సముద్రంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. అనకాపల్లి జిల్లాలో విషాదం
posted on Jul 30, 2022 6:30AM
అనకాపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పూడిమడక సముద్ర తీరానికి సరదాగా పిక్నిక్ కోసం వెళ్లిన విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతయ్యారు. అనకాపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం పూడి మడక సీషోర్ కు వెళ్లరు. సముద్రంలో ఈతకు దిగిన వారిలో ఏడుగురు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరిని స్థానికులు రక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. పూడిమడక సముద్ర అలల ఉధృతి అధికంగా ఉంటుందని ఇక్కడ సముద్రంలో ఈత కొట్టడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన జగదీష్, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీష్, చూచుకొండకు చెందిన గణేష్, యలమంచలికి చెందిన చందులు ఉన్నారు.
గల్లంతైన విద్యార్ధుల గాలింపు కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. మరో వైపు మెరైన్, కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు మరికొంత మంది రక్షణ సిబ్బంది సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పూడిమడక సముద్రతీరంలో తమ పిల్లలు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయా కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ సహచర విద్యార్ధులు మృత్యుబాట పట్టారని తెలుసుకున్న సహచర విద్యార్ధులు పెద్ద ఎత్తున పూడిమడక ప్రాంతానికి చేరుకున్నారు.