మరో సీఐ వీరంగం!
posted on Jul 13, 2023 @ 3:11PM
పోలీస్‌శాఖలో హోంగార్డుల నుంచి జిల్లా ఎస్పీల వరకు అందరూ తమ పని తాము పద్దతిగా.. చేసుకుపోతుంటే.. సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు మాత్రం.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి.
తాజాగా శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ అలియాస్ చావలి అంజమ్మ.. స్థానికంగా ఆందోళన చేస్తున్న ఓ జనసేన కార్యకర్త చెంపలు.. ఆమె రెండు చేతులతో వాయిస్తున్న ఓ వీడియో సూపర్ స్పీడ్‌తో అటు మీడియాలో... ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు అంజు యాదవ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అదీకాక ఇప్పటికే ఆమె వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమైందన్న సంగతి అందరికి తెలిసిందేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు ఆమె వ్యవహారశైలిపై జాతీయ మహిళ కమిషన్ సైతం మండిపడిందని.. ఆ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర డీజీపీని ఆదేశించినా.. ఇప్పటి వరకు అంజుయాదవ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఓ చర్చ ఖాకీవనంలోనే జోరుగా కొనసాగుతోంది.
శ్రీకాళహస్తిలో రాత్రి 9 గంటల సమయంలో హోటల్ ఎందుకు మూయలేదంటూ.. హోటల్ యజమాని భార్యపై సీఐ అంజూయాదవ్ చెయ్యి చేసుకోవడం.. అందుకు సంబంధించిన వీడియోలు సైతం గతంలో వైరల్ అయినాయి. అలాగే మద్యం విక్రయాలు సాగిస్తున్నారంటూ.. మరో మహిళపై సదరు సీఐ దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
సదరు సీఐ అంజుయాదవ్ గారి బాదుడు కార్యక్రమం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయినా సీఐ అంజూయాదవ్ గారి ఖాకీ పవర్.. శ్రీకాళహస్తి సర్కిల్ పరిధిలో పలువురికి ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ తగిలే ఉంటుందనే ఓ చర్చ స్థానికంగా నడుస్తోందని వారు వ్యంగ్యంగా అంటున్నారు. అంతే కాదు.. రేపో.. మాపో.. అటో ఇటో.. ఏటో వైపు నుంచి వచ్చి.. ఎవరిపైన అ దాడి చేస్తుందోననే ఓ విధమైన ఆందోళన శ్రీకాళహస్తి వాసుల్లో అంతర్గతంగా ఉందనే ఓ ప్రచారం సైతం సాగుతోందని అంటున్నారు.
ఇప్పటికే విశాఖపట్నం ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో చిక్కి.. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కిస్తున్నారనీ, అలాగే గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీఐగా ఆయన గారు చేసిన ఓవర్ యాక్షన్‌కి ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఫిదా అయిపోయి.. ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి ఇలా ఆహ్వినించడంతో.. అలా ఆయన తన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. హిందూపురం ఎంపీ టికెట్‌పై గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందేనని వారు పేర్కొంటున్నారు.
ఏదీ ఏమైనా.. పోలీసులు అంటే ప్రజలకు రక్షక భటులని.. ఆ క్రమంలో ప్రజలు చెల్లించే పన్నులను జీతాలుగా తీసుకోంటూ.. ఆ ప్రజలకు అండగా.. రక్షణగా నిలవకుండా.. తాము దైవలోకం నుంచి ఊడి పడ్డామని.. ఓ చేతిలో లాఠీ, మరో చేతిలో తుపాకీ చూసుకోని తమకు తాము దైవాంశ సంభూతులమనుకొంటూ.. పోలీసు శాఖలోని పలువురు పోలీసులు తమకు తాము పరువు మాపుకొంటున్నారని నెటిజన్లు ఓ విధమైన ఆందోళనతో పేర్కొంటున్నారు.