'వేర్పాటు'వాద పార్టీయే 'ఎన్టీఆర్'విగ్రహ విధ్వంసకశక్తి?!

- డా. ఎబికె ప్రసాద్
సీనియర్ సంపాదకులు]


 

 

"ప్రజల ఆకాంక్షలు వేరు, (వి)నాయకుల కోరికలు వేరు' అన్నాడు మహాకవి శ్రీ శ్రీ, ఇక్కడ "ప్రజల ఆకాంక్షలు'' అంటే, వారి మనుగడకు దోహదపడే దైనందిన [తిండి, బట్ట, వసతి, ఉపాథి] ప్రయోజనాలు అని అర్థం. కాగా "నాయకుల కోరికలు వేరు'' అంటే, పరస్పరం స్పర్థల ద్వారా, సమాజంలో అశాంతిని సృష్టించడం ద్వారా ప్రజలమధ్య నెలకొన్న ఐకమత్యాని చెడగొట్టడం ద్వారా, తమ పదవీ ప్రయోజనాల కోసం కృత్రిమంగా ఉద్యమాలు నిర్మించడం ద్వారా అధికారాన్ని కైవశం చేసుకోవాలని రాజకీయ నిరుద్యోగులు వెళ్ళబుచ్చుకునే కోరికలు అని అర్థం! ఆ స్వార్థపూరిత కోరికలు నెరవేర్చుకోడానికి అబద్ధ ప్రచారాలతో, వంచనతో లేని ఆశలు పెంచడం ద్వారా యువతలో బలహీనమనస్కులుగా ఉన్న వారిని రాజకీయ 'చేతబడుల' ద్వారా ఆత్మహత్యలను ప్రోత్సహించడం రాజకీయ నిరుద్యోగులకు అబ్బిన కూసువిద్య. ఈ రహస్యాన్ని అనేక అనుభవాల ద్వారా తెలంగాణా తెలుగుప్రజలు తెలుసుకొన్నారని గ్రహించిన ఒక వేర్పాటువాద పార్టీ "టాంక్ బండ్''పై నెలకొని వున్నతెలుగుజాతి తేజోమూర్తుల విగ్రహాలను విధ్వంసం చేయడానికి గతంలో పథకంపన్ని తెలుగుజాతి ఆగ్రహజ్వాలలకు గురికావలసివచ్చింది.


తిరిగి అదే పార్టీ నాయకత్వం తమ వేర్పాటు ఉద్యమం ఇక ముందుకు సాగడం కష్టమని భావించి, కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపెస్తాను, కాని, వందలాదిమంది యువకుల ఆత్మహత్యలకు తాము కారణమన్న వాస్తవాన్ని మింగలేక కక్కలేని పరిస్థుతుల్లో రేపటి ప్రజల ఆగ్రహం నుంచి కాపాడుమని చేయగల విన్నపాలు చేసుకుంది. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర'' సాధన పేరిట ఆ వేర్పాటువాద పార్టీ తలపెట్టిన 'ఉద్యమం' వెర్రితలలు వేసి జాతికి స్ఫూర్తిదాయకమైన తోజోమూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసింది, లేదా ఆ విధ్వంస కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది. తిరిగి తన అధికార దాహాన్ని తీర్చగల సానుకూల పరిణామాలు వచ్చే అవకాశాలు మృగ్యమైపోతున్నందున 'ఉద్యమ'బాటను చివరికి "2014 ఎన్నికల బాట''గా ఆ పార్టీ మార్చేసింది. కాని, తన లోపాయికారీ విధ్వంసక పాత్రను ఆ పార్టీ విరమించుకోలేదు; ఒకవైపున తనకేమీ తెలియనట్టు ఆ పార్టీ నటిస్తూనే, మరికొంతమంది యువకుల్ని [ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న వారితో సహా] "ప్రత్యేక రాష్ట్రం''కోసమే ప్రాణత్యాగం చేసినట్టు చివరికి సొంతపార్టీలోని ముక్కుపచ్చలారని బిడ్డల్ని సహితం పరోక్షంగా ముద్రవేసి లోకానికి చూపిస్తోంది! 


తెలుగుజాతిని విచ్చిన్నం చేయడం కోసం ఆ వేర్పాటువాద ముఠా తెలుగుజాతి కీర్తికిరీటాల్లో ఒకరైన దివంగత ముఖ్యమంత్రి, అగ్రశ్రేణి తెలుగు నటశేఖరుడైన ఎన్.టి. రామారావు గౌరవార్థం తెలంగాణాప్రజలు షామీర్ పేటలో నెలకొల్పుకున్న ఆయని విగ్రహాన్ని [07-02-2013] నిప్పంటించి ధ్వంసం చేశారు. ఈ వికృతచేష్ట స్థానికప్రజలలో అశాంతికి కారణమయింది. ఈ ఘటనకు ముందు యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు అయిన సోనియాగాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కటవుట్ల'ను కూడా తగలపెట్టారు. ఆ విధ్వంసకులు ఎవరు అన్న ప్రశ్నకు ఈ రెండు సందర్భాలలోనూ వినవచ్చిన "రొడ్డకొట్టుడు'' (రొటీన్) సమాధానం మాత్రం ఒకటే - "గుర్తుతెలియని వ్యక్తులు'' అని! కాని, ఎవరు 'ఉద్యమం'పేరిట బండబూతులు వల్లిస్తూ వచ్చారో, ఏ తిట్లు, శాపనార్థాలు ఆధారంగా తెలుగుజాతి మధ్య విద్వేష వాతావరణాన్ని ఎవరు సృష్టిస్తూ వచ్చారో వారికి చెందిన పార్టీ తాలూకు ముఠాయే ఈ విగ్రహ విధ్వంసక చర్యలకు కూడా కారణమై ఉండాలి. ఎందుకంటే, రాజకీయ నిరుద్యోగులకు తప్ప మిగతా సామాన్య ప్రజాబాహుళ్యానికి ఆ అవసరం ఉండదుగాక ఉండదు. ఈ రెండు ఘటనలకూ కారకులయినవాళ్ళు నిస్సందేహంగా అదే పార్టీకి చెందినవాళ్ళయి ఉంటారు. ఇది దాచినా దాగని రేపు రుజువు కాబోతున్న సత్యం!


అంతేగాదు, భారత దళితవర్గాల ఉద్యమ స్ఫూర్తిదాత, రాజ్యాంగ నిర్మాత అయిన బి.ఆర్. అంబేడ్కర్, 'తెలుగుదేశం' వ్యవస్థాపక అధ్యక్షుడయిన ఎన్టీఆర్, తెలుగువారి ప్రాణత్యాగ పురుషులలో ఒకరైన పొట్టి శ్రీరాములు విగ్రహాలు పలుచోట్ల కూడా గాడితప్పిన రాజకీయ నిరుద్యోగుల ఉద్యమపార్టీ విధ్వంసక కార్యక్రమాలకు గురైనాయి. పైగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని షామీర్ పేట వద్ద విధ్వంసం ఏ సమయంలో జరిగింది? పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించి ఆ వైపుగా రూపకల్పన చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ పని జరిగింది. అయినా, ఇంతకూ రాష్ట్రంలో అంతర్భాగమైన తెలుగువారి తెలంగాణా ప్రాంతానికి ఎన్టీఆర్ చేసిన 'ద్రోహం' ఏమిటి? 1982-83 ఎన్నికల్లో మొత్తం రాష్ట్రవ్యాపితంగా 9 మాసాలలో కలయతిరిగి, అంత స్వల్పవ్యవథిలో రాష్ట్రచరిత్రలోనే గాక ప్రపంచచరిత్రలోనే ఎన్నికల ద్వారా వందేళ్ళకు పైబడిన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారకుడయి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడ గమనించవలసింది ఎన్నికల్లో ఒక రాజకీయపార్టీగా 'తెలుగుదేశం' సాధించిన విజయాన్ని మాత్రమే కాదు; ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శతాబ్దాలుగా నిజాం నిరంకుశపాలన కింద దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల, పటేల్, పట్వారీల ధాష్టీకం తాలూకూ మిగిలి ఉన్న అవశేషాలకు చరమాంకంగా తెలంగాణా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క కలంపోటుతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, ప్రజాస్వామ్య విస్తరణలో భాగంగా ప్రజలకు పాలనావ్యవస్థను సన్నిహితంగా చేర్చినందుకు యావత్తు తెలంగాణా ప్రజాబాహుళ్యమూ ఎన్టీఆర్ కు నీరాజనాలు తెలిపిన పరిణామాన్ని తెలంగాణాప్రజలు మరవలేరుగాక మరవలేరు!


అంతేగాదు, ఉద్యోగ సద్యోగాల విషయంలో తన దృష్టికి వచ్చిన కొన్ని అవకతవకలను [వీటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలలో అత్యంత కీలక పదవులను అనుభవిస్తూ వచ్చిన తెలంగాణా ప్రాంత మంత్రులు ఎవరూ గుర్తించడంలో విఫలులయినా] సరిచేయడానికి నడుంబిగించి "జీ.వో. 610''ని విడుదల చేసినవాడూ ఎన్టీఆరేనని మరవరాదు. కాని ఇప్పుడు తిరిగి ఆ ఎన్టీఆర్ విగ్రహాన్నే ధ్వంసం చేయడం వెనక, టాంక్ బండ్ పై తేజోమూర్తుల (అన్ని ప్రాంతాలకు చెందినవారి) విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక ఉన్నది 'దృశ్య'శక్తులేగాని 'అదృశ్య'శక్తులు కావు; ఈ సత్యం రాష్ట్ర పోలీసు అధికారులకు, ప్రభుత్వానికీ తెలుసు. అయినా ప్రజానాయకుల విగ్రహాల రక్షణకు ఉన్న చట్టాన్ని కూడా వినియోగించి, విధ్వంసకులపై కఠినచర్యలు రాష్ట్రప్రభుత్వం ఇంతవరకూ తీసుకోలేదు, ఒకవేళ చర్య తీసుకొని ఉంటే, అందుకు కారాకుల పేర్లనూ కనీసం బయటపెట్ట లేదు. ప్రజలమధ్య శాంతిభద్రతలను భగ్నం చేసిన వాళ్ళను శిక్షించడానికి అవకాశమిస్తున్న చట్టాలను సహితం వినియోగించలేని 'వాజమ్మ'లుగా పాలకవర్గాలు ఉండిపోరాదు. ఆ పనిని నిర్వహించడంలో ప్రభుత్వాలు ఏదో ఒక 'మిష'పైన, లేదా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, విఫలమవుతున్నందువల్లనే న్యాయస్థానాలు సహితం పాలనా నిర్వహణలో తరచుగా జోక్యం చేసుకోవలసి వస్తోంది. కోర్టుల జోక్యాన్ని తప్పుపట్టగల స్థాయికి పాలకవర్గాలు, వాటి విధానాలు యింకా ఎదిగరాలేదు. కనుకనే రాజ్యాంగం అనుమతించిన భావప్రకటనా స్వేచ్చనూ, వాక్, సభాస్వాతంత్ర్యాలను వాటి పరిథిలో అనుభవించాల్సిన రాజకీయశక్తులు ఆ పరిధుల్ని మించి తమ అదుపుతప్పి వ్యవహరించే ఉద్యమాలను, 'బంద్'లు, హర్తాళ్ తదితర నిరసనోద్యమాలను నియంత్రించేందుకు "ప్రజాప్రయోజన వాజ్యాలు'' (పిల్స్) ఆధారంగా సుప్రీంకోర్టు సాహసించుతోంది!


ఉదాహరణకు 2009లో ఒకే ఒక్క సంవత్సరంలో కేరళలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో విడివిడిగా 363 హర్తాళ్ళు, బంద్ లూ జరిగినప్పుడు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులకు జరిగిన విధ్వంసంలో భారీనష్టాలు వాటిల్లాయి. అప్పుడు సుప్రీంకోర్టు తనముందుకు విచారణకు వచ్చిన ఒక ప్రజాప్రయోజనాల రక్షణ వాజ్యాన్ని అనుమతిస్తూ దేశ అత్యున్నత్య న్యాయస్థానం "ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తుల'' రక్షణకు సంబంధించి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకుగాను కేంద్రప్రభుత్వం "ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టాన్ని'' సవరించి, బంద్ లు, హర్తాళ్ లు ఎవరు నిర్వహిస్తారో ఆయా పార్టీలనుంచి, నిర్వాహకులనుంచీ "నష్టపరిహారాన్ని రాబట్టుకునేందుకు మార్గదర్శకాలను'' రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది! కాని కేంద్రంగానీ, రాష్ట్రప్రభుత్వాలుగానీ ఇంతవరకూ "నిమ్మకునీరెత్తినట్టు'' కూర్చున్నాయేగాని సుప్రీం ఆదేశాలను గౌరవించలేదు! ఆచరణలో తగిన చర్యలూ తీసుకోలేదు.

 
అధికారలాలసతో తన పదవీ ప్రయోజనంకోసం తెలంగాణాలోని రాజకీయ నిరిద్యోగి ప్రారంభించిన 'వేర్పాటు ఉద్యమం' సందర్భంగా పబ్లిక్, ప్రయివేట్ ఆస్తులకు జరుగుతూ వచ్చిన నష్టాల సందర్భంగా కూడా రాష్ట్ర హైకోర్టు ఈ నష్టాన్ని రాజకీయపార్టీల నుంచి, వాటి నాయకులనుంచి వసూలు చేయవలసిందిగా ఒక సమయంలో రాష్ట్రప్రభుత్వానికి సూచించింది కూడా! అయినా ఉలుకూ, పలుకూ లేదు. ప్రజా శ్రేయస్సుతోనూ, వారి వకాలిక ప్రయోజనాలతోనూ సంబంధంలేని, కేవలం రాజకీయస్వార్థం కోసం నిర్వహించే బంద్ లూ, హర్తాళ్ళూ రాజ్యాంగ విరుద్ధమనీ, ఆ సమయంలో పౌరుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత అనీ సుప్రీంకోర్టు 2009 తీర్పులోనే స్పష్టంచేసిందని గుర్తించాలి! "వేర్పాటు''వాదానికి మద్దతు సంపాదించేందుకని విధ్వంసకాండకు, అరాచకచర్యలకు దిగజారే రాజకీయ నిరుద్యోగులను సహించడమే పెద్దనేరంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది. విగ్రహ విధ్వంసక శక్తులు ఇస్లామియా ఉగ్రవాదులని ఇంతవరకూ భావిస్తున్నవాళ్ళు హైందవంలోని అరాచకశక్తులు కూడా ఇందుకు భిన్నమైనవాళ్ళుకారని తీర్మానించుకోక తప్పదు. అవధులుమించిన ఉద్రేకవాదే ఉగ్రవాది!