జగన్ రివర్స్ పాలన.. రివర్స్ టెండరింగ్.. రివర్స్ ఇన్వెస్ట్ మెంట్స్!
posted on Aug 2, 2023 @ 5:50PM
గత మార్చి నెల 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘స్వప్న’ రాజధాని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ నిర్వహించింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆవిషయం గుర్తుందో లేదో కానీ, ఆ సందర్భంగా ఆయన అదే వేదిక నుంచి రెండు కీలక ప్రకటనలు చేశారు.
ఈ సదస్సు ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చి పడుతుందని చేయెత్తి మరీ చెప్పు కొచ్చారు. అలాగే, వట్టి పెట్టుబడులే కాదు, పెట్టుబడులతో పాటుగా..లక్షల్లో ఉద్యోగాలు వచ్చిపడుతున్నాయని ప్రకటించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 రంగాలకు సంబంధించి, 340 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ చిరునవ్వు చెరగకుండా, సగర్వంగా చెప్పారు.
అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి విశాఖ వాసులకు మరో ‘తీపి’ కబురు కూడా వినిపించారు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని వెల్లడించారు. అలాగే తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి సదస్సు వేదికగా పారిశ్రామిక దిగ్గజాలు - ఆహుతుల సమక్షంలో ప్రకటించారు.
సరే రాజధాని విషయం కాసేపు పక్కన పెడడాం.. పెట్టుబడుల మాటేమిటి? అవైనా వచ్చాయా, అంటే, ఆ ఒక్కటీ అడగొద్దనేదే సర్కార్ స్వాముల సమాధానం. నిజమే విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ వంటి సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అన్నీ, గ్రౌండ్ కావు. కొన్ని ఒప్పందాలు కాగితాలకే పరిమితం అవుతాయి. అందులో కొన్ని ఉత్తుతి ఒప్పందలుంటాయి. కొన్నిటి విషయంలో ఎక్కడో చిక్కుముడి పడి ఆగి పోతాయి. ఇంకొన్ని కొంచెం ఆలస్యంగా మొదలవుతాయి ... కానీ, ఎన్నో కొన్నయితే ఖాయంగా ఇప్పటికే గ్రౌండ్ కావాల్సింది. కానీ, ‘వైరైటీ’ గా జగన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న, పోనీ కుదుర్చుకున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.13 లక్షల కోట్లలో నుంచి కోట్ల తీసేసి లక్షల్లో చూసినా ఆ రూ.13 లక్షల పెట్టుబడులు అయినా వచ్చాయా ..అంటే లేదనే సమాధానమే వస్తోంది.
నిజానికి, విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏంటో తెలిస్తే, సిగ్గుతో తలదించుకోక తప్పుదు. అవును జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఇదేదో ఎవరో జగన్ రెడ్డి అంటే గిట్టని వ్యతిరేకులు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే, 2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు .. అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరోటి లేదనడంలో సందేహం లేదు.
కొత్తగా పెట్టుబడులు రాకపోవడం ఒకటైతే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ( కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం అయిదేళ్ళలో రూ. 6 లక్షల కోట్లకు పైబడిన పెట్టుబడులు వచ్చాయి) అంతకు ముందు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు అనేక మంది జగన్ రెడ్డి అరాచక పాలన భరించలేక రాష్ట్రం వదిలి పోయారు.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి. విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి పాలనలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.దీంతో లూలు గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు ఇప్పుడున్న పరిస్థితిలో ( అనగా జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ..) ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని తేల్చి చెప్పేసింది.
అంత వరకు ఎందుకు, చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా వారి, అమర రాజా కంపెనీ, జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను, తెలంగాణకు తరలించుకు పోయింది.. ఇలా చెప్పాలంటే చాల చాలా ఉన్నాయి. ఒక్క మాటలో ముగించాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ..ఆ సాహాసం చేసే పెట్టుబడి దారులు లేరు. ఉన్న పెట్టుబడులు నిలిచే పరిస్థితీ లేదు. పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి. మరి రాష్ట్ర భవిష్యత్ ..? ఈ ప్రశ్నకు జవాబు ప్రజలే చెప్పవలసి ఉంటుంది . ఓటు వారి చేతిలో నే వుంది.
సరే మళ్లీ గ్లోబల్ సమ్మిట్ దగ్గరకు వస్తే.. ఆ సమ్మిట్ లో పెట్టుబడులు పెడతామంటూ కోట్లూ, బూట్లూ వేసుకు వచ్చిన వారంతా నిజంగా పారిశ్రామిక వేత్తలేనా అన్న అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి. భోజనాల దగ్గర వారు చేసిన గలాటా.. వారిలో కొందరిని ఐప్యాక్ సభ్యులుగా గుర్తించి అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో గ్లోబల్ సమ్మిట్ ఓ ప్రహసనం అని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తయి. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రే గొప్పగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటించేసరికి కొందరు కాకపోతే కొందరైనా అందులో ఎంతో కొంత గ్రౌండ్ కాకపోతుందా అని ఆశించారు. అయితే వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు మాట్లాడడని తేలిపోయింది. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ జరిగిన నాలుగు నెలల తరువాత అటువంటి సమ్మిట్ ఒకటి తన హయాంలో జరిగిందన్న సంగతిని జగన్ తో సహా ఆయన కేబినెట్ పూర్తిగా మరచిపోయింది.