Read more!

సముద్రపు నీటితో సీమసరుకు తయారు!

సాంబారు మహిమో, మరి దేని మహిమో తెలియదుగానీ, తమిళ తంబీల బుర్రల్లో క్రియేటివిటీ పాళ్ళు కాస్తే ఎక్కువే వుంటుందనే విషయం చాలామందికి తెలిసిందే. అలాంటి వెరైటీ క్రియేటివ్ మనుషులు ఇప్పుడు మరికొంతమంది వెలుగులోకి వచ్చారు. తమిళనాడులో ‘మద్యం ప్రియుల సంఘం’ అనే ఒక సంఘం వుంది. దానికి ఎం.ఎస్.ఆర్ముగం అనే వింత మనిషి ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈయన ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. తమిళనాడులోని విగ్రవాండి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఆ స్థానం నుంచి ‘మద్యం ప్రియుల సంఘం’ తరఫున ఎం.ఎస్.ఆర్ముగం ఎన్నికల బరిలో నిలిచాడు. ఎన్నికలలో పోటీ చేయాలంటే, నామినేషన్ వేయాలంటే డిపాజిట్ చెల్లించాలి కదా.. ఆ డిపాజిట్ కోసం ఈ సంఘం సభ్యులందరూ ఏం చేశారంటే, మద్యం దుకాణాల దగ్గర దొరికే ఖాళీ బాటిళ్ళను సేకరించి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో డిపాజిట్ చెల్లించారు. జుట్టు విరబోసుకుని, చేతిలో పసుపు కొమ్ములు పెట్టుకుని ఆర్ముగం ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. 

ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే, తాను ఏమేం చేయబోతున్నాడో ఆర్ముగం చెబుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం తాగి మరణించిన వ్యక్తుల కుటుంబాలలోని మహిళలకు నెలనెలా 10 వేలు పెన్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తాడట. మద్యం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాడట. మద్యం తయారీకి ఉపయోగించే చెరకును ఉత్పత్తి చేస్తున్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని రిక్వెస్ట్ చేస్తాడట. సరే, ఇవన్నీ ఒకలా వుంటే, విచిత్రంగా వుండే మరో ఆలోచనని కూడా ఆర్ముగం బయటపెట్టాడు. సముద్రపు నీటి నుంచి బీరు, బ్రాందీ, విస్కీ లాంటి సీమ సరుకును తయారు చేసే విధంగా పరిశోధనలు జరిపిస్తాడట. ఏంటీ వింత హామీలు అని ఆర్ముగం తంబీ మీద విసుక్కోకండీ.. మద్యం ప్రియుల సంఘం సెక్రటరీ కదా... అందుకే తాగి వున్నాడని క్షమించేయండి.