సీఎం జగన్ కూతురు చదివే చోటా అదే తీరు.. ఇప్పటికైనా ఆయన మారాలి
posted on Jul 31, 2020 @ 11:20AM
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం వైఎస్ జగన్ ను కోరారు. ప్రాథమిక విద్యను ఆంగ్ల భాషలో నిర్బంధంగా బోధించాలని సీఎం నిర్ణయించడం సమంజసం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనైనా సీఎం తీరు మారాలన్నారు. ప్రపంచమంతా ఒక దారైతే, నాదో దారి అన్నట్టున్న జగన్ వైఖరి మారాలని సూచించారు. ఆంగ్ల భాషలోనే బోధించాలన్న ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఆయన.. చిన్న రాష్ర్టాలు సైతం మాతృభాషకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని గుర్తు చేశారు.
''నాకు తెలిసి మన సీఎం వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతున్నట్లుంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం 20 శాతంగా ఉన్న మాతృభాష బోధనను 50 శాతానికి పెంచే ప్రణాళికలు చేశారు. అంత చిన్న కమ్యూనిటీకే సొంత భాషపై అంతగా ప్రేముంటే, గొప్పగా చెప్పుకునే తెలుగు కోసం మనము ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి? అయినా, యునెస్కో దగ్గర్నుంచి దేశాదేశాలన్నీ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే, మన సీఎం మాత్రం 151 సీట్లు వచ్చాయి కదాని ఇష్టమొచ్చినట్లు వెళతానంటే కుదురుతుందా?'' అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష చైనీయులు మాట్లాడే మాండరిన్ అని, రెండో స్థానంలో స్పానిషన్ ఉందని, ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లీష్, హిందీ వస్తాయని, కేవలం ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతోనే అన్నీ లభిస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎంపీ అన్నారు. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మాతృభాష గురించి మాట్లాడేవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారని, సీఎం జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించారు. ఎల్లాప్రగడ సుబ్బారావు, సీవీ రామన్ సహా గొప్ప గొప్ప వాళ్లంతా మాతృభాషలోనే చదువుకున్నారని, ఏపీ కంటే అభివృద్ధిలో ఎంతో మందున్న జపాన్, చైనా, కొరియాలోనూ మాతృభాషలోనే బోధన సాగుతుందని, ఇవన్నీ తెలిసి కూడా జగన్ తప్పుడు విధానాలను అనుసరించడం, ఏకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుండం శోచనీయమని వ్యాఖ్యానించారు.
వైసీపీ నుంచి బహిష్కరించే దిశగా తనకు జారీ చేసిన నోటీసులు, తనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదులోనూ భాషకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉందని ఎంపీ గుర్తుచేశారు. ఏపీ సర్కారు తలపెట్టిన ఇంగ్లీషు మీడియంపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారని అన్నారు. మాతృభాషను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమన్న తన వాదన ఎంత సరైందో.. నూతన విద్యావిధానం ఆమోదంతోనే అర్థమవుతున్నదని, ఆ లెక్కన పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవిగానే భావించాలని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.