Read more!

బహుమతులు ఇలా ఇవ్వండి!

చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు, ఆత్మీయులు, పిల్లలు, భాగస్వామి, తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు ఇలా ప్రతి మనిషి జీవితంలో బోల్డు రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ లో కొన్ని ఘాడమైన బంధాలు, మరికొన్ని ఎదో అట్లా తెలిసిన వాళ్ళలా సాగిపోయే బంధాలు. మొత్తానికి ఇట్లా ఎందరితోనో అటాచ్మెంట్ ఉన్నపుడు వారి వారి జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు వస్తుంటాయి. ఆయా సందర్భాలలో ఇష్టంగానో, మొహమాటంగానో, బాద్యతగానో బహుమానాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ బహుమతుల విషయంలో ఎంతో ఉదాసీనంగా ఉంటారు. కానీ బహుమతులు ఇవ్వడంలో కాస్త ఆసక్తి ఉండాలే కానీ చిన్న చిన్న బహుమతులు, చిన్న సందర్భాలు కూడా ఎంతో గొప్ప జ్ఞాపకాలు అవుతాయి అవతలి వారి జీవితంలో. అలాగే బహుమతి ఇచ్చిన వారు కూడా ఎంతో బాగా గుర్తుండిపోతారు, ఒకానొక ఆప్యాయతా బీజం మొలకెత్తి అది రానురాను పెరుగుతూ బలపడుతుంది.

అయితే అందరికీ కావాల్సింది ఇలా బహుమతులు విషయంలో కాసింత అవగాహన మాత్రమే!! 

కాగితాల గోలలు వద్దు!

చాలామంది పెళ్లి, పుట్టినరోజులు, గృహప్రవేశాలు మరింకా ఇంకా ఏవైనా శుభసందర్బాలకు పిలిచినపుడు 90% మంది చేసే పని ఒక గిఫ్ట్ కవర్ లో వంద నుండి తమకు తోచినంత డబ్బును పెట్టేసి, దాని మీద పేరు రాసి ప్రెజెంటేషన్ గా ఇచ్చేయడం. అయితే అలా ఇచ్చిన డబ్బు ఆ కవర్ తీసేయగానే గుంపులో గోవిందలాగా కలసిపోతుంది. ఆ డబ్బు స్వరూపమే మారిపోతుంది. దానికంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది. సాదారణంగా కొందరు అలా ప్రెజెంటేషన్ లు రూపంలో వచ్చిన డబ్బుతో ఇంట్లో వాడుకోవడానికి గుర్తుగా మంచి వస్తువు తీసుకుంటూ ఉంటారు. కానీ మరికొంతమంది వాటిని బీరువాలో పెట్టి ఏదో అలా వాడేస్తారు. అప్పుడు మీరిచ్చిన భజమతి ఏమైంది అంటే ఏమో!!

బహుమతి ఇచ్చేసాక ఇక దాని గూర్చి మాకెందుకు అనుకునే అభిరుచి లేనివాళ్లకో మాట. కూసింత కళా పోషణ ఉండాలి కదా!! మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా!! అందుకే మరి కాగితాల ప్రెజెంటేషన్ లు వద్దు.

మరింకెమి ఇవ్వాలి?

డబ్బు ఖర్చుపెట్టుకునే సామర్త్యాన్ని బట్టి బహుమతులను కూడా వర్గాలుగా విభజించవచ్చు. అలాగే అవతలి వారి వయసును బట్టి, వారి గురించి కాస్తో కూస్తో ఉన్న అవగాహనను బట్టి ఇవ్వచ్చు.

బట్టలు ఇవ్వడం రొటీన్ కానీ అందులోనూ ప్రత్యేకత చూపించచ్చు. అవతలి వాళ్లకి నచ్చిన రంగు తెలుసుకుని వయసులో ఉన్నవాళ్లకు అయితే కాస్త ట్రెండ్ కు తగ్గట్టూ, పెద్దవాళ్లకు అయితే సాంప్రదాయంగా ఉండేలా ఇవ్వచ్చు. 

ప్రతి మనిషి జీవితంలో అవసరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. వయసును బట్టి వాటి ప్రాధాన్యత ఉంటుంది. అంతే కాదు అవతలి వాళ్ళ అభిరుచులను బట్టి కూడా బహుమతులు ఇవ్వచ్చు. 

డాన్స్ బాగా చేసేవాళ్లకు అయితే వాళ్లకు నచ్చిన పాటలున్న cd, మంచి కలెక్షన్ ఉన్న డాన్స్ వీడియోస్, అలాగే వాళ్లకు కంఫర్ట్ గా ఉండే దుస్తులు, రాసే అలవాటు ఉన్నవాళ్లకు పెన్ను, వాళ్ళు రాసేవి అన్ని ఒకచోట పొందిగ్గ రాసుకోడానికి అందమైన పుస్తకం, సినిమాలు అంటే అభిరుచి ఉన్న వాళ్లకు నచ్చిన నటుడి/నటి సినిమా కలెక్షన్ ఉన్న పెండ్రైవ్, లేదా cd. ఇంకా రీడింగ్ లాంప్, వాచ్, మంచి పుస్తకాలు, మంచి కళ్ళజోడు ఫ్రేమ్ లు, షూస్, అమ్మాయిలకు అయితే తెగ నచ్చే కాళ్ళ పట్టీలు(వెండే అక్కర్లేదు. కాస్త ఫాషన్ గా ఉన్నవి బోల్డు అందుబాటులో ఉంటాయి షాప్స్ లో. అవి ఎప్పుడన్నా వేసుకోవడానికి స్టైలిష్ గా ఉంటాయి).

ఇంకా ఫ్రెండ్స్ ను ఎంకరేజ్ మరియు ఆరోగ్యంగా ఉంచే ఫిట్నెస్ పరికరాలు. ముఖ్యంగా చూసుకోడానికి వెయిటింగ్ మిషన్ ఇలాంటి…..

పెద్దవాళ్లకు హాండ్ స్టిక్, హెల్త్ కిట్స్ లో ఉండే షుగర్, బిపి చెకప్ మీటర్స్, మంచి నడకకోసం మెత్తటి చెప్పులు, అలాగే కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలా కుర్చీ, బల్ల, ఆర్థిక స్థాయిని బట్టి పడుకోవడానికి ఏర్పాట్లు. పెద్దల ఆసక్తిని బట్టి ఆధ్యాత్మిక గ్రంధాలు. 

ఇక సాధారణ పరిచయస్తులకు అయితే ఇంటి ఉపకరణాలు. కాఫీ కప్, డైనింగ్ కిట్, దేవుడి గదిలో అందంగా ఉంచుకునే వస్తువులు. కిచెన్ లో అవసరమయ్యేవి, ముఖ్యంగా ఇప్పట్లో ఆన్లైన్ స్టోర్ లలో తక్కువ ధరలతో మంచి వస్తువులు దొరుకుతున్నాయి, అవి మాత్రమే కాకుండా చైనా బజార్, సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటి ముఖద్వారంలో తోరణాలు, వాల్ హంగేర్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. 

అన్నిగి కంటే ముఖ్యమైనది అవతలి వారు వెతికి ప్రాధాన్యం ఇస్తారు తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడానికి పెద్ద కష్టపదక్కర్లేదు సాధారణ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి బహుమతులు ఇచ్చేటప్పుడు మీదైన మార్క్ చూపించండి. 

◆ వెంకటేష్ పువ్వాడ