ఔనంటే కాదనిలే వద్దంటే ఇమ్మనిలే....

 

రాబోయే ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని ఖాయం అయిపోయిన తరువాత, ఇప్పుడు అందరి కళ్ళు దాని ప్రత్యమ్నాయమయిన భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నాయి. ఆ పార్టీలో ప్రముఖంగా మోడీ, అద్వానీ పేర్లు వినిపిస్తున్నపటికీ, మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ప్రధాన మంత్రి పదవికి ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

వీరికి అదనంగా యన్.డీ.యే. కూటమి నుంచి కూడా కొందరు మాక్కూడా ప్రధాన మంత్రి పదవికి ‘ఒకే ఒక్క చాన్స్!’ అంటూ తమ సహచారులద్వారా తమ గళం వినిపిస్తున్నారు. వారిలో సమైక్య రాష్ట్రీయ జనత దళ్ పార్టీ అధ్యక్షుడయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు.

 

మూడు రోజుల క్రితం శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్స బీహారులోని బౌద్ధ గయకు వచ్చిన సందర్భంగా, ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్ళిన నితీష్ కుమార్ ను, పత్రికలవారు ఆయన పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి హరి కిశోర్ సింగ్ ‘నితీష్ కుమార్ ప్రధాన పదవికి అన్ని విధాల అర్హుడు’ అన్నమాటలను గుర్తు చేసి, ఆయన ప్రతిస్పందన కోరినప్పుడు, "ఇటువంటివన్నీ పనికిరాని మాటలు. నేను ప్రధాన మంత్రి పదవి రేసులో లేను. ఎందుకంటే నేను ఆ పదవికి యోగ్యుడినికానని భావిస్తున్నాను. మా యన్.డీ.యే. కూటమిలో భారతీయ జనతాపార్టీయే అతి పెద్దపార్టీ గనుక సహజంగా దానికే మొదటి అవకాశం ఉంటుంది. ఒకవేళ, అది ఆ అవకాశాన్నిఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడే, కూటమిలో ఇతర పార్టీలకు ఈ విషయంపై ఆలోచించే అవసరం ఏర్పడుతుంది. భారతీయజనతా పార్టీ త్వరలోనే తమ నాయకుడిని ప్రకటించే అవకాశం ఉందనుకొంటున్నాను. గనుక,ఆ పార్టీ తన నిర్ణయం ప్రకటించిన తరువాతే మా పార్టీ అభిప్రాయం చెపుతాము,” అని అన్నారు.

 

అయితే, “బీహార్ రాష్ట్రంలో ఆలూ (బంగాళ దుంపలు) ఉన్నంత కాలం, లాలూ కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు” అని స్వోత్కర్ష (స్వంత డబ్బా) చేసుకొన్నఆయన  చేతిలోంచి అధికారం గుంజుకొని, తనదయిన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్ననితీష్ కుమార్ అంటే గిట్టని  లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆయన మాటలను నమ్మడం లేదు.

 

నితీష్ కుమార్ తన అనుచరుల మాటలను మీడియా ముందు ఖండిస్తున్నపటికీ, తన అభ్యర్దిత్వంపై కూటమిలో మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకొనేందుకే, ఆయన స్వయంగా తన అనుచరుల ద్వారా ఈ చర్చలేవదీస్తున్నాడని లాలూ అభిప్రాయం వ్యక్తం చేసారు.

 

“ప్రధానమంత్రి పదవిపై నాకూ ఆశుంది, గానీ సాధ్యాసాద్యాలు కూడా చూసుకోవాలి కదా? ఆయన బీహార్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్నఅది దేశ ప్రధాని పదవి చెప్పటేందుకు ప్రత్యేక అర్హత కాబోదు కదా? ఒకవేళ నితీష్ కుమార్ అదే తన ప్రధాన అర్హత అని భావిస్తే నేనూ, నా భార్య రబ్రీ దేవీ కూడా బీహార్ ముఖ్యమంత్రులుగా చేసాము గనుక, ఆయన కన్నా ముందు మేమే ప్రధాన మంత్రి పదవికి అర్హులమని అనుకోవాల్సి ఉంటుంది,” అని లాలూ ప్రసాద్ అన్నారు.

 

మన దేశ ప్రధాన పదవికి ఇంతమంది అర్హులుండగా ఇక మనకేల చింత?