Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 9

           
                                        అద్దంలో జిన్నా


    యం.ఏ. జిన్నా కోటు తొడుక్కుని అద్దంముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అద్దంలో నిజానికి ఒక జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనకాల ఎంతోమంది మహమ్మదీయులు వరుసలుతీరి 'జిన్నాకీ జై' అంటూ నిలబడ్డారు. అందరిలోనూ ఒక్కొక్క జిన్నా ఉన్నాడు. ప్రతి మహమ్మదీయుడూ ఒక అద్దం. అద్దంలో జిన్నా అంటే విశాలమూ, వివిధమూ అయిపోయిన జిన్నా. వెడల్పూ , పొడుగూ విస్తరించి మరీ రహస్యమూ మరీ ప్రకటితము అయిపోయిన జిన్నా.

    జిన్నా చాలా గొప్పవాడు. కోటు గుండీలు పెట్టుకుంటున్నాడు. 'పోర్టికోలో' కారు ఆగింది. ఆ కారుమీద జిన్నా తన గృహావరణం దాటి వీధిలోకి వెళతాడు. పత్రికా విలేఖరులూ, అనుయాయులూ, భక్తులూ, రాజకీయవేత్తలూ పోర్టికో స్తంభాన్ని ఆనుకుని నుంచున్నారు. ఆతృతతో, నమ్రతతో నుంచున్నారు. తన్ను దర్శించటానికి వచ్చారు. అవి రంజాన్ రోజులు కాబట్టి! తన్ను దర్శించడంలో మహత్తు వుంది. ఒక జగత్తు ఉంది. తాను కోటు గుండీలు పెట్టుకునే ఒక సామాన్య ప్రాణికాడు. తాను వారిలో అవ్యక్తంగా ఉన్న ఒక ఆశ. థన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక పెద్ద అవ్యక్తత.

     తానొక రూపంకాదు. ఒక చిత్రంకాదు. ఒక విచిత్రంకాదు. తానొక పెద్దవయస్సు, తానొక పెద్ద భావం. మనసు కండరాలకన్నా, కోటు గుండీల కన్నా పెద్దది. గొప్పది. ఆ మనస్సు తనలో వుంది. ఆ మనస్సు తనలో పెద్ద కాంతిలా వుంది. ఆ మనస్సు పరమాణువులా ఆ పరమాణువు ఉంది. తన చుట్టూ వలయాలు కల్పించుకుంటూ శక్తినీ, కదలికనీ ప్రేరేపిస్తుంది. ఆ కదలికలో కోటి మనస్సులలో ఉండే కోటి పరమాణువుల్ని తాకుతుంది. తన మనస్సు రథికుడు ఆ మనస్సు సృష్టించిన భావం ఒక రథం. ఆ రథాన్ని తను నడిపిస్తున్నాడు మహమ్మదీయు లందరూ ఆ రథచక్రాలకి కట్టుబడి ఉన్నారు. ఆ రథం అతివేగంతో నడుస్తుంది. వేగం రథంతో నడవలేదు. పంజాబ్, సింధు, బెలూచిస్థాన్, బెంగాల్, అస్సామ్ భూములమీద ఆ రథం నడుస్తుంది. ఆ చప్పుడుకి కాబూలు కైబరు కనుమలు ప్రతిధ్వనిస్తాయి. కైలాసం మీద మహేశ్వరుడికి బదులుగా 'అల్లా'ని తాను ప్రతిష్ఠిస్తాడు. తన రథం వెనకాల మహమ్మదీయు లందరూ వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు తెలుసుకుంటే ఎవరూ ఏ విషయం ఏమీ చెయ్యరు. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ విధానానికీ కారణం. ఆ అజ్ఞానాన్ని తాను భద్రంగా కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తాను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు.

    తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో ఉండే ఒక అధికార వాంఛ ఆ భావాన్ని తయారుచేసి ఇతరుల్ని నమ్మమంది. తాను నమ్మినట్టుగా నమ్మించింది. తాను నమ్మినట్టుగా ఉండిపోవడం వలన ఒక్కొక్కసారి తాను నమ్మేశాడు. అలా నమ్మకపోతే పదికోట్ల మంది మహమ్మదీయులు తన వెనకాల రారు. పదికోట్ల జెండాలమీద పదికోట్ల అర్ధచంద్రరేఖ లెగరవు. పదికోట్లమంది యొక్కయిరవైకోట్ల కళ్ళల్లోని భక్తినీ, విశ్వాసాన్ని తాను చూరగొనలేడు. తనకేకాదు ఈ స్వార్ధం అందరికీ ఉంటుంది. హిట్లర్, చర్చిల్, నెహ్రూ, గాంధీ -అందరికీ ఉంటుందనుకున్నాడు జిన్నా. గాంధీ , నెహ్రూ తనలాగే అద్దంలో చూసుకుంటారు. సంతృప్తి పడతారు. తన స్వార్ధం గొప్పది. తన స్వార్ధం పవిత్రమైనది. తన స్వార్ధంలేనిదే తాను ఏమీకాడు. తాను ఏమీ కాకపోతే ముస్లిం జగత్తు అంతా ఏమీకాదు. అర్ధంలేనిదై పోతుంది. ఆకృతిలేనిదై పోతుంది. ఆశలేనిదై పోతుంది. అబద్దమై పోతుంది. ఆవిరై పోతుంది.

    జిన్నా కోటు గుండీలు పెట్టుకున్నాడు. 'పోర్టికో'లోకి వచ్చాడు. జనం పాయలుగా విచ్చిపోయారు. జనం మిణుగురుల్లా ముడుచుకుపోయారు. నీటిమీద వేసిన తారాజువ్వలా జిన్నా ముందుకు సాగిపోయాడు. పైన అనంతమైన ఆకాశం ఉంది. కింద ఎక్కడికో పరుచుకున్న భూమి ఉంది.

    జిన్నా ఆకాశం అంచుకీ, భూమి చివరికి వ్యాపించాడు. జిన్నాలోని 'అధికారం' గాలిలో కలిసి చెట్లల్లో పచ్చదనంగా మబ్బులలోని నీలిమగా అయిపోయింది. దూరంగా వేలకొలదీ మహమ్మదీయులు తన కారుని చూచి చేయెత్తి సలాము చేశారు. వాళ్ళ కళ్ళు తనని చూడగానే జిగేల్ మని మెరిశాయి. వాళ్ళ కళ్ళు ప్రకాశించాయి. వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. వాళ్ళలోని తన భావం విద్యుత్తుతో చేసిన కొరడాలాగ ఒక చరుపు చరిచింది. వాళ్ళు పరిసరాల్నీ నీతినీ దేహాన్నీ. సర్వాన్నీ మరిచిపోయారు. వాళ్ళు తన 'భావం' అయిపోయారు. వాళ్ళు జలపాతం వంటి తన భావంతో మోదబడ్డారు. కల్లు వంటి తన భావంతో నింపబడ్డారు. కత్తులూ కర్రలూ పైకితీశారు. జిన్నాకారు విధిమలుపు తిరిగింది. తన వెనకాల కోటి మనస్సులు మలుపుతిరిగాయి. యావత్తు దేశం యొక్క భవిష్యత్తు మలుపు తిరిగింది.

    జిన్నా తన కారుమీద తిరిగి వస్తున్నాడు. రోడ్లమీద రక్తం కనపడింది. రక్తంపక్కన శవాలు కనపడ్డాయి. గాజుగుడ్ల శవాలు -చేష్ట, వికృతీలేని శవాలు కనపడ్డాయి. శవాలపక్క తన 'భావం' కనపడింది. జిన్నా ఉలిక్కిపడ్డాడు. జిన్నా కోటు గుండీలు సరిచేసుకున్నాడు. ఉలిక్కిపడిన జిన్నాలో రక్తం చల్లబడింది. రక్తం నల్లబడింది. ఎదురుగా రోడ్ల మీద మానవుల రక్తం వుంది. హిందువుల రక్తం ఉంది. ముస్లిముల రక్తం ఉంది. ఆ రక్తంలో ఎర్రకణాలు చచ్చిపోయాయి. ఆ రక్తంలో రక్తం యొక్క గుణం పోయింది. ఆ రక్తానికి ఏ జాతీ నీతీ లేదు. ఏ భేదమూ లేదు. ఆ రక్తం మనిషికన్న గొప్పది. ఆ రక్తం ఒక పెద్ద నిజం. ఆ రక్తం ప్రపంచమంతా మానవులకిందా సింహాలకిందా బల్లులకిందా గొర్రెలకిందా హిందువులకిందా ముస్లిములకిందా అనేక రూపాలు ధరించింది. ఆ రక్తం ఒక పరమ సత్యాన్ని చాటుతోంది. ఆ రక్తం ఒక పెద్ద అమాయకత్వం. ఆ రక్తం ఒక పెద్ద కరుణ. ఆ రక్తం ఒక ఆర్తనాదం. ఆ రక్తం మానవుడి నీరసత్వాన్ని బుద్బుదత్వాన్ని తెలుపుతోంది. ఆ రక్తం మానవుడి పవిత్రతనీ మానవుడి మానవత్వాన్నీ తెలుపుతుంది.

 Previous Page Next Page