హుటాహుటిన హస్తినకు బండి.. కారణమేమిటంటే..?
posted on Aug 6, 2022 @ 10:25AM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ప్రజా సంగ్రామయాత్రలో ఉన్న ఆయన అకస్మాత్తుగా పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ హస్తినకేగడానికి గల కారణమేమిటనే విషయంలో ఒకింత సందిగ్ధత ఏర్పడినా ఆయన ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఢిల్లీకి బయలుదేరారని పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు. తన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మునుగోడులు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వినించే అవకాశం ఉంది.
ఈ నెల 21న బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగించనున్నారు. ఆ సందర్భంగా మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు శాసన సభ సభ్యత్వానికి కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ముగుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కమలంగూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, మునుగోడులో పార్టీ విజయావకాశాలపై బండి సంజయ్ నడ్డా, అమిత్ షాలకు వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలకు అవకాశం ఉదనే అంచనాల నేపథ్యంలో బండి సంజయ్ హస్తిన యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.