హాస్పటల్ నుండి మలాలా డిశ్చార్జ్
posted on Jan 5, 2013 @ 11:46AM
తాలిబన్ల ఆటవిక చర్యకు తీవ్రంగా గాయపడి లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిన్న ఆసుపత్రి నుండి తాత్కాలికంగా డిశ్చార్జ్ అయ్యారు.
పదిహేను సంవత్సరాల మలాలా తలఫై తాలిబన్లు గత అక్టోబర్ 9 న కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఎడమ కంటి ఫై భాగం నుండి ఓ బుల్లెట్ దూసుకువెళ్ళింది. ఆ బాలిక పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆమెను పాకిస్తాన్ ప్రభుత్వం లండన్ కు తరలించింది. ఆమె ప్రస్తుతం కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేసామని ఆ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలియచేసింది. కాగా, భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆమెకు ఈ నెల చివర్లో మరో శస్త్ర చికిత్స చేయాల్సిఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకూ ఆమె అవుట్ పేషంట్ గా ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి.
పాకిస్తాన్ లోని స్వాట్ లోయలో బాలికలు విద్యను అభ్యసించడంఫై తాలిబన్లు విధించిన ఆంక్షలను ప్రశ్నించిన పాపానికి ఆమెఫై తాలిబాన్లు కాల్పులు జరిపారు. వివిధ వర్గాలతో చిన్నభిన్నంగా ఉండే పాకిస్తాన్ ప్రజలంతా మలాలాఫై దాడిని మాత్రం ఖండించి ఆ బాలికఫై తమ అభిమానాన్ని చూపించుకొన్నారు.