దేశంలో మరణాలు 4 వేలు.. రికవరీలు కూడా ఎక్కువే..
posted on May 21, 2021 @ 10:50AM
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. నిన్న మృతుల సంఖ్య మరోసారి నాలుగువేలకు పైగా నమోదైంది. అలాగే 2.59లక్షల మంది వైరస్ బారిన పడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గురువారం 20,61,683 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,59,551 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చుకుంటే కొత్తకేసులు స్వల్పంగా తగ్గాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకోట్ల 60లక్షల మార్కును దాటింది. 24గంటల వ్యవధిలో 4,209 మంది ప్రాణాలు వదిలారు. క్రితంరోజు ఆ సంఖ్య 3,874గా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది చనిపోయారు. ఇప్పటివరకు 2,91,331మంది ప్రాణాలు గాల్లోకలిశాయి. అయితే వరసగా మూడురోజులుగా 20లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదు అవుతున్నాయి.
ఇక, క్రియాశీల కేసుల్లో తగ్గుదల, రికవరీల్లో పెరుగుదల సానుకూల అంశాలు. ప్రస్తుతం 30,27,925 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 11.63 శాతానికి తగ్గింది. వరసగా ఎనిమిదో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న 3,57,295 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.27కోట్ల మందికిపైగా కోలుకోగా..రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 14,82,754 మంది టీకాలు అందాయి.
ఒక వైపు ఈ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ లెక్కలపై విమర్శలు లేక పోలేదు.. రోజుకి 4000 మరణాల కంటే ఎక్కువ సంభవిస్తున్నాయి అని కొందరు పేర్కొంటున్నారు. రోజుకి 4 వేల మంది చనిపోతే స్మశానం లో శవాలు క్యూ లు ఎందుకు ఉన్నాయని, గంగ నదిలో శవాలు ఎందుకు తేలుతున్నాయని విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరో వైపు కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి వరకు ఉంటుందని ప్రజల్లో ఆందోళన లేకపోలేదు. శాస్త్రవేత్తలు మాత్రం జులై వరుకు కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని అంటున్నారు. ఏవి వాస్తవాలో అవాస్తవాలో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంది.