తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
posted on Mar 31, 2025 @ 3:03PM
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్ 3) వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం పేర్కొంది.
ఈ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడు తుందనీ, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2, 3 తేదీల్లో వానల కారణంగా వాతావరణం చల్లబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమురం భీమ్, వనపర్తి, నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.