నేల తవ్వితే.. నోట్లు బయటపడ్డాయి!
posted on Jul 29, 2022 @ 11:16PM
తాతగారో, తండ్రో కలలో కనిపించి ఆభరణాల పెట్టె ఎక్కడుందో చెప్పడం హీరో బావిలోకో, చెరువులోకో దూకి దాన్ని సాధించడం పాత సినిమాల్లో చూసి అమితాశ్చర్యపడటం దాదాపు అందరికీ అనుభవమే. కానీ దాదాపు అలాంటి సంఘటనే ఈ రోజుల్లోనూ జరిగింది. తొంభయ్యేళ్లనాటి నోట్ల కట్టల మిస్టరీని ఓ జంట ఛేదించి సంబరపడిపోతోంది.
న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన రిచర్డ్, సుజేన్ గిల్సన్ దంపతులు నాలుగేళ్ల క్రితం వైల్డ్‌వుడ్ ప్రాంతంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. అది 1920ల్లో నిర్మించిన కాటేజీ. 1930ల్లో ఆ ఇల్లు.. జేమ్స్ డెంప్సీ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది. రిచర్డ్, సుజేన్ దంప తులు ఆ ఇంటిని కొనుగోలు చేశాక..తమకు నచ్చిన విధంగా ఇంటికి కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో ఓ రోజు రిచర్డ్.. చెట్లు పాతేందుకు ఇంటి ముందు నేల తవ్వుతుండగా.. నోట్ల కట్టలు బయటపడ్డాయి.
రిచర్డ్ కి కనిపించిన ఆ నోట్లమీద 1934 అని ముద్రించి ఉంది. లెక్కపెట్టి చూడగా.. అవి మొత్తం 2 వేల డాలర్లని తేలింది. దీంతో.. రిచర్డ్ ఒక్కసారిగా షాకైపోయాడు. 90 ఏళ్ల నాటి కరెన్సీ నోట్లు చూసి అతడికి నోటమాట రాలేదు. నేటి లెక్కల ప్రకారం వాటి విలువ దాదాపు 40 వేల డాలర్లు. అయితే..రిచర్డ్ అవన్నీ దాచేసుకుని ఆనక క్యాష్ చేసుకుందామని కామెడీగా ఏమీ ఆలోచించ లేదు. వెంటనే తన భార్యకి ఈ సంగతి చెప్పాడు. ఆ నగదు భూమిలో ఎందుకు పెట్టారు, ఎవరిది అనేది ఇంకా తేలవలసి ఉంది.
చాలాకాలం అది మిస్టరీగానే ఉండిపోయింది. ఇటీవల ఆ జంట జేమ్స్ డెంప్సీ మనవరాలిని కలుసుకోవడంతో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆ డబ్బుని నేలలో పాతిపెట్టమని తన తాత అప్పట్లో తన తల్లికి చెప్పినట్టు జేమ్స్ మనవరాలు పేర్కొంది. ఆ తరువాత.. తన కుటుంబం ఆ డబ్బు కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోయిందని చెప్పింది. ఇన్నాళ్ల తరువాత ఆ సంపద రిచర్డ్ దంపతులకు దొరికినందుకు ఆశ్చర్యపోయింది. అయితే.. ఈ డబ్బును తాను అస్సలు ఖర్చు చేయనని రిచర్డ్ మీడియాకు తెలిపారు. ఆ నోట్ల వెనకున్న చరిత్ర చాలా ఆసక్తికరమైనది. తొంభై ఏళ్ల నాడు ఓ వ్యక్తి చేసిన పనికి ఇది సాక్ష్యం. ఆ డబ్బులను ఏం చేస్తావని నిత్యం అనేక మంది అడుగుతుంటారని, ఆ డబ్బును తాను ఖర్చుపెట్టననీ రిచర్డ్ చెప్పారు.