కేసీఆర్ బీహార్ పర్యటన.. జాతీయ రాజకీయాల దిశగా మరో అడుగా?
posted on Aug 30, 2022 8:06AM
మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తన నాయకత్వంలో పోరాటం చేయాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా కేసీఆర్ మరో అడుగు వేస్తున్నారు. ఈ నెల 31(బుధవారం)న ఆయన బీహార్ పర్యటనకు వెళుతున్నారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అవ్వడానికి కేసీఆర్ బీహార్ వెళుతున్నారు. వీరి భేటీలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కూడా పాల్గొంటారు.
ఈ పర్యటనకు కారణంగా కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా గాల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడానికే అని చెబుతున్నప్పటికీ సాకు అదే అయినా అసలు కారణం మాత్రం రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటన సందర్బంగా కేసీఆర్ గాల్వాన్ ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు హైదరాబాద్ లో టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కు చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. అదలా ఉంటే.. రాజకీయంగా మాత్రం కేసీఆర్ బీహార్ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ భేటీలో ఇరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా బీహార్ లో బీజేపీ పనైపోయింది.. ఇక ఢిల్లీ నుంచి బీజేపీని పంపేయడమే మిగిలిందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఒకే లక్ష్యంతో ఉన్న ముగ్గురు నేతల భేటీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న జేడీయూ ఇటీవలే కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ బీజేపీయేతర రాష్ట్రప్రభుత్వాలను కూలదోయడానికి ఎత్తులు వేస్తుంటే.. నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా బీహార్ లో ఎన్డీయే సర్కార్ ను కూల్చి బీజేపీ వ్యతిరేక పార్టీలలో ఒక ఉత్సాహాన్ని నింపారని పరిశీలకులు అంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను మళ్లీ కొత్తగా ప్రారంభించేందుకు కేసీఆర్ తన తొలి అడుగు బీహార్ లో వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. బీహార్ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటించిన కేసీఆర్.. కలిసి వచ్చే పార్టీలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్), సమాజ్ వాదీ పార్టీ (ఉత్తర ప్రదేశ్), డీఎంకే (తమిళనాడు), ఆమ్ ఆద్మీ పార్టీ (ఢిల్లీ) అధినేతలతో భేటీ అయ్యారు. పలువురు నేతలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట 26 రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. గత కొంత కాలంగా ఎక్కడ సభ జరిగినా.. ఎవరితో భేటీ అయినా సందర్భం ఏదైనా కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ జపమే చేస్తున్న సంగతి విదితమే.