Next Page 
అమృతం కురిసిన రాత్రి  పేజి 1

          

                                      అమృతం కురిసిన రాత్రి
                                                               (కవితా సంపుటి)

                                                                      -   బాలగంగాధర తిలక్
ప్రతి ఇంటా ఉండదగిన ఉత్తమ గ్రంధంగా
"జనహిత" ఎంపిక చేసిన పుస్తకం

అమృతం కురిసిన రాత్రి
రెండవకూర్పు  

(1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ  

అవార్డు పొందిన

 ఉత్తమ కవితా సంకలనం)  

 ఈ కూర్పు గురించి.....     

బాలగంగాధర తిలక్ కవితా సంపుటి మొదటి కూర్పుని రసజ్ఞలోకం ఆదరించి మూడు ముద్రణలయ్యేలా ప్రోత్సహించింది. మొదటి కూర్పులోని తిలక్ గేయాలతో పాటు అముద్రిత గేయాలను కూడా సేకరించి ఈ సంపుటిలో వేస్తే బాగుంటుందని సాహితీ మిత్రులు అనేకమంది సూచించారు.

సాచివెయ్యకుండా సకాలంలో సహకరించడం, చెయ్యడం కాస్త కష్టమే అయినా నిష్టూరం లేకుండా ఆ కష్టాన్ని ఆహ్వానించిన మిత్రులు అత్తలూరి నరసింహారావు, మిరియాల రామకృష్ణ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గార్లకి కృతజ్ఞులం.

మొదటి కూర్పుని సమీక్షిస్తూ వస్తుదృష్టితోనో, కాలక్రమంలోనో గేయాల అమరిక మారిస్తే బాగుంటుందని సమీక్షకులు కొందరు అభిప్రాయపడ్డారు. ఈ కూర్పుని కాలక్రమేణా అమర్చి యిచ్చిన సోమసుందర్ కి కృతజ్ఞులం.

కొత్తగా చేర్చిన వాటిలో కొన్ని తిలక్ మరణానంతరం మిరియాల రామకృష్ణ, సోమసుందర్ లు పరిష్కరించి కళాకేళిలో ప్రచురించినవి.

కొన్ని అముద్రిత అసంపూర్ణ రచనల్ని అనుబంధంగా చేర్చాం. భావానుగుణంగా వాటికి శీర్షిక లుంచాం.

ఈ ముద్రణలో శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు గారిచ్చిన "భరతవాక్యం", "శవం" కవితలను, శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు గారిచ్చిన "త్రిశూలం", "కవివాక్కు" (పూర్తిపాఠం), "త్రిమూర్తులు" (పాఠాంతరం) కవితలను చేర్చాము. వారిద్దరికి మా కృతజ్ఞతలు.

ఈ కూర్పును కూడా రసజ్ఞలోకం మరింత ఆదరణతో స్వీకరిస్తుందని ఆశిస్తూ-
                                                     - ప్రకాశకులు

అది కాదు, నాకు
తెలియకడుగుతున్నాను
ఏమిటీ ఘోరం?
అబద్ధాలు ప్రకటించడానికి
అలవాటుపడిపోయిన-కాదు
అంకితం అయిపోయిన
ఓ దుర్వార్తా పత్రికలారా! చెప్పండి
ఈ వార్త నిజమేనా?
(బహుశా నిజమే అనుకోవాలి. అప్పుడప్పుడో
భయంకర సత్యం ప్రకటిస్తారు! అప్పుడే మీ
అబద్ధాలకు విలువ.)
   
సిమెంటనే మారు పేరు ధరించిన
ఇసుకతో నిర్మించబడిన
వంతెనలాంటి ప్రభుత్వమా
ఏమిటీ ఘోరం?
అని నిన్నడిగి ఏం లాభం?   

Next Page