మహాకుంభమేళాలో తొక్కిసలాట: 36 మంది మృతి
posted on Feb 11, 2013 9:04AM
మహాకుంభమేళాలో అనూహ్యంగా సంభవించిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. మౌని అమావాస్య పురస్కరించుకొని కుంభమేళాకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు పూర్తిచేసుకొని అలహాబాద్ రైల్వేస్టేషన్‌కు తిరిగి వచ్చిన సమయంలోనే రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగిందని డివిజనల్ రైల్వే మేనేజర్ హరీందర్‌రావు తెలిపారు. 5, 6 నెంబర్ల ప్లాట్‌ఫారాల వద్దకు వేలాదిమంది యాత్రికులు ఒకేసారి చేరుకోవడంతో ఈ ఘటన సంభవించింది.
ప్రత్యక్షసాక్షులు చెపుతున్న కథనం ప్రకారం, యాత్రికులు పెద్దసంఖ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరడంతో ఒక్కసారిగా అది 6వ నెంబర్ ప్లాట్‌ఫారంపై కూలిపోయింది. మూడు గంటల తర్వాత 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మరణించినట్లుగా అర్ధరాత్రి అందిన సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 36 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారతీయ రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.