400 ఎకరాల వివాదం.. అసలు విషయం ఏంటంటే?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ  ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది.  అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దాదాపు 200 మంది విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ లు కండించాయి. భూముల వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,  ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ సర్కార్ కూ పడుతందని హెచ్చరించారు.  హెచ్ యూసీకి ఆనుకుని ఉన్న ఈ భూములను గతంలో అంటే 2004లో అప్పటి ప్రభుత్వం  ఈ 400 ఎకరాల భూమిని క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం న్యూయార్క్ కు చెందిన ఐఎంజీకి (ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్) కేటాయించింది.   ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం న్యాయపోరాటం కూడా జరిగింది.  ఎట్టకేలకు 2024 ఏప్రిల్ లో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ భూమిని వినియోగించుకోవాలని భావించింది. 
2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా ఈ భూమి హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది ప్రభుత్వం చెబుతోంది.  

గత ఏడాది జులైలో   యూనివర్సిటీ రిజిస్ట్రార్ సమ క్షంలో సర్వే కూడా నిర్వహించింది. ఎటువంటి ఇబ్బందులూ లేని కారణంగానే ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిలో సరస్సులు, బఫర్ జోన్ లు లేవనీ స్పష్టం చేసింది. పర్యావరణ పరంగా కీలకమైన రాక్ ఫార్మేషన్లు, సరస్సులను హరిత ప్రదేశాలుగా ప్రకటించి వాటిని పరరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు రేవంత్ సర్కార్ విస్పష్ట హామీ ఇచ్చింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిని ఆక్రమించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా రాతి నిర్మాణాలు, సరస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నశనం చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఐఎంజీ కేటాయింపు రద్దును సుప్రీం కోర్టు సమర్ధించి ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువరించిన తరువాతనే వీటిని వేలం వేయాలని నిర్ణయించామనీ, విద్యార్థుల మనో భావాలను గాయపరిచే ఏ నిర్ణయం తీసుకోబోమనీ ప్రభుత్వం స్పష్టం చేసిందిి.