ఎడం చెయ్యి వెనక్కు తిప్పి వీపుమీద గట్టిగా చరుచుకుని "మైలు దూరాన వున్నట్లు ఏమిటిరా ఆ గావుకేక?హడలిచచ్చాను." అన్నాడు సీతాపతి.
"పిలుపుకి అందని దూరంలో మనసు వుంటే! కేక వేయవద్దా?"
"ఒరేయ్....! ఒరేయ్....! ఇందేం న్యాయంరానే అడగాల్సింది నీవడగటం....?"
గతుక్కుమన్నాడు రాజు. గోరంతని కొండంత చేస్తాడు. సీతాపతి. రాజు అనుకున్నంత అయింది.సీతాపతి బాంబులాంటి ప్రశ్న వదిలాడు,
"రాజూ భయ్యా!ప్రేమలో పడ్డావా ఏమిటి?" అన్నాడు సీతాపతి తాపీగా.
" ఏమిటి పతీ! ఏమిటి నీవంటున్నది?"
"మామూలుగా ప్రశ్నించితే ఆ కంగారేమిటి? గోతిలోపడ్డావన్నది కరెక్ట్" సీతాపతి పొంగిపోతూ అన్నాడు.
"నీవు చదవ్వు నన్ను చదువుకోనివ్వవు. ప్రేమాలేదు దోమాలేదు. పుస్తకం తెరువు."
"నిజం చెప్పినదాకా పుస్తకం ముట్టను. నమ్మనంటే, నీ మీద ఒట్టు."
"చదవకపోతే ఎవరికి నష్టం పతీ?"
"నీకే, నన్ను చదువుకోకుండా పాడుచేశావని పెద్దలు పెద్ద అబాంఢం నీపై వేస్తారు. నిజం చెప్పిందాకా పుస్తకం తెరవదు.ఆ... అంతే ఈ సీతాపతి మాట శ్రీరాముడి బాణం లాంటిది." సీతాపతి బెదిరింపుగా అన్నాడు
సీతాపతి అంటే పట్టుదలని విక్రమార్కుడు వాడు చదవడు తనని చదువుకోనివ్వడు. నిజం చెపితే నోరు మూసుకుంటాడు. లేకపోతే ప్రేమా రామా అంటు ప్రాణం తీస్తాడు. అనుకున్నాడు రాజు.
" ఓ.కె. నిజం చెపుతాను. నీ వనుకున్నట్లు ప్రేమా. వంకాయ మట్టుకుకాదు. ఒక షరతు.నే తియ్యమన్నప్పుడు పుస్తకం తీసి చదనవాలి."
"ఏం చేస్తాం భయ్యా! చదువుకునే రాత నా మొహాన రాసివుంది. తప్పుతుందా? ఆ .... ప్రేమగాని ప్రేమ కథ చెప్పెయ్యి" అన్నాడు చదవక తప్పుదుగదా అని దిగులు పడుతు.
"రామభద్రయ్యగారి అమ్మాయి అనుపమ వుంది చూచావా.?"
"ఎవరు? ఆ గుడ్డిదా?"
రాజు ముఖం ముకుళించుకుపోయింది.
"ఛా.... ఎలా మాట్లాడాలో తెరియదురా పతీ! భగవంతుడు ఎలాగూ అన్యాయం చేశాడు. మానవత్వం మరిచిపోయి కుంటిది, గడ్డిది.అంటూ అవహేళన చెయ్యటం మనిషి చెయ్యాల్సిన పని కాదురా పతీ."
వ్యవహారం ముదిరినట్లుంది గురువుగారికి!అనుకున్నాడు సీతాపతి.
"తొందరపడి నోరు జారాను. మరోసారి అనను, సరేనా? సరే ఇంతకూ ఆ అమ్మాయి విషయం ఏమంటావు?"
"చిన్నప్పుటినుంచీ శేఖరం, వెంకట్ ,అవధాన్లు,ఉమా,అలివేణి, నీరజ, అనుపమ. అందరం కలసి ఆడుకున్నాం.పెద్దయినా ఒకరి నొకరం ఓసారి చూడందే ఏమిటోలా వుంటున్నది. ఊరికెళ్ళినప్పుడల్లా అందరినీ కలుసుకుంటున్నాను. మొన్న అనుపమ కనపడలేదు . మొన్నే. కాదు ఈ మధ్య రెండుసార్లు ఊరెళ్ళాను రెండుసార్లు అనుపమని చూడలేదు. అనూని చూచి మాట్లాడందే నాకేమిటో లా వుంటుందిరా పతీ! అంతకు మించి ఏం లేదు."
" చూడాలనుకున్న వాళ్ళను చూడలేకపోతే కాసేపు బాదపడతాము అంతే, అలా..... గంటలు తరబడి వారల తరబడి విచారిస్తు కూర్చోరు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు." సీతాపతి కుండ బద్దలుకొట్టినట్లు అన్నాడు.
"నా విషయంలో పొరబడుతున్నావురా పతీ! కళ్లు కనిపంచవని అమాయకురాలని, చిన్నప్పటినుంచీ జాలి. అనూని ఎవరైనా "గుడ్డిది" అని అవహేళన చేస్తుంటే , వాళ్ళను చంపెయ్యాలన్నంత కసిపుట్టేది. అనూ అమాయకంగా పిచ్చిపిచ్చి ప్రశ్నలేస్తుంటే అర్థమయ్యేటట్లు చెప్పాలని ఆరాటపడేవాడని. ఇప్పటికీ అనూని చూచి కాసేపు మాట్లాడితే అదోకరకం తృప్తి అంతే, అనూ కూడ "రాజూ!"అంటూ ఇప్పటికీ అమాయకంగా మాట్లాడుతుంటే జాలి కలుగుతుంది దీనినే ప్రేమ అంటారా పతీ? మీ ఇరువురిమధ్య ప్రేమా,పెళ్లి కబురు దొర్లలేదు. "రాజూ! కాలేజీ అంటే ఏమటి?" "రాజూ"!పెద్దవాడివయ్యావా? అంటే ఏమిటి?" "రాజూ సినిమా లంటె ఎలాఉంటాయి?" ఇవీ అనూ అడిగే ప్రశ్నలు,అనూకి చూపులేకపోయినా ఆ పెద్ద పెద్ద కళ్లల్లోకి చూస్తు గంటల తరబడి కబుర్లు చెప్పబుద్దేస్తుంది. ఇదేనా నీవనే ప్రేమ?"
సీతాపతి వెంటనే జవాబు ఇవ్వలేదు. కళ్ళుమూసుకుని కాసేపు మౌనం పాటించాడు. రాజుకి పతిని చూస్తుంటే నవ్వు తెరలు తెరలుగా వస్తున్నది.
"రాజూ భయ్యా!నీది కల్తీలేనిప్రేమ, అడ్డుతగలకు, నన్ను సాంతం మాట్లాడనివ్వు, మన వూళ్ళో పోలిగాడికి కాళ్ళు లేవు. సీతాలు కొడుకు పాపయ్యకు కళ్ళు లేవు. ఇంతెందుకు మీపాలేరు కొడుక్కి రెండు చేతులు లేవు.ఒక్కసారంటే ఒక్కసారి వాళ్ళదగ్గర కూర్చుని కబుర్లు చెప్పావా? కనీసం వాళ్ళ మొహమయినా చూచావా? అనుపమతో స్నేహంవల్ల జాలి అనుకుందాం, పెళ్ళి ప్రేమ మీ మధ్య రాకపోవచ్చు కానీ.... అనూని చూడనంత మాత్రాన ఇంత దిగులు దేనికి? పవిత్రంగా ప్రేమించేవారు శరీరసంబంధానికి అంటే కాంక్ష, తపన .కామము ఆ దృష్టితో చూడరు. ప్రేమిస్తారు, ప్రేమిస్తున్నట్లు తెలుసుకోకుండానే ప్రేమిస్తూ వుంటారు రాజూ భయ్యా! చదవులో వున్న తెలివితేటలు ఈ విషయాల్లో బొత్తిగా లేవునీకు,అనుప సంగతి నాకు తెలియదు కాని, నీవు మాత్రం అనుపమని ప్రేమిస్తున్నావు. నీ అంతరంగం అట్టడుగుపొర పెళ్ళగించి చూడు. అనుపమమీద ప్రేమ వున్న సంగతి తేటతెల్లమవుతుంది. ఇప్పుడే సమాధాన మివ్వవద్దు. ఆలోచించు బాగా ఆలోచించు.రాజులు, వారాలు ఆగుతాను,అప్పుడు చెప్పు. అనుపమ అంటే జాలా? ప్రేమా?ఏమిటీ అన్నది!" ఇలాటి విషయాలలో అనుభవమున్న సీతాపతి ఆలోచించి మరీ అన్నాడు.
11
"ఇదిగో నిన్నే!అగ్గిపెట్టె ఓసారిలా అందుకో." రామభద్రయ్య వంటగది వైపు చూపులుసారించి సుభద్రమ్మ నుద్దేశించి అన్నాడు.
"వస్తున్నాను" అంది సుభద్రమ్మ. అన్న పదినిమిషాలకు అగ్గిపెట్టెతో చరచర వచ్చి విసురుగా రామభద్రయ్య చేతిలోవుంచింది అగ్గి పెట్టెను.
తాపీగా వెలిగించుకుని కుర్చీకి జార్ల పడి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు రామభద్రయ్య పడకూర్చీలో మేనువాల్చి. అర్దనీలిమ నేత్రుడయిన,ఐశ్వర్యం గురించి పగటి కలలు కంటూ లంకపొగాకు చుట్టతాగుతుంటే రామభద్రయ్య, రామభద్రయ్యలాగా వుండడు.అష్టెశ్వర్యాలు అనుభవిస్తూ పట్టుపాన్సుపై పవళించిన శ్రీంతుడిలా వుంటాడు.