ఆదిత్య రాకేష్ కి ఫోన్ చేశాడు. రాకేష్ పదింటి కల్లా వస్తానన్నాడు. ఆదిత్య ఆ రోజు ఇంక ప్రఖ్యని కలవకూడదని నిశ్చయించుకున్నాడు.
ఎందుకో తెలియని దిగులు కమ్మేసింది. మనసు నిండా. తన ఆస్తులన్నీ ఎవరో కొల్లగోట్టుకు పోతున్నట్టు తనని ఒంటరిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలేసినట్టు ఏదో భయంగా కూడా అనిపిస్తోంది.
ఇన్నాళ్ళు ఆదిత్య కి చుట్టూ పక్కల ప్లాట్స్ లో వాళ్ళలా తనకో అక్కో, చెల్లో, తమ్ముడో, ఉండే బాగుండేదని , వాళ్ళ ఇళ్ళకి వస్తున్నట్టు నిత్యం చుట్టాలు, స్నేహితులు వస్తూ పోతూ ఉండాలని, అనిపిస్తుండేది. ఎప్పుడూ అమ్మా, తాను ఇద్దరే ఉండడం ఏంటో అర్ధం అవక చికాకు కలుగుతుండేది. ఒంటరిగా బాల్కనీలో నిలబడి, వచ్చి వెళ్తున్న స్నేహితులకి వీడ్కోలు పలుకుతున్న ప్లాట్స్ వాళ్ళని చూస్తూ దిగులుగా ఉండిపోయేవాడు. క్రమంగా ప్రఖ్య స్నేహంతో తన జీవితంలోకి ఒక తోడు వచ్చిందని, తనకో స్నేహితురాలు దొరికిందని , ఆమె క్కూడా తనకి లాగే అమ్మ తప్ప ఎవరూ లేరని ఒక నిశ్చింత కలిగింది. నెమ్మదిగా ఆ స్నేహంలో ఒక ఆకర్షణ, ఒక ఉద్వేగం, మొదలైంది. అమ్మ, ప్రఖ్య వాళ్ళ అమ్మ ప్రఖ్య , తాను ఇద్దరు నలుగురైన ఫీలింగ్ తో ఏదో సెక్యూర్ డ్ భావన. కానీ అనుకోకుండా కలిగిన ఆలోచనలు, పొందిన అనుభూతులు , ఏదో కావాలన్న తపన, ఆరాటం.... ఉద్వేగం.... తట్టుకోలేక పోతున్నాడు. వాటి నుంచి మళ్ళీ తను ఒంటరి అన్న భావన భూతంలా భయపెడుతోంది.
తనూ ప్రఖ్యా కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ప్రఖ్య ఇక్కడి నుండి వెళ్ళిపోతే తనకేవరుంటారు? అమ్మ వివేక్ అంకుల్ ని ఒకవేళ పెళ్ళి చేసుకుంటే తను.... తనేమవాలి?" ఎక్కడి కెళ్ళాలి? అంకుల్ తనని అమ్మ దగ్గర ఉండనిస్తాడా?
ఆదిత్య కి ఆలోచనలతో తలనొప్పి మొదలైంది. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. త్వరలోనే అతనికి నిద్రపట్టింది.
ఈ లోపల శిరీష వంట పూర్తీ చేసి, రెడీ అయి, తను బ్రేక్ ఫాస్ట్ చేసి, క్యారేజి సర్దుకుని కూర్చుంది. ఆదిత్య నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయకుండా అతను లేచిందాకా ఎదురు చూసింది. కానీ ఆదిత్యా పదైనా లేవలేదు.
ఈలోగా రాకేష్ రావడంతో రెడీగా ఉంచిన ఇడ్లీ, చట్నీ , నెయ్యి వంటకాలు అన్నీ చూపించి, "వాడు లేచాక మీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేయండిరా . బియ్యం కడిగి కుక్కర్ లో పెట్టాను. భోం చేసే ముందు స్టవ్ వెలిగించుకోండి... వేడిగా ఉంటుంది. సరేనా....! నేను వెళ్ళనా? వాడ్ని కాస్త చూసుకోరా... ఏదన్నా కావాలంటే నాకు కాల్ చేయి" అంటూ రాకేష్ కి అప్పగింతలు పెట్టి తను ఆఫీసు కి బయల్దేరింది.
రాకేష్ ఆదిత్య లేచిందాకా లెక్కలు చేసుకుంటూ కూర్చున్నాడు.
"పదిన్నర కి ఆదిత్య లేచాడు.రాకేష్ ని చూడగానే మొహం నిండా సంతోషం నిండిపోయింది. "హాయ్"అంటూ పలకరించాడు.
"నువ్వు బ్రష్ చేసుకోరా...! అంటీ బ్రేక్ ఫాస్ట్ రెడీగా పెట్టి వెళ్ళారు. ఇద్దరం తిందాం." అన్నాడు రాకేష్.
"ఒకే! నాక్కూడా ఆకలేస్తోంది." అంటూ ఆదిత్య లేచాడు. మంచం దిగుతోంటే బాగా నీరసంగా అనిపించింది. అలాగే లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
ఆవేళ శిరీష ఆఫీసు నుంచి వచ్చిందాకా రాకేష్ తోటే గడిపేశాడు ఆదిత్య.
శిరీష వచ్చాక రాకేష్ వెళ్ళిపోయాడు.
ఆరోజు ఏమనుకుందో శిరీష ఆదిత్య తోటే గడిపింది. డిన్నర్ కూడా ఇద్దరూ కలిసి చేశారు.
ఆరోజు మొదటి సారిగా ఆదిత్యకి చాలా, చాలా సంతోషంగా అనిపించింది. అమ్మకి నేనంటే ఇష్టం. అమ్మ నాది అనుకున్నాడు. ఈసారి మాత్రం వివేక్ అంకుల్ వస్తే తన విముఖత ప్రకటించాలి అని నిర్ణయించు కున్నాడు. త్వరలోనే వివేక్ ని ఆ ఇంటికి రాకుండా చేయడం కోసం ప్లాన్ చేస్తూ పడుకున్నాడా రాత్రి.
దాదాపు వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులూ ప్రఖ్యని కలవాలని ఉన్నా ఆమెని తప్పించుకు తిరగసాగాడు ఆదిత్య. ప్రఖ్య కూడా ఎంచేతో రెండు, మూడు సార్లు ఫోన్ చేసింది. కానీ పెద్దగా అతడెందుకు రావడం లేదని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అది కొదొఆ ఆదిత్య కోపానికి కారణం అయింది. పైగా అతను వివేక్ ఆ ఇంటికి రాకుండా, ఒకవేళ వచ్చినా కాఫీ తాగి వెళ్ళిపోవాల్సిందే కానీ, తన తల్లితో అంత చనువుగా ఉండ కూడదని , అందుకు తీవ్రమైన తన వ్యతిరేకతని వ్యక్తం చేయడానికి ఎదురు చూస్తున్నాడు.
కాకపొతే ఆదిత్య పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయని శిరీష కూడా వివేక్ ని రావద్దని చెప్పింది.
కాకపోతే ప్రఖ్యా, ఆదిత్యా కలిసి ఎందుకు చదువు కోడం లేదో ఆమెకి అర్ధం కాలేదు.
అదే అడిగింది రేపు పరీక్ష అనగా ఆ రాత్రి ఆదిత్య ని, "ఏమైందిరా మీరిద్దరూ దెబ్బ లాడు కున్నారా?" ఎందుకని తనూ మనింటికి రావడం లేదు? నువ్వు వెళ్ళడం లేదు."
ఆదిత్య కాస్సేపు మాట్లాడలేదు. తర్వాత అన్నాడు. 'అంటీ కూడా మనింటికి రావడం లేదేం?" మీరిద్దరూ దెబ్బలాడు కున్నారా?"
అనుకోని ఆ ప్రశ్నకి ఒక్క క్షణం బిత్తర పోయినా తరవాత నవ్వేసి అంది శిరీష. "అంటీ బాగా బిజీగా ఉందిట. నేను కాల్ చేశాను. అన్నట్టు తను రావడం బాగా లేట్ అవుతోందని తన ఫ్రెండ్ వాళ్ళింట్లో ప్రఖ్యని దింపుతున్నా నంది బహుశా అందుకే రావడం లేదేమో ప్రఖ్యా" అప్పుడే గుర్తొచ్చినట్లు అంది.
ఓ అదా.... అనుకున్నాడు ఆదిత్య. కనీసం తనకి చెప్పి వెళ్ళచ్చుగా...! అంటే కెరియర్ పాడై పోతుందని పరీక్షల మీద కాన్ సెన్ ట్రేట్ చేసిందన్న మాట.
"ఏం లేదు" అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి "నీ మొబైల్ ఇవ్వు తనకి కాల్ చేసి బెస్టాఫ్ లక్ చెప్తాను." అన్నాడు .
శిరీష మొబైల్ ఇచ్చింది.
అది తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు.
ప్రఖ్య నెంబరు కలిపాడు.
కాలవెరి, కొలవెరి, కొలవెరి డే అంటూ రింగ్ టోన్ వినిపించింది. దాదాపు పాట పూర్తీ అవుతుండగా ప్రఖ్య ఫోన్ లిప్ట్ చేసింది.
"ప్రఖ్యా...!" పిలిచాడు.
"అదీ.....! హాయ్ ...ఏంటి ఏమైపోయావ్?" హుషారుగా అడిగింది.
"నువ్వెక్కడికి వెళ్ళావు?" అడిగాడు.
"నేనెక్కడికి వెళ్ళలేదు నిన్నటి దాకా ....నీకోసం ఎదురు చూశాను. ఇవాళే మమ్మీ ఫ్రెండ్ ఇంట్లో దింపింది నన్ను."
"మరి నాకెందుకు కాల్ చెయ్యలేదు?"
"నా దగ్గర ఫోన్ లేదు. మమ్మీ తీసి కెళ్ళి పోయింది గా ఆఫీస్ కి, అయినా నువ్వెందుకు రావడం లేదు?"
"ఊరికినే....ఎగ్జామ్ కదా. అని."
"అవును , నేనూ అందుకే. నీకో సంగతి తెలుసా....? మమ్మీ డివిడి ప్లేయర్ లో మనం చూసిన సినిమా డివిడి చూసి పరీక్షల ముందు సినిమాలు చూస్తున్నారా? రేపట్నించీ మీ ఇద్దరూ కలిసి చదువు కోవద్దు" అంటూ తిట్టింది.
"అవునా? గాడ్ ....! ఎలా చూసింది?"
"ఆరోజు మనం మమ్మీ వచ్చిందని ఆ డివిడి రిమూవ్ చేయకుండా అలాగే వదిలేశాం కదా....! మరునాడు తన ఆఫీస్ సి.డి. ఏదో చూడడానికి ఓపెన్ చేసి డివిడి చూసింది. ఇదెందుకు ఇక్కడికి వచ్చింది?" అని అడిగింది.
"నేను అబద్దం చెప్పలేను. అందుకే చెప్పాను. మనకి బోర్ కొట్టి మూవీ చూశామని."
"చెప్పకుండా ఉండాల్సింది..."
"ఏమో! నాకు మమ్మీతో ఏదీ కూడా అబద్దం చెప్పడం చేతకాదు."
"ఇంకా ఏమన్నారు అంటీ?"
"ఏం లేదు. పరీక్షల ముందు సినిమాలు చూడడం ఏంటీ? ఆదిత్య నిన్నలా. ఎంకరేజ్ చేయకూడదు. అంటే తనకి సినిమా పిచ్చి ఉందన్న మాట. నేను శిరీష తో మాట్లాడుతాను. నువ్వు రేపట్నించీ ఒక్కదానివే చదువుకో!" అని క్లాసు పీకింది. "మీ అమ్మతో ఏం చెప్పలేదా?"
"ఏమో ....తెలియదు. అమ్మ నాతొ ఏం అనలేదు.."
'అయితే మమ్మీ బిజీగా ఉందిలే. బహుశా చెప్పి ఉండదు. అవునూ బాగా చదువు తున్నావా?"
"ఊ.... ఫర్వాలేదు."
"ఆరోజు."
"ఏ రోజు?"
"అదే మనం మూవీ చూసినరోజు . అంకుల్ వచ్చారా?"
"లేదు. రెండు రోజుల తర్వాత వచ్చారు ."
"నువ్వు చూశావా?"ఆమె స్వరంలో బిడియం, సిగ్గు, స్పష్టంగా తెలుస్తున్నాయి.
"లేదు. కొంచమే చూశాను. నాకు నచ్చలేదు."
"ఏం నచ్చలేదు."
"అంకుల్ మా అమ్మని ముద్దు పెట్టుకోడం."
"ఏం?"
"అమ్మ నాది."
ప్రఖ్య ఏం మాట్లాడలేదు.
ఆదిత్య మళ్ళీ అన్నాడు. "ప్రఖ్యా...! అంకుల్ మా ఇంటికి రావడం నాకిష్టం లేదు. నేను ప్రోటేక్టు చేస్తున్నాను. కానీ నా ఎగ్జామ్స్ దాకా రాకపోవచ్చు. ఆ తరవాత కూడా రానివ్వను."
"తప్పు కదా అదీ! పాపం అంటీ ఫ్రెండ్ కదా!"
"నీకు తెలియదులే. సరే కానీ, నాకు నిన్ను చూడాలని ఉంది."
"ఎగ్జామ్స్ అయిందాకా నేనిక్కడే ఉండాలి. అందుకే ఈ ఫోన్ కూడా మమ్మీ ఇచ్చేసింది. బాగా చదువుకో అదీ. కెరియర్ ఇంపార్టెంట్.
"ఎగ్జామ్స్ అయాక మనం ఎక్కడి కన్నా వెళదామా?"
"ఎక్కడికి?"
"ఆలోచిద్దాం. మన అమ్మలకి చెప్పద్దు. ఎక్కడి కన్నా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం."
"కానీ, ఎలా?"
"ఏం?"
"నీకు ఏం తెలియదుగా....?"
"నాకన్నీ తెలుసు."
"తెలుసా ఎలా?" గాభరా , కుతూహలం కలిసిన స్వరంతో అడిగింది.
"చెప్తాలే తరవాత. మళ్ళీ ఇప్పుడదంతా గుర్తు చేయకు. చదువు మీద కాన్ సన్ ట్రేట్ చేయలేను."