తెలంగాణాఫై నిర్ణయం దిశగా కాంగ్రెస్ ?
posted on Jan 5, 2013 @ 5:55PM
ఇంత కాలం ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో నాన్చుడు ధోరణి అవలంభించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక తెలంగాణా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలనే అంతిమ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రి షిండే చెప్పిన దాని ప్రకారం రిపబ్లిక్ దినోత్సవం సమయానికి కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.
పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టింది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్రమే తమకు అంగీకారమని ఆ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు తమ అధిష్టానానికి చెప్పారు. ఇక తెలంగాణా అభివృద్ధి మండలి కూడా ఒక పరిష్కార మార్గంగా పార్టీ భావిస్తున్నట్లు ఇప్పటికే మీడియా లో పలు కధనాలు వచ్చాయి.
మరోవైపు తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశాలను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ విషయంలో ఓ అవగాహనకు రావడానికి చండీఘర్ విషయాన్ని అధ్యయనం చేస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నేతలను ఇప్పటికే పార్టీ కలిసి ఇలా చేస్తే ఉండే కష్ట నష్టాలను తెలుసుకుంది.
అన్ని విషయాలను అధ్యయనం చేసిన పిదప ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సిన భాద్యత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల్లో ఉంది.