టీడీపీ దారే ఇక బీజేపీ దారి!
posted on May 15, 2023 @ 3:20PM
కర్నాటక ఫలితాలు ఏపీలో బీజేపీకి అన్ని దారులూ మూసేశాయి. ఇక ఆ పార్టీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు తలూపడం తప్ప మరో మార్గం లేకుండా చేశాయి. కాదని ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీతో అంటకాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదన్న విషయం బీజేపీకి కర్నాటక ఫలితాలు వెలువడిన వెంటనే అవగతమైంది. అందుకే ఏపీలో ఆ పార్టీ నేతల టోన్ మారింది. ఏపీ బీజేపీలో వైసీపీ వ్యతిరేక వర్గం నోరు నొక్కి మరీ ఏక ఛత్రాధిపత్యం చెలాయించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జేవీఎల్ ల గళం వెంటనే మారింది.
ఏపీలో జనసేన, బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని జేవీఎల్ కు కర్నాటక ఫలితాల తరువాతే గుర్తుకు వచ్చింది. మిత్రుడి ప్రతిపాదనను.. అంటే జనసేనాని తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తమ పార్టీ అధిష్ఠానం చాలా సీరియస్ గా పరిశీలిస్తోందని ఆయన మీడియా ముందు చెప్పారు. గతంలో అయితే తెలుగుదేశంకు వ్యతిరేకంగా చాలా గట్టిగా గళమెత్తిన జేవీఎల్ ఒక్క సారిగా ఇలా మెత్తపడిపోవడం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం మందలింపు ఉందని అంటున్నారు. ఏపీ బీజేపీలో గతంలో చాలా మార్లు సోము, జేవీఎల్ ల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే అధిష్ఠానం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో ఏవో కొన్ని స్థానాలను ఒప్పందంలో భాగంగా వైసీపీ నుంచి పొందే యోచనలోనే ఇప్పటి వరకూ ఉంది. ఆ కారణంగానే వైసీపీ అవినీతిపై ఎవరెంత మొత్తుకున్నా, ఆర్థిక అరాచకత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చూసీ చూడనట్టుగానే వ్యవహరించింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ అడ్డగోలు అప్పులకు పచ్చజెండా ఊపుతూ వచ్చింది.
కర్నాటక ఫలితాలకు రెండు రోజుల ముందు కూడా ఏపీ సర్కార్ కు ఆర్థిక వెసులుబాటు దక్కే విధంగా భూరీ రుణాన్ని బాండ్ ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి తెచ్చుకునే వెసులు బాటు కల్పించింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు ఇటువంటి వెసులు బాటు దక్కకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ.. ఏపీ విషయంలో మాత్రం అపారమైన ఉదారతను చూపింది. అయితే కర్నాటక ఫలితంతో ఇక ఆ వెసులుబాట్లు, ఆ ప్రత్యేక అభిమానాన్ని బహిరంగంగా చాటే ధైర్యం ఇక బీజేపీ హైకమాండ్ చేసే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అవినీతిపై విమర్శలు గుప్పించిన బీజేపీ.. స్వయంగా తమ ప్రభుత్వంపై 40శాతం కమిషన్ ఆరోపణను పూర్తిగా విస్మరించి దెబ్బతింది. ఏపీలో కూడా ఇంత వరకూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తూ వస్తోంది. గత తెలుగుదేశం హయాంలో అవినీతిపై జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణలకు వత్తాసు పలుకుతూ.. వైసీపీపై వచ్చిన అవినీతి ఆరోపణలను మాత్రం పూర్తిగా విస్మరించింది. స్వయంగా ప్రధాని మోడీ జగన్ సర్కార్ అక్రమాలపై చార్జ్ షీట్లు రూపొందించలని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విస్మరించిందంటేనే.. మోడీ ఆదేశాలలోని సీరియస్ నెస్ అర్థమౌతుంది.
ఈ నేపథ్యంలోనే కర్నాటక ఫలితంతో ఏపీ ప్రభుత్వ అవినీతిని పట్టించుకోకుండా ఆ పార్టీతో అంటకాగితే ఉన్న ఒక శాతం ఓటు బ్యాంకు కూడా చేజారిపోతుందన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహించడంతోనే.. ఆ పార్టీ రాష్ట్ర శాఖలోని జగన్ అనుకూల వర్గం స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఇంత కాలం పట్టించుకోని జనసేన అధినేతను తమ మిత్రుడంటూ భుజాన ఎక్కించుకుంటోందని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే ఆయన రాష్ట్రంలోని జగన్ సర్కార్ పతనమే ద్యేయం అని విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి హస్తిన వెళ్లి మరీ.. తాను తెలుగుదేశంతో కలిసి నడుస్తాననీ, బీజేపీ కూడా కలిస్తే మంచిది.. లేకుంటే మీదారి మీది.. నాదారి నాది అని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తరువాతే బీజేపీ హైకమాండ్ నుంచి జగన్ అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది.
ఇక ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత స్పష్టంగా రాష్ట్రంలోని అధికార పార్టీకి తాము దూరం అన్న విషయాన్ని ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పేందుకు ఉపక్రమించింది. ఆ విషయాన్ని రాష్ట్రనాయకత్వానికి అర్దమవ్వడంతోనే జేవీఎల్ స్వరం మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోలా జగన్ అడ్డగోలు అప్పులకు, ఆర్థిక అరాచకత్వానికి ఇక నుంచి కేంద్రం నుంచి సపోర్టు దక్కే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. జేవీల్ ప్రకటనతో వచ్చే ఎన్నికలలో బీజేపీ తెలుగుదుశం, జన సేన కూటమితోనే కలిసి నడుస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా అభివర్ణిస్తున్నారు.