కేసీఆర్ దెబ్బకు అమిత్ ఠా..!
posted on Oct 27, 2022 @ 3:55PM
తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై ప్రపంచంలోని తెలుగు వారంతా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది బీజేపీ వ్యవహారమని తెరాస అగ్ర నేతలు ఆరోపిస్తుంటే.. కాదు కాదు.. ఇది గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీ గారడీ అంటూ కమలం పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు దోషులు ఎవరనే అంశం సైడ్ అయిపోయింది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి మాత్రం.. ఈ కొనుగోలు వ్యవహారం తాలుకు గోల చాలా పెద్ద దెబ్బే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం.. మునుగోడు ఉప ఎన్నిక మీద స్పెషల్ ఎఫెక్ట్ చూపించినా.. చూపిస్తుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ ఉప ఎన్నికలో కారు... షికారు చేసే అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు. ఇందుకు రీజన్‌తోపాటు రీజనింగ్‌ను సైతం వారు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నిక అనేది.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల వచ్చిందన్న సంగతి విదితమే. అయితే మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కమల తీర్థం పుచ్చుకొన్నారు. ఆ క్రమంలో ఇదే వేదికపై నుంచి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక తర్వాత.. తెలంగాణలో ప్రభుత్వం రద్దు అవుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత.. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో సైతం అమిత్ షా సమావేశమయ్యారు.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అంత తేలికగా తీసుకోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం.. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి పోయి.. దాదాపు వారం రోజులు ఉన్నా.. ఆయన ఎవరితో భేటీ అయ్యారు, ఏం చేశారు అన్న వివరాలు బయటకు పొక్కలేదు. కానీ అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందంటూ వార్తలు గుప్పుమనడం.. ఆ క్రమంలో తెలంగాణలో ఈడీ సోదాలు సైతం నిర్వహించి.. బోయినపల్లి అభిషేక్ రావును ని అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లోనే గెలవడమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తన సత్తా చాటింది. ఆ తర్వాత కేసీఆర్.. తన కేబినెట్‌లో నుంచి ఈటల రాజేందర్ తొలగించడంతో.. ఆయన కారు పార్టీకి రాజీనామా చేసి.. కాషాయం కండువా కప్పుకోవడంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఈటల గెలవడంతో... కేసీఆర్ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని చర్చ సైతం కారు పార్టీలో జోరుగా సాగిందని గులాబీ పార్టీలోని కీలక నేతలు నేటికి చెబుతోంటారు.
ఇంకోవైపు హైదరాబాద్ విమోచన దినోత్సవం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే... ఈ ఎనిమిదేళ్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఘనంగా నిర్వహించిన దాఖలాలు అయితే లేవని.. కానీ ఈ ఏడాది ఈ విమోచన దినోత్సవం వేడుకలను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పోటా పోటీ పడి మరీ నిర్వహించాయని వారు గుర్తు చేస్తున్నారు.
బీజేపీ వల్లే.. తెలంగాణలో కేసీఆర్ పార్టీ సైతం విమోచనా దినోత్సవం నిర్వహించిందనే ఓ భావన రాష్ట్ర ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లిపోయిందని కారు పార్టీ అధినేత అండ్ కో పక్కాగా ఫిక్స్ అయిపోయినారని వారు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మునుగోడు ఉప ఎన్నికల్లో.. బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందంటే.. కారు పార్టీ అధినేత కేసీఆర్ ఉక్కిరి బిక్కిరితోపాటు తీవ్ర అసహనానికి గురయ్యే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.
అదీకాక.. ఇప్పటికే మునుగోడు వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా హార్ట్ చేశాయని వారు చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెరపైకి వచ్చి.. ఇంత రచ్చకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. కేంద్రంలో చక్రం తిప్పుతోన్నా హోం శాఖ మంత్రి అమిత్ షాకు మాత్రం ఇది పెద్ద దెబ్బనని.. అందుకే కేసీఆర్ దెబ్బకు అమిత్ ఠా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై హస్తినలోని కమలదళం అధిష్టానం... ఏ మేరకు చర్యలు.. అదే ప్రతీకార చర్యలు తీసుకొంటోందనేది మాత్రం.. వేచి చూడాల్సిందేనని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.