మా ఎంపీ సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్ధం.. స్పష్టం చేసిన ఏపీ బీజేపీ
posted on Jul 31, 2020 @ 12:22PM
ఏపీలో రాజధాని రగడ మాములుగా లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ కు పంపగా మరో పక్క మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ఆ బిల్లులను ఆమోదించవద్దని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐతే రెండు రోజుల క్రితం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ రాజధాని పై మా స్టాండ్ అదే అని చెప్పడం జరిగింది. నిన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మీడియ సమావేశం నిర్వహించి అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఐతే తాజాగా ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ప్రజలకు మరింత స్పష్టంగా చెపుతూ ఇపుడు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సుజనా వ్యాఖ్యల పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. "రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి వ్యాఖ్య పార్టీ అభిప్రాయం కాదు. ఐతే రాజధాని అమరావతి లోనే కొనసాగాలి అనేది మా అభిమతం.. కానీ ఈ విషయం మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోమువీర్రాజు గారు స్పష్టం చేశారు" అని పేర్కొంది.