ప్రైవేటు భవనాల్లో ఈవీఎంలు.. మునిసిపల్ చట్టానికి సవరణ..దీని భావమేమి తిరుమలేశా?
posted on Sep 14, 2022 8:06AM
తెలంగాణ సర్కార్ ఎన్నికలు గెలవాలంటే.. మరిన్ని అధికారాలు, వెసులు బాట్లు కావాలని భావిస్తోందా? అందుకు అవసరమైన విధంగా చట్ట సవరణలకు పాల్పడుతోందా అంటే మంగళవారం(సెప్టెంబర్13) అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లులో పొందుపరిచిన ఒక అంశాన్ని గమనిస్తే ఔననే చెప్పాలని పరిశీలకులు అంటున్నారు.
మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. మునిసిపల్ ఎన్నికలలో ఈవీఎంలను భద్ర పరుచడానికి అవసరమైతే ప్రైవేటు భవనాలను వినియోగానికి అవకాశం కల్పించేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఈవీఎంలను స్టోర్ చేసేందుకు, వాటికి అవసరమైన భద్రతను కల్పించేందుకు ప్రైవేటు భవనాలను వినియోగించుకునే వెసులు బాటు ఈ ఈ సవరణ ద్వారా లభిస్తుంది.
ఇప్పటికే ఈవీఎంల భద్రత, విశ్వసనీయతపై దేశ వ్యాప్తంగా అనుమానాలూ, సందేహాలూ వ్యక్తమౌతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంల స్టోరేజీ భద్రత కోసం ప్రైవేటు భవనాల వినియోగం కసం మునిసిపల్ చట్టంలో సవరణ తీసుకురావడం పలు అనుమానాలకు విమర్శలకు తావిస్తోంది.
విపక్షాలు ఈ విషయంపై పలు అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భంగపాటుతో కేసీఆర్ సర్కార్ ఇక ఎన్నికలు గెలిచేందుకు దొడ్డిదారులు వెత్తుక్కుంటోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చట్ట సవరణ మునిసిపల్ ఎన్నికలతో ఆగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పునాదులు కదులు తున్నాయన్న భయంతోనే ఈవీఎంల భద్రత విషయంలో తనకు అనూకూలంగా ఉండే విధంగా టీఆర్ఎస్ సర్కార్ చట్టాన్ని సవరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి