కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి
posted on Apr 21, 2012 @ 10:50AM
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కొండంత అండగా ఉన్న పార్లమెంటు మాజీ సభ్యుడు తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యుల మాజీ కన్వీనర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మే నెల 2వ తేదీన తన మద్ధతుదార్లతో జరిగే సమావేశం లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి చాలా కాలంగా కాంగెస్ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకవైపు పార్టీ అధిష్టానం తెలంగాణా అంశంపై నాన్చుడు ధోరణి అవలంభిచడం, మరోవైపు వై.ఎస్. పధకాలను నిర్వీర్యం చేస్తుండటంతో ఆయన బహిరంగంగానే పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్న ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై సందిగ్ధత నెలకొని ఉంది. ఒకప్పుడు వై.ఎస్.కు సన్నిహితంగా మెలిగిన ఆయన ఇప్పటికీ వై.ఎస్.కు అనుకూలంగానే మాట్లాడు తున్నారు. అందువల్ల ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశా లున్నాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈయనకున్న అనుచరుల్లో అత్యధికులు టి.ఆర్.ఎస్.లో చేరాలని ఆయనను పట్టుబడు తున్నారు. అయితే టి.ఆర్.ఎస్.లో చేరితే తగిన గుర్తింపు ఉండదన్న భయాన్ని ఇంద్రకరణ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఒకవేళ వై.ఎస్.ఆర్. కాంగెస్ పార్టీలో చేరితే ఆయన మద్ధతుదార్లలో కొందరు ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంది.