పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు
posted on Oct 27, 2022 @ 2:13PM
క్రికెట్ అనగానే పురుషుల క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. టెండూల్కర్, ధోనీ, కింగ్ కోహ్లీల గురించే చర్చోప చర్చలు. కానీ మరో వంక మహిళల క్రికెట్ దేశంలో ఎంతో ముందడుగువేస్తోంది. అంతర్జాతీయ టోర్నీల్లో గొప్పగా రాణిస్తోంది. కానీ పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టును గౌరవించడం చాలా తక్కువే. కారణాలు అనేక చెబుతారు కానీ ఇటీవలి కాలంలో మహిళలూ అద్భుతంగా రాణిస్తున్నారు. 2017లో టీ20 ప్రపంచకప్ రన్నర్ అప్ నిలిచిన భారత్ అమ్మాయిలు 2020 లో ఫైనల్ చేరుకున్నారు. అలాగే ఈ ఏడాది కామన్ వెల్గ్ గేమ్స లో రజత పతకం అందుకున్నారు. అన్ని విధాలా వారికి ఆర్ధిక పరంగా ఎంతో మద్దతు నియ్యాలనే విషయమై ఎంతో కాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఈ అంశంలో మాజీలు కూడా బీసీసీఐ స్పందించాలనే సూచనలు చేశారు. మొత్తానికి ఇప్పటికి మహిళ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి నుంచి మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటారు.
క్రికెటర్ల మధ్య ఫీజుకు సంబంధించి చాలా కాలం నుంచి ఉన్న వ్యత్యాసాలను తొలగించాలనే నిర్ణయిం చుకున్నామని, బీసీసీ ఐతో కాంట్రాక్టులో ఉన్నవారికి ఈ లబ్ధి పొందే అవకాశం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.
బీసీసీఐ నిర్ణయం ప్రకారం మహిళా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్ కి 3 లక్షలూ మ్యాచ్ ఫీజు రూపంలో అందుకుంటారు. 2023 లో మహిళల ఐపి ఎల్ ఆరంభానికి ముందే బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం దేశంలో మహిళా క్రికెటర్లను ఎంతో ఉత్సాహపరుస్తుంది. 2017 మహిళల ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచినప్పటి నుంచీ దేశంలో మహిళా క్రికెట్ పట్ల అభిమానం, ఆసక్తి రెండింతలయింది. అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ పట్ల మొగ్గు చూపుతు న్నారు.
ఈ ఏడాదిలోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని న్యూజిలాండ్ లో మహిళా క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించింది. అక్కడ కూడా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు లభిస్తోంది.