ఆర్టీసీ బస్సులో 14 కిలోల బంగారం..
posted on Mar 26, 2021 @ 3:03PM
ఇటీవల నల్గొండ జిల్లా పంతంగి టోల్‌గేట్ దగ్గర 26 కిలోల బంగారం సీజ్. స్మగ్లర్లు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అలాంటిదే మరో ఘటన. ఈ సారి స్టేట్ మారింది. ఏపీలో జరిగింది. విమానాలు, కారుల్లో తరలిస్తే తనిఖీలు ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు కాబోలు.. ఏకంగా ఆర్టీసీ బస్సులో 14 కిలోల బంగారం తరలిస్తున్నారు. అయినా, పోలీసులకు చిక్కారు. అయితే, తాను స్మగ్లర్‌ని కాదని బంగారం షాపులో పని చేస్తున్నానని చెబుతున్నాడు ఆ గోల్డ్ ట్రాన్స్‌పోర్టర్.
ఏపీలో అక్రమ బంగారం రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పంచాలింగాల దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బస్సులో అప్పటి వరకూ తమ పక్కన కూర్చున్న ప్రయాణీకుడి దగ్గర అంత పెద్ద మొత్తంలో బంగారం ఉండటం చూసి తోటి ప్యాసింజర్లు అవాక్కయ్యారు. పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో రాజు అనే ప్రయాణీకుడి బ్యాగులో ఈ బంగారం లభించింది. 14.9 కిలోల బరువున్న ఆ గోల్డ్ బిస్కెట్స్ విలువ.. సుమారు 6.86 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో తాను పని చేస్తున్నట్టు రాజు చెప్పాడు. యాజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణం నుంచి బంగారం తరలిస్తున్నట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే, బంగారానికి సరియైన పత్రాలు కానీ, ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి ఆ గోల్డ్‌ను సీజ్ చేశారు పోలీసులు.
ఈ బంగారాన్ని నిజంగానే షాపు యజమాని అక్రమ మార్గంలో తరలిస్తున్నారా? లేక బంగారాన్ని తరలించే వ్యక్తి చోరీ చేసి తీసుకువస్తున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో బంగారం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉండడంతోనే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు.. ఏవైనా లావాదేవీల్లో తేడా వచ్చి పట్టించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు ఎస్ఈబి అధికారులు తనిఖీలతో ఇంత భారీ బంగారం బయటపడటం సంచలనంగా మారింది. దొరికిన బంగారంలో ఆభరణాలు లేవు. మొత్తం 14.8 కేజీలు గోల్డ్ బిస్కెట్లే కావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి కడపకు ఈ బంగారపు బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు మాత్రం వ్యాపారం కోసమే తరలిస్తామని చెబుతున్నా.. అందుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.