Read more!

విందులతో పసందు!!

 

దేశాలు ఎన్నైనా ఈ ప్రపంచానికి ఆహారమే శక్తి వనరు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు బిజీ అయ్యేకొద్ది ఇంటిపట్టున వంట చేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఫలితంగా వీధి వీధికి కనిష్టంగా కనీసం నాలుగైదు హోటల్స్ వెలుస్తున్నాయి. అవి మాత్రమే కాకుండా తోపుడు బండ్ల మీద, వెహికల్స్ లోనూ వచ్చి అమ్ముతున్నవాళ్ళు ఎక్కువయ్యారు. ఇది ఎంతోమందికి ఉపాధిగా కూడా మారిందనడంలో ఆశ్చర్యం లేదు.

ఫుడ్ లవర్స్!!

క్రమంగా ఫుడ్ లవర్స్ హంగామా పెరుగుతూ పోతోంది అనడానికి ఉదాహరణ యూట్యూబ్ లో కోకొల్లలుగా ఫుడ్ బ్లాగర్లు అప్లోడ్ చేసే వీడియోలే. వివిధ ప్రాంతాలు, వివిధ ప్రఖ్యాతి గాంచిన ఆహారపదార్థాలను వెతుక్కుంటూ వారు చేసే ప్రయాణం ఆశక్తికరంగానూ, నోరూరిస్తూను ఉంటాయి. ఈ ఫుడ్ బ్లాగర్లు చేసే హంగామా వల్లనే బోలెడు పదార్థాల ఉనికి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాచీన వంటకాలు, వాటిని కొన్ని దశాబ్దాల నుండి అమ్ముతున్న దుకాణాలు, వాటి చరిత్ర మొదలైనవి అన్ని ఈ ఫుడ్ బ్లాగర్ల వల్లనే తెలుస్తున్నాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

విభిన్న ప్రయోగాలు!!

కొందరు సాధారణంగా ఇంట్లోనూ, బయట కూడా తిన్నదే తినడం అంటే బాగా చిరాకు తెచ్చేసుకుంటారు. తినే పదార్థాల విషయంలో కూడా విభిన్నత కోరుకునే వారు చక్కగా తమవైన ప్రయోగలలోకి కూడా దిగేస్తారు. ఫలితంగా కొత్త కొత్త వంటకాలు అవిష్కృతం అవుతుంటాయి. ఆ నమ్మకం కాస్తా పెరిరి పెద్దవుతూ వాళ్ళను వ్యాపార సామ్రాజ్యంలోకి దింపుతోంది. వంటకాల మీద కూడా హక్కులు తీసుకుని వాటిని తమవిగా చెప్పుకుని, వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కొన్ని వంటకాలు కేవలం కొన్ని రెస్టారెంట్లలోనే లభ్యమవడం అందరూ చూస్తుంటారు. దాని వెనుక కారణం కూడా ఇదే. 

రుచి సూత్రం!!

ఆహారపదార్థాల విషయంలో అందరూ ఫిదా అయ్యేది రుచికె. కొన్ని చోట్ల తిన్న పదార్థాలను వేరే ఎక్కడ ప్రయత్నించినా ఆ రుచి కనిపించకపోవచ్చు. దానిక్కరణం కూడా వాళ్ళు పాటించే రహస్య సూత్రాలు. దానివల్లనే వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అందుకే చాలా వరకు ఆహారపదార్థాల తయారీ బయటకీ చెప్పరు. ముఖ్యంగా రెస్టారెంట్ లలో కఠిన నియమాలు ఉంటాయి కూడా. కాబట్టే ఫుడ్ లవర్స్ అధిక ధర వెచ్చించి మరీ రెస్టారెంట్స్ లో తినడానికి వెళ్తుంటారు.

ఆకలి రాజ్యం కాసుల వర్షం!!

నిజమే ఆకలి రాజ్యంలో ఆహారాన్ని అమ్మడం అనేది ఎప్పటికీ నష్టం తెచ్చే ప్రయోగం మాత్రం కాదు. పాటించాల్సిధల్లా  రుచి, శుచి, ఉపయోగించే పదార్థాలు  మన్నికగా ఉన్నవి వాడటం. ఇంకా సర్వింగ్ లో గౌరవం. ముఖ్యంగా వచ్చి పోయేవాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం. నిజానికి రుచి నచ్చితే గంటల తరబడి ఎదురుచూసి తినే వాళ్ళు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. కాబట్టే వీధి వీధిలో రోజురోజుకూ హోటల్స్ కొత్తగా వెలుస్తూనే ఉన్నాయి.

వృత్తి, ప్రవృత్తి జీవితానికి శక్తి!!

అవును ఇది నిజం. కొందరు ఉదయం సాయంత్రం మాత్రమే ఇలాంటి హోటల్స్ నడుపుకుంటూ, వీటిని ప్రవృత్తిగా చేసుకుంటూ మధ్యలో తమదైన పనులు కూడా సాగిస్తారు, మరికొందరు పట్టు వచ్చిన తరువాత దాన్నే వృత్తిగా మార్చుకుని స్థిరంగా నిలబడతారు. మహిళలు అయితే తమకున్న వంటల నైపుణ్యతను వధులుకోకుండా రోజూ ఓ ఇద్దరో, ముగ్గరో మనుషులకు క్యారియర్లు పంపుతూ సంపాదిస్తారు. ఇది మాత్రమే కాకుండా హోమ్ మేడ్ ఫుడ్స్, పచ్చళ్ళు, పొడులు, చిరుతిండ్లు ఇంకా అదనంగా పండుగలకు ప్రత్యేక పిండి వంటకాలు. సంప్రదాయతను జోడించి ఎంతో రుచిగా చేసి అమ్ముతూ వారిదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియర్ సౌకర్యాలు, ఆన్లైన్ ఆర్డర్లు, డబ్బు చెల్లింపులు సులభం అవ్వడం. ఇవ్వన్నీ కూడా జీవితాలు సాఫీగా సాగడానికి ఎంతో సహాయపడుతున్నాయి.

ఇట్లా హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న తోపుడు బండ్లు, ఇంకా పెళ్లిళ్లు, ఫంక్షన్ లకు క్యాటరింగ్ చేయడం. తమకు వచ్చిన రుచిని నలుగురికి చేరవేస్తూ వ్యాపారసూత్రం పాటిస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు నేటితరం వంటల సామ్రాజ్యాధిపతులు.

◆ వెంకటేష్ పువ్వాడ