మే నెలాఖరున మున్సిపోల్?
posted on Apr 21, 2012 @ 10:47AM
రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. రాజకీయపార్టీల దృష్టంతా 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపైనే ఉండి. అయితే ప్రభుత్వం అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికలకు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు మే నెలాఖరుకు కానీ, జూన్ మొదటివారం గానీ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
2010 సెప్టెంబరు 29ణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగిసింది. గత 19 నెలలుగా ఈ మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ఆలస్యం కావటంతో ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీల నుంచి కొత్త ఓటర్ల జాబితా వచ్చిన నాలుగునెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఫిబ్రవరి 29ణ రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికి తోడు కేంద్రప్రభుత్వం వివిధ పట్టణాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తోంది. అయితే స్పెషలాఫీసర్ల పాలనలో ఉండే మున్సిపాలిటీలకు ఈ నిధులు అందవు. అందుకే ఈ నిధుల కోసమైనా వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.