మూడో ఫ్రంట్ కోసం మరో ప్రయత్నం..ఈ సారి ఐఎన్ఎల్డీ నేత చౌతాలా
posted on Sep 8, 2022 @ 12:21PM
కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి దిశగా మరో ప్రయత్నం ప్రారంభమైంది. ఇందు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ జట్టుకట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆర్ఎన్‌ఎల్డీ నేత చౌతాలా ఇందుకు నడుం బిగించారుర. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమైన నేపథ్యంలో తాజాగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు చౌతాలా నడుంబిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇందుకోసం ఆయన తన స్వ రాష్ట్రం అయిన హర్యానాలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు ఈ నెల 25 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజే ఎందుకంటే సెప్టెంబర్ 25 మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి కనుక. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో లేని అంటే ఎన్డీయేతర, యూపీఏయేతర పార్టీల నేతలను ఆహ్వానించారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్, జేడీ ఎస్ నేత దేవెగౌడ, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ సమావేశానికి హాజరయ్యేందకు ఇప్పటికే అంగీకారం తెలిపారని చౌతాలా పేర్కొన్నారు. ఎన్సీపీ , టీఎంసీ నేషనల్ కాన్ఫరెన్స్ , ఆర్‌ఎల్డీ వంటి పార్టీలనూ ఆహ్వానించినప్పటికీ ఆయా పార్టీల నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. గతంలోనే ఇటువంటి ఐక్యత కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐఎన్ఎల్డీ నుంచి ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియరాలేదు.
ఒక వేళ అందినా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. కాగా తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే అభిప్రాయం ప్రకారం బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అంటే అంతిమంగా అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేదిగానే మిగిలిపోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి నడిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నది పీకే అభిప్రాయం.
ఇక కేసీఆర్ కూడా ఇటీవలి పరిణామాల అనంతరం కాంగ్రెస్ పంచన చేరాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 25న నిర్వహించనున్న ప్రాంతీయ పార్టీల సమావేశానికి హాజరవ్వడం అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.