మీ వల్లే శానిటైజర్ మరణాలు.. ప్రభుత్వం పై మండి పడ్డ చంద్రబాబు
posted on Jul 31, 2020 @ 2:34PM
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలైన సుమారు 20 మంది శానిటైజర్ తాగడంతో వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 10 మంది కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల అయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పెరిగి పోవడం బాధాకరమని.. నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, చివరికి శానిటైజర్లు తాగి ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని అయన మండిపడ్డారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో మద్యం ధరలు ఏకంగా 300 శాతానికిపైగా పెంచడమే కాకుండా నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
దీంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా పెరిగిపోయిందని, చివరికి గడ్డివాముల్లో, మొక్కజొన్న తోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే ఉన్నాయని అయన విమర్శించారు. వైసిపి పార్టీ కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారిపోయారని కొన్ని వందల ద్విచక్ర వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు చూశామని అయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా తయారీ యధేచ్చగా సాగుతోందని, సారా అమ్మే వారిదే రాజ్యంగా మారిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తారని చంద్రబాబు అన్నారు. లిక్కర్ మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలని... కురిచేడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.