Previous Page Next Page 
కదానాయికి పేజి 26

    కూతురు భవిష్యత్తు గురించి తనిలా మధమపడుతుంటే ఏమీ పట్టనట్లు చిన్మయానంద చిద్విలాసుడిలా వున్న భర్తను చూస్తుంటే సుభద్రమ్మకు నిలువునా మండుతుంది. అనుపమ పెద్దమనిషి కానంతవరకు  భర్త గురించి "ఆ.... ఆయనదో  లోకం  , పిచ్చి పిచ్చిరాజు"అనుకునేది. నెమ్మది నెమ్మదిగా... "ఆయనకు కాదు పిచ్చి , నాకు .ఛీ-ఛీ! ఈయనా ఒక మనిషేనా ?ఈయనా ఒకతండ్రేనా?" అనుకోటమేగాక సన్న సన్నగా చివాట్లు  చిన్నగా సాధింపు , ఎత్తిపొడవు మొదలుపెట్టింది. రామభద్రయ్య అప్పుడూ యిప్పుడూ ఒకటే వేళాకోళం మాటలు మాత్రం విడిచిపెట్టలేదు.   

     " వెంకటసుబ్బయ్య చెప్పిన సంబంధం గురించి కనుకున్నారా?"అంది సుభద్రమ్మ చాటలో  బియ్యం పోసుకొచ్చుకుని, మట్టిబెడ్డలు ,వడ్లగింజలు ఏరుతూ  కూర్చుని.

    "ఏమిటీ అన్నావ్?" అన్నాడు రామభద్రయ్య కళ్ళు తెరిచి.

    "అబ్బే! ఏమీ అనందే!" సుభద్రమ్మ ఎత్తిపొడిచినట్లు అంది.

    "చూడు .చెరువుమీద అలిగితే ఎవరికి నష్టమటావు?"

    "నాకు. "చాతగాని కోపంతో కశిగా అంది సుభద్రమ్మ.

    "ఆ మాత్రం తెలుసుకదా? యిందాక ఏమిటో అన్నావు. అదే మిటో చెప్పు?"

    " వెంకటసుబ్బయ్య చెప్పిన సంబంధం గురించి కనుక్కున్నారా?" మళ్ళీ వివరంగా అడిగింది సుభద్రమ్మ.

    ఓహో- పెద్దతల్లి పెళ్లి గురించా? తొందరపడితే ఎలా? ఆ సంబంధం వాళ్లు సీతారామయ్య కూతురిని చేసుకుంటామని మాటిచ్చి వెళ్ళారుట. యీ సంగతి నాతోచెప్పటం మరిచేపోయాను సుమా?" కుర్చీలోంచి లేచికూర్చుని తనుచెప్పవలసింది అయిపోయిందన్నట్లు మళ్లీ వెనక్కు కూర్చీకి జార్ల గిలపడ్డాడు రామభద్రయ్య.

    "ఖర్మ" అన్నట్లు ఎడం చేత్తో నుదుటిపై కొట్టుకుంది సుభద్రమ్మ.

    "మీ సౌఖ్యం మీరు చూచుకోండి. ఎవరెలాపోయినా పరవాలేదు. దగ్గరకొచ్చిన సంబంధాన్ని చేతులారా జారవిడిచిన మిమ్మల్ని అనాలి. గాలించి ,ఏరవేసి లాక్కురావాలి. పెళ్లికొడుకులని.  గాలానికి చిక్కిన చేపని నీళ్ళల్లో  వదిలే ప్రజ్ఞతప్పయింకేంలేదు."

    రామభద్రయ్యకు కోపం వచ్చేసింది.చటుక్కున కుర్చీలోంచి లేచి కూర్చున్నాడు. "వెర్రిముండాకొడుకు కూడా పెళ్ళనంగానే అందలం మీదెక్కి   అన్నీ చూసుకుంటాడు. గాలానికి చిక్కటానికి చేపలా? నువ్వేం చేశావు?మీ పెదనాన్న ఉత్తరం  రాశాడని పాతిక రూపాయలు ఖర్చుపెట్టుకు వెళ్లొచ్చావు. సీనయ్య చేసుకుంటానని  వస్తే అలిటికాళ్ళని పొమ్మన్నావు. ఇప్పుడు నేనేదో చేయలేదని సాధిస్తున్నావు. పెద్దలన్నట్లు కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదే." చిన్నకూతురు పరుగెత్తుకు రావటం చూసి ఆగాడు రామభద్రయ్య.

    "అమ్మా... అమ్మా..... పెద్దక్కయ్య పెరట్లో కక్కుంటున్నదే. యిందాక తిన్న అటుకులు కక్కింది." అంది పరుగెత్తుకు రావటం వల్ల అయాసంతో రొప్పతూ.

    "పెద్దతల్లి కక్కున్నదిట. ఏమిటో చూడువెళ్ళి. పైత్యం చేసిందేమో, ఆచార్ల గారినడిగి మందు తెస్తాను. లేకపోతే అల్లం రసం రామభద్రయ్య చెప్పేది  వినిపించుకోకుండా  రివ్వున లేచి పెరట్లోకి వెళ్ళింది. సుభద్రమ్మ.
   
    రామభద్రయ్య చెప్పేది వినిపించుకోకుండా రివ్వున లేచి పెరట్లోకి వెళ్ళింది సుభద్రమ్మ.
   
    అనుపమ రెండుచేతులతో తలనొక్కుకుంటూ గొంతుకు కూర్చుని వుంది. కాస్త దూరంలో మధ్యాన్నం తిన్న పెరుగులో నానపెట్టిన అటుకులు కక్కురూపంతో నేలమీద వున్నాయి.

    "పెద్దమ్మాయీ! పొద్దున అన్నము సయించలేదని వాంతిచేసుకున్నావు. ఇప్పుడు అటుకులు కూడా వాంతి అయిపోయాయి.కడుపులో నొప్పి, వికారం  యింకా వుందా?" అంది సుభద్రమ్మ.   

    చిన్నచెల్లెలు తెచ్చిన మంచినీళ్లు పుక్కిలించి ఉమ్మేసి కాసిన తాగిలేచి నుచుంది అనుపమ. అంతలోనే కుర్చుండిపోతూ " ఏమిటో గా వుందమ్మా" అంది.   

     సుభద్రమ్మ, అనుపమ రెక్క పుచ్చుకుని లేపివు. పైత్యరసం పేరుకుని వుంటుంది. ఆచార్లుగారినడిగి విరోచనాలకి మాత్రన్నా తెచ్చివేస్తాను. అంటూ ఇంట్లోకి నడిపించుకొచ్చింది.   

    "రోజు ఏది తిన్నా కకొచ్చినట్లే వుంటుంది. ఇవాళ కక్కులు వెళ్లిపొయ్యాయి. జామపిందెలు ఈ తఫా అసలు తినలేదమ్మా! దానిమ్మ కాయలు మనదొడ్లో వున్నాయిగా.అవి  బాగుంటే రోజూ తింటున్నాను."  అంది అనుపమ.

    " దానిమ్మకాయలా?" తెల్లబోయింది సుభద్రమ్మ.

    అనుపమ దానిమ్మగింజలు రెండు మూడు కన్నా తినదు. "పుల్లగా వుంటాయి. ఏం బాగుంటాయి."  అంటుంది. జామకాయలంటే ప్రాణం. వగరు పయినాసరే జామకాయ అయితే సరి తినందే వదలదు.

 Previous Page Next Page