దీర్ఘాయుష్మాన్ జపాన్..
posted on Jul 31, 2020 @ 2:37PM
తొమ్మిది పదుల వయసు దాటినవారు 20లక్షలకు పైగా
సగటు జీవన ప్రమాణం 85ఏండ్లు
ఆహారపు అలవాట్లే దీర్ఘాయుష్ కు కారణం
స్వచ్ఛత, శుభ్రత వారి దినచర్యలో భాగం
అగ్ర రాజ్యాలను, అభివృద్ధి చెందిన దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ జపాన్ లో పెద్ద ప్రభామేమీ చూపలేదు. వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచదేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. అయితే వయోవృద్ధుల జనాభా ఎక్కువ ఉండే జపాన్ ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో అని ఆందోళన ఏర్పడింది. అయితే జపాన్ మాత్రం చాలా త్వరగానే కోవిద్ 19ను అరికట్టగలగడంతో పాటు తమ దేశ సంపదగా భావించే వృద్ధులను రక్షించుకుంది. అయితే అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కరోనా విజృంభిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది జపాన్ ప్రజల జీవనవిధానం.
మనిషి సగటు జీవన ప్రమాణం అత్యధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ది రెండో స్థానం. సగటు జీవన ప్రమాణం 89 ఏండ్లతో మొదటిస్థానం మొనాకో దేశానిది. జనాన్ లో 90ఏండ్లు పై బడిన వారి సంఖ్య 20లక్షలకు పైనే. వారిలో శతాధిక వృద్ధుల సంఖ్య దాదాపు 69,785. అంటే సగటు జీవన ప్రమాణాల కాలం 84.2 ఏండ్లు. పురుషుల జీవన ప్రమాణ కాలం 81.1 ఏండ్లు కాగా, మహిళల జీవన ప్రమాణ కాలం ఇంకాస్త ఎక్కువగా అంటే 87.1 ఏండ్లుగా ఉంది.
జపానీయుల ఆహారపు అలవాట్లు జీవనవిధానం ప్రపంచాన్ని ఎప్పుడు అబ్బురపరుస్తూనే ఉంది. వారి దీర్ఘాయుష్ పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. జన్యుపరంగా ఎక్కువ కాలం జీవించడం అక్కడ మాములే అనుకుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన చాలా అధ్యాయాలు వారి జీవనవిధానం, ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశాయి.
జపాన్ ప్రజలు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు తాజా కూరగాయలు, సీజనల్ గా లభించే పండ్లు తప్పక తింటారు. అంతేకాదు ప్రాసెసింగ్ చేసిన, ప్యాకెట్స్, టిన్స్ లోని ఆహారాన్ని వారు అసలు ఇష్టపడరు. అంతేకాదు జపానీయుల ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఇష్టంగా తీసుకుంటారు. అందుకే చేపల వినియోగంలో ప్రపంచంలో ఆరవ స్థానంలో జపాన్ ఉంది. మాంసంలో కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 36 శాతం గుండె సంబంధిత మరణాలను ఇది తగ్గిస్తుంది.
ప్రతి సంవత్సరం దాదాపు లక్ష టన్నుల సముద్రపు నాచు(సీవుడ్)ను ఆహారంగా తీసుకుంటారు. ఒక కప్పు సముద్రపు నాచులో 2 -9 గ్రాముల ప్రోటీన్ తో పాటు సహజ సిద్ధంగా దొరికే అయోడిన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు రావు. దీనికి తోడు వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి మరో కారణం ఆహారాన్ని మితంగా తీసుకోవడం.
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అక్కడి ప్రజల్లో స్థూలకాయం సమస్య చాలా తక్కువ. ప్రపంచంలోని అధిక బరువు ఉన్నవారిలో జపానీయుల సంఖ్య కేవలం 3.6శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఇదే చాలా తక్కువ.
జపాన్ ప్రజల జీవన ప్రమాణ కాలం ఎక్కువగా ఉండటానికి మరో కారణం ఎక్కువగా చాయ్ తాగటం. సహజంగా కాఫీ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాయ్ లోనే ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటూ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.
జపాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది. మిగతా వాటితో పోల్చితే 70 శాతం ఆరోగ్యంపైనే ఖర్చు చేస్తుంది.
మిగతా దేశాల వాళ్ళతో పోల్చితే జపనీయుల ఎత్తు కాస్త తక్కువే. శరీర నిర్మాణం కూడా ఒక అడ్వాంటేజ్. దీంతో చురుగ్గా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియ విధానం సక్రమంగా జరుగుతుంది. ఆఫీసుకు వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళడమో లేదా సైకిల్ మీద వెళ్ళటానికే ఇష్టపడతారు. జపాన్ లోని వయోవృద్ధులు సాధ్యమైనంత వరకు శారీరక శ్రమలో భాగస్వాములు అవుతూ ఉంటారు.
ఆరోగ్యంగా ఉండటానికి మరో కారణం 85 శాతం మంది జపనీయుల రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేస్తారు. నిద్రించే ముందు వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే మలీనాలు సులభంగా వెళ్లిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వీటన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం జపనీయులు తమ ఆచారా వ్యవహారాలను తప్పక పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. మన దేశంలో పిల్లలను సంపదగా భావస్తాం. జపాన్ లో పెద్దవారిని సంపదగా భావిస్తారు. వయోవృద్ధుల నుంచి ఎన్నో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే స్వచ్చత, శుభ్రత నేర్పిస్తారు.
మితంగా తింటూ అమితంగా పెద్దలను, సంస్కృతిని గౌరవించడమే జపానీయుల ఆరోగ్య రహాస్యమని చెప్పక తప్పదు.