మూడేళ్ల బాలికపై స్కూలు బస్సులో అత్యాచారం
posted on Sep 14, 2022 7:45AM
పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై ఆమె రోజూ స్కూలుకు తీసుకువెళ్లి తీసుకువచ్చే బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న బాలిక ప్రతి రోజూ స్కూలు బస్సులోనే స్కూలుకు వెళ్లి వస్తుంది. ఆ బస్సు డ్రైవరే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇందుకు ఓ మహిళా అటెండర్ సహకరించింది. సాధారణంగా నర్సరీ పిల్లలకు వారి తల్లిదండ్రులు యూనిఫాం తో స్కూలుకు పంపినా స్కూల్ బ్యాగ్ లో అదనంగా మరో డ్రెస్ పెడతారు. ఓ రోజు ఆ చిన్నారి యూనిఫాం లో కాకుండా బ్యాగ్ లో పెట్టిన అదనపు డ్రెస్ ధరించి ఇంటికి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ఆరా తీశారు. స్కూల్ లో టీచర్లు, ఆయాలు ఎవరూ ఆ పాపకు డ్రెస్ మార్చలేదని చెప్పారు. కాగా ఈ లోగా ఆ పాపను అడిగితే జరిగిన విషయం చెప్పింది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ ను అతడికి సహకరించిన మహిళను అరెస్టు చేశారు. కాగా ఈ దారుణ ఘటన పట్ల రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చిన్నారిపై అత్యాచార ఘటనను దాచి పెట్టేందుకు ప్రయత్నించిన స్కూలు యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.