జైపాల్ సాయానికి టి కాంగ్రెస్ నేతల రిక్వెస్ట్
posted on Jan 5, 2013 @ 5:32PM
ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రంఫై వత్తిడి తెచ్చే కార్యాచరణను ఖరారు చేసేందుకు ఇటీవలే హైదరాబాద్ లో సమావేశం అయిన తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇక సీన్ ను ఢిల్లీ కి మార్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణాఫై ఓ నెల రోజుల్లో నిర్ణయం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడే, ఒక వారం పూర్తయిపోయింది.
దీనితో, ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కె.జానా రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ని కలిసి ఈ విషయంలో తన వంతు ప్రయత్నాలు చేయాలని కోరినట్లు సమాచారం. నిన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశం వివరాలను కూడా జానా రెడ్డి, జైపాల్ కు వివరించినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం తెలంగాణా కు అనుకూలంగా ఉండేలా తగిన విధంగా వత్తిడి తేవాలని ఆయన జైపాల్ కు సూచించినట్లు సమాచారం.
ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ప్రత్యెక రాష్ట్రమేనని జానా రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. జానా రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ ను కూడా తన ఢిల్లీ పర్యటనలో కలువనున్నారు.