదాలో చెప్పాలని.. తాము వింటామని ధర్మాసనం చెప్పింది. మొత్తంగా.. ఇప్పటివరకు చర్చకు లేని రీతిలో అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న డీల్ కొత్త రభసకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏపీ సర్కార్ తీసుకున్న మరికొన్నినిర్ణయాలపైనా రఘురామ రాజు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.