మతం పేరుతో కల్లోలం.. షర్మిల ఆగ్రహం
posted on Mar 26, 2021 @ 3:01PM
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పాలనపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ ను టార్గెట్ చేశారు షర్మిల. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో జరిగిన సమావేశంలో ఆమె సంచలన కామెంట్లు చేశారు.
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో ఇచ్చారంట... బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట అంటూ అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా? అని నిలదీశారు. పసుపు రైతుల కష్టాలు చూస్తే బాధేస్తుందన్న షర్మిల.. ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? అని ప్రశ్నించారు. ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా? అని షర్మిల అన్నారు. బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా?’’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు. బైంసా అల్లర్లకు ఎవరు బాధ్యులు.. మీ రాజకీయాల కోసం సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లా అభిమానుల సమావేశంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరామ్ పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అంటూ షర్మిల తనదైన శైలిలో మాట్లాడారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాం కి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ, మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ ది అదిలాబాద్ జిల్లా అన్నారు. జలియన్ వాలా బాగ్ తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తెనే ఉందన్నారు షర్మిల.