"అవునురా విజయ్! మన సుబ్బు చెప్పింది నిజమే. నేనూచదివాను. మీ తాతలు ఆరు వందల ఏళ్ళ క్రితమే అక్కడికి వెళ్ళి వచ్చారు కదా! మనం వెళ్ళే మార్గానికి దీనికి సంబంధం లేదేమో?"
కమల్ అనంగా వందల ఏళ్ళక్రితం కొండలు ఇప్పుడు లేవు. ఇప్పుడు కొండలున్న ప్రదేశంలో ఆనాడు జానేడు కొండ కూడాలేదు. ఈ విషయం మన చరిత్రలే నిరూపించాయి."
"ఏది ఏమైనా ఒకటిమాత్రం కరెక్ట్. దేవనాగిరికలిపి సంస్కృతం గ్రాంధికం వదిలేసి రఘురామయ్యగారు రాసిన కాగితాలు మనకి మార్గదర్శికంగా పట్టుకుని పరిశోధించాలి ముందు ఈ కాగితాల్లో దొరికిన అక్షరాలతో కుస్తీ పడదాం" నిశ్చల అంది.
"నేనోపని చేస్తాను. సంస్కృతం అక్షరాలు కూడా కొన్ని పాడయిపోయి వున్నాయి కదా! కాఫీచేయటం డ్రాయింగ్ వేయటం నాకు బాగా వచ్చిననీ మీకందరికి తెలిసిందేకదా! వేరు వేరు కాగితాల మీద వేరు వేరు సంస్కృతఅక్షరాలు రాసి మనవూళ్ళో సంస్కృతం వచ్చిన గౌరీనాధశాస్రిగారికి. శంకరశాస్రిగారికి , గణపతిరావుగారికి, తలా కొన్ని కాగితాలు తీసుకుని వేరువేరుగా వెళ్ళి వాటి అర్దాలు అడుగుదాం. వాళ్ళకి మన సీక్రెట్ తెలియదు. అర్ధం చెపుతారు. వాటినన్నీ తెచ్చి మనం పేర్చి దానికో రూపం తీసుకువద్దాము, ఆ మాటలు తాతగారు రాసిన కాగితంలోని మనం ఏర్చికూర్చిన మాటలు చేర్చి చదివితే చాలాభాగం విషయం అర్దమవుతుంది ఎలా వుంది ?" విజయ్ అడిగాడు.
"బేష్"
"గుడ్ అయిడియా!"
"ఇండియాలో వుండవలసిన వాడినికాదు భాయ్!"
"ఇళ్ళు అలికితే కొంత పండుగ వచ్చినట్లే"
తలోరకంగా విజయ్ ని పొగిడారు.
ఆ నిముషాన వెయ్యి ఏనుగుల బలం వచ్చింది విజయ్ కి.
"పొద్దుపోతున్నది లేద్దాం. వీలయితే రాత్రికి మేమూ వస్తాము" అంది నిశ్చల.
"వీ....... లయితేకాదు. ఇప్పుడే బుర్ర వుపయోగించుకో లేకపోతె ముందు ముందు ఏంపనికి వస్తాము? ఇంట్లోవాళ్ళకి మస్కా కొట్టి వచ్చేద్దాం ఫస్ట్ నైట్ మన ప్రాతాపం చూపిద్దాము" కృతి అంది.
"ఫస్టునైటా! నీ ఇంగ్లీషు మండిపోను. మొదటి రాత్రి అనాలి." అంది నిశ్చల.
కృతి బుగ్గలు ఎర్రబడ్డాయి ఓరగా విజయ్ ని చూసి చటుక్కున తల తిప్పేసుకుంది.
"తల్లుల్లారా! మన తెలుగేకాదు ఇంగ్లీషుమాటలు ద్వంద్వార్ద౦గా వస్తాయి. ఫస్ట్ నైట్ అన్నా మొదటిరాత్రి అన్నా మనవాళ్ళు ఒకే అర్ధం తీస్తారు. కాబట్టి యీరాత్రి అనండిచాలు. ప్రధమదినం అంటూ మరో మాట వెతక్క" అంటూ జోక్ చేశాడు సుబ్బారావు.
జోకు పేలింది.
అందరూ నవ్వుతూ లేచారు.
5
ఈ రోజు ఆ యింట్లో కొందరికి అనందం మరికొందరికి మనసులు వుదాశీనంగా మారిపోయే రోజు. మరి కొందరికి కోపంకూడా రావచ్చు.
రాత్రి విజయ్ పడుకునే లోపల అందరూ వెళ్ళి చుట్టూ మూగలేదు. వెయ్యికళ్ళతో మాత్రం కాపలా కాశారు. ఎందుకంటే తెల్లారితే విజయ్ తాను ఏ పిల్లని పెళ్ళాడేది చెపుతాడు.అతని మనసు ఎవరైనా చేరుగోడతారేమో అని అందరూ తగు జాగ్రత్త వహించి వున్నారు.
సందులో సందున్నట్టు ప్రతివాళ్ళు సందుచూసుకుని విజయ్ ని చాటుగా కల్సుకుని "ఒరేయ్ విజ్జీ! పెద్దత్తయ్య కూతురు అందంగా వుంటుందిరా చదువు లేకపోతేనేం దాన్నే పెళ్ళాడు" అని ఒకరు బోధిస్తే " అందం చూడకురా విజ్జీ! కనుముక్కు తీరు బాగానే ఉంటుంది కదా, కాస్త ఛాయ తక్కువయితేనేమి చదువుకున్న పిల్ల మూడో అత్తయ్య కూతురిని చేసుకో" అని మరొకరిసలహా.
మొత్తానికి అందరూ విజయ్ కి సందుచూసుకుని సలహాలు చెప్పేవారే.
"మీ మాటే నాకు వేదవాక్యం" అన్నాడు విజయ్ మహా బుద్ధిమంతుడిలాగ.
ఆ రోజు తెల్లారేక అందరూలేచి ఒకరికన్నా ఒకరు ముందుగా తయారయ్యారు.
గృహంలో బంధువులముందు జరిగే మొగపిల్లవాడి స్వయం వరం బహుశా ఇదే మొదటిదేమో! విజయం ఎవరిని సాధించనుందో . ఏ పిల్ల పెళ్ళికూతురు కానుందో. యీ యింటి కొడలయే అదృష్టం ఎవరిదో!
అన్నీ ప్రశ్నలే.
ఎనిమిదయింది . విజయ్ తన గది తలుపులు తెరచి బైటికి రాలేదు.
ఎవరికివారు తలుపుతడితే బాగుండనని వూరుకున్నారు.
కాలం ఎవరికోసం ఆగదు. పరుగెత్తుతున్నది.
మళ్ళీ అందరి మనస్సులో అనుమానాలు ప్రశ్నలు అందోళన . ఏం చేయాలో ఎవరికీ తెలియని పరిస్థితి.
చివరికి సీతారామ్ వెళ్ళి తలుపు తట్టాడు. మొదట నెమ్మదిగా పిలుస్తూ తలుపు తట్టినవాడు క్రమంగా స్వరం హెచ్చింది పిలుస్తూ తలుపుపై గట్టిగా బాదటం మొదలుపెట్టాడు.
ఆగది కిటికీతలుపులు లోపల వేసి వుండడంవల్ల రెండోది విజయ్ గదిలోంచి జవాబు యివ్వకపోవటంతో అందరూ కంగారు పడుతూ గదిముందు చేరారు.
పావుగంట తలుపులు బాదినా ప్రయోజనం లేకపోయింది ఈ పెళ్ళి ఇష్టంలేక విజయ్ ఏ అఘాయిత్యమూ చేసుకోలేదు కదా! ఉహూ అలాంటివాడు కాదె! ఏమో ఎవరు చేప్పగలరు. తెలుకోండి లాంటి ప్రశ్నలు వాళ్ళందరినీ బాధించాయి. పెళ్ళి చేసుకోకపోతే ఇక్కడ ఎవరికోమ్పా మునగాడు కాని ఇంట్లో విజ్జీ వక్కడే మొగనలుసు వంశాకురంవగైరా వగైరా.
విజ్జీ చల్లగా వుంటేచాలు . అందరూ నీరుకారిపోతూ అనుకున్నారు విజ్జీ తల్లి అయితే నెమ్మదిగా రాగం అందుకుంది సీతారామ్ వస్తుతహా పిరికివాడు .చేతులూ కాళ్ళూ వణికిపోతుంటే అలా కూర్చోండి పోయాడు.
మామూలు పలుగులు అందుకున్నారు తలుపులు పగలకొట్టటం మొదలుపెట్టారు. పూర్వం కట్టించిన ఇల్లు. పూర్వకాలం తలుపులు అ గట్టితనమే వేరు.
అరగంట అవస్థపడ్డ తర్వాత తలుపులు తెరవపడ్డాయి.
లోపలి దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులై అలా నిలబడి పోయారు.
రాత్రి అందరుముందూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న విజయ్ ఆ గదిలోలేడు. గది తలుపులు కిటికీలు లోపల వేసి వున్నాయి. వేసినవి వేసివుండగా.......
మనిషి మాయం కావడం సాధ్యమా?
"విజ్జీ పక్కమీద ఏదో కాగితం వుందేవ్?" ముందుగా చూసిన విజ్జీ పెద్దక్క కేకపెట్టింది.
"అవునేవ్?" అంటూ పరుగు వెళ్ళి రెండో అక్క ఆ కాగితం అందుకుంది.
పెద్దమావయ్య ఆ కాగితం తానందుకుని "ఏం భయపడకండి నేచాద్య్వుతా వినండి" అని పైకి గట్టిగా చదవటం మొదలు పెట్టాడు.
విజయ్ కి వాళ్ళ అమ్మ వద్ద చదువు ప్రేమ ఎక్కువ అందుకని ముందు మాటగా వాళ్ళందరినీ వదిలి అమ్మనామమే జపించాడు.
"ప్రియమైన అమ్మకి
నమస్కారములు .
నాన్నగారికి మావయ్యలకి అత్తయ్యలకి అక్కలు బావగార్లకి చిన్ని మరదళ్ళకి.
ఇదేమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ? అదంతే మరి. ఆ రోజు తాతగారి గదిలోంచి నేను బైటకి రాంగానే అందరూ చుట్టుముట్టి "తాతగారు చెప్పింది ఏమిటంటూ !" వుక్కిరిబిక్కిరి చేశారు. నోటికొచ్చిన అబద్ధం ఆ నిముషాన తోచింది ఆడాను అంతే.
నామీద మూకుమ్మడి పెళ్ళిదాడి జరిగింది. ఒక చిన్న అబద్ధం ఒక్కోసారి ప్రాణాన్ని రక్షిస్తుంది. మరోసారి తీస్తుంది. ఇదో అనుభవం నాకు.
తలుపులు కిటికీలు మూసివున్న గదిలోంచి ఎలా మాయమయ్యానా అని ఆశ్చర్యపోతున్నారు. కదూ? నా టైము కలసిరావడానికి మీ టైము వేస్ట్ కావటానికి బైట నుంచి లోపలి గడియ వేశానంతే .
అసలు విషయానికోస్తాను.
అమ్మా! తాతగారు ఒకానొకనాడు తరుచు ఇల్లు వదిలి వెళ్ళేవారని రెండు మూడు నెలలపాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చే వారని ఈ యింట్లో మీ అందరికి తెలిసిన విషయమే . అదొక అపూర్వ పరమాద్భుతమైన విషయం .తాతగారు చివరి క్షణాలలో అదే నాకు చెప్పారు.
తాతగారు నన్నో కోరిక కోరారు. అది తీరుస్తానని మాట ఇచ్చాను ఆ అపూర్వమైన కోరికేమిటో తెలుసుకోవాలని మీ అందరికీ వుంటుందని నాకు తెలుసు. కాని అది రహస్యం . రహస్యాన్ని రహస్యం గానే వుంచాలి. అందుకే అదేమిటో మీకు నేను తెలియజేయ్యటం లేదు.