"అబ్బ! ఎంత లెక్చర్ దంచేశావు? నా గురించా నీగోల ఇప్పుడు నాకే రాలేదు."'టెక్ట్స్ బుక్ అందుకుంటూ నవ్వూతూ అన్నాడు రాజు.
"అమ్మమ్మమ్మ! ఈ సీతాపతి చదువులో ఉద్దండపిండం కాకపోయినా, మనుషులు, మనసులు కనిపెట్టే విషయంలో గట్టిపిండమ. మా నాయనమ్మే వుంటే నీ ముఖం చూడగానే " నాయనా రాజూ!రాజేశ్వరమ్మ ఒంట్లో యిదవరకటి కన్నా కుశలంగావుందా? చుక్కమ్మ తల్లి అల్లరి తగ్గిందా? మీ అమ్మగారు కూలాసా?నేనడిగానని చెప్పావా? రఘుపతి ఏమంటున్నాడు?" వగైరా మంచీ చెడ్డ పరామర్శించేది. ఆ నాయనమ్మకి సాక్షత్తు మనవణ్ణయినా ఇలాటి విషయాల్లో చచ్చుదద్దమ్మనే. వెళ్లి నవాడిని ఊళ్ళో రెండు రోజులుండక వెంటనే ఎందుకు వచ్చేశావు?వచ్చింతరువాత ఏదోలావున్నా వెందుకు?" సీతాపతి ప్రశ్నలమీద ప్రశ్నలు వేశాడు. అచ్చం వాళ్ళ నయనమ్మలాగా గొంతుమార్చి మాట్లాడుతూ.
"అమ్మయ్యా! యింకేమిటో అని భయపడిపోయాను. ఏమ లేదురా పతీ! అక్కడికెళ్లిన తరువాత తోచ.లేదు. అందుకే వెంటనే తిరిగి వచ్చాను. అత్తయ్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడేది లేదుట. మొదట్లో అయితే పూర్తి ఆరోగ్యవంతురాలయ్యేది. వ్యాధి.అవీ వాడకపోతే ప్రాణానికే ముప్పు. జీవితాంతం మందులు వాడుతూనేవుండాలి. రక్తక్షిణత,నరాల వీక్ నెస్ రెండింటినీ బాగుపరిచే స్టేజీ దాటిపోయిందిట. ఇదీ అత్తయ్య పరిస్థితి . చుక్క పెద్దదయిపోయింది. అంటే ఎత్తు రెండంగుళాలు. లావు పదంగుశాలు. బుద్ధి మటుకు అరంగుళం కూడా పెరగలేదు. అమ్మ, మామయ్య షరా మామూలే." రాజు వివరంగా చెప్పాడు. సీతాపతి మళ్ళీ ప్రశ్నలేయకుండ-
"అబద్ధం!" పెద్ద గొంతుకతో అన్నాడు సీతాపతి.
"ఏమిటి? నే చెప్పింది అబద్దమా?" తెల్లబోతూ అడిగాడు రాజు.
" నువ్వు చెప్పింది కాదు రాజూ భయ్యా! నీ వెందుకలా వున్నా వంటే బలీయమైన కారణం వుండివుంటుంది. అది తెలియక అడిగితే ఏదో చెప్పేశావు. అసలు విషయం అలాగే వుంచేశావు. తోచక ఊరినుండి మర్నాడే బయలుదేరి వచ్చానన్నావే అది సుద్ధ అబద్ధం."
సీతాపతితో అబద్దమాడి ప్రయోజనం లేదని గ్రహించాడు రాజు.
"నా మనసు బాగుండనిమాట నిజమేరా పతీ! మరోసారి ఎప్పుడయినా చెపుతాను. ఇప్పటికి నన్న వదిలేసేయ్."
"గుడ్!మనసు బాగుండలేదనన్నా ఒప్పుకున్నావు, మనసు బాగుండపోతే మందేమిటో తెలుసా?"
" సినిమాకి వెళ్ళటం...." పూర్తిచేశాడు చివరి మాట రాజు.
"తెలుసుకదా? బయలుదేరు వెళదాం." సీతాపతి మంచం మీద నుంచి లేస్తూ అన్నాడు.
"పరీక్షలు దగ్గరపడ్డాయి. నో పిక్ చర్... ..... నో షికారు... నో కబుర్లు."
రాజు పుస్తకం తెరిచాడు.
సీతాపతి గోళ్లు కొరుక్కుంటూ కూర్చున్నాడు. సీతాపతి నవలలు చదవటానికి , సినిమాలు చూడటానికి ఎక్కడిలేని హుషారు వస్తుంది. క్లాసుపుస్తకాలు చదవటానికి మాత్రం మూడి కావాలి. మూడ్ లేనప్పుడు క్లాసు పుస్తకం తెరిస్తే కళ్లు కూరుకుపోతాయి. తలంతా తిమ్మిరెక్కుతుంది. అందుకే తోచింది వూహిస్తూ, వూహకి యదార్థాన్ని జోడించి ఓ నిర్ధారణకొచ్చి తృప్తిపడుతుంటాడు.
"రాజు ఒక్కాసరి ఊరికెళ్ళి వచ్చినప్పుడు ఎక్కడలేని ఉత్సాహంగా వుంటాడు. అడగందే సినిమాక్కెళతాడు. మరోసారి దిగులుగా ఆలోచిస్తూ ఆదేపనిగా రాత్రింబవళ్ళు క్లాసు పుస్తకాలు చదివేస్తుంటాడు. రాజు దిగులుకి కారణం ఇంటి విషయాలుమటుకు కాదు. రాజు మామయ్య ఒక్కడిదీ వింత మనసతత్వం. గట్టిగా మధ్య మధ్య మాట్లాడతాడు. అంతే గాని కసి, కోపంలాంటివి లేవు.ప్రేమలోపడాలి పడితే,అదే నిజమయితే తనతో చెప్పకుండా దాయడు. కాని ..... వీడి జబ్బు చూస్తుంటే ప్రేమ జబ్బులాగానే వుంది.గట్టిగా అడిగితే చెపుతాడేమో? కాలేజీ బ్యూటీలు ఇంతమంది వుండగా మా వూళ్ళో రంభ దొరికందా ప్రేమించటానికి? తను పొరపాటుగా ఆలోచిస్తున్నాడు. రాజు అమ్మాయిమాట ఎత్తడు. పక్కనుంచి బ్యూటీ క్వీన్ పోతున్నా తలఎత్తి చూడడు. ఛట్.... రాజుకి ప్రేమా లేదు. దోమా లేదు. కారణం ఏదో తెలుసుకోకుండా ఏమిటీ పిచ్చి ఆలోచన?
రాజు పుస్తకంలోంచి తలఎత్తి చూసేటప్పటికి సీతాపతి గోళ్ళు కొరుక్కోవటం పూర్తిచేసి చిగుళ్ళు కొరుక్కుంటు ఆలోచిస్తున్నాడు.
"పతీ!" రాజు పిలిచాడు.
....... .....
"ఒరేయ్, సీతాపతీ!" సీతాపతి చెవుపక్కనే గట్టిగా అరిచాడు. రాజు.