Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 8

    నిశ్శబ్దంగా ఇద్దరూ ముందుకు నడిచి వెళుతున్నారు. పోలీసు ఈల దూరంగా వినపడింది. తూర్పున నక్షత్రం మీద కప్పుకున్న మబ్బు పింజె పింజెలుగా విడిపోయంది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. యూబా, ఆమా. ఇరువురూ గాఢమైన కౌగిలిలో ఉన్నారు. ఇద్దరూ ఇసుక ప్రదేశం దాటి ఎత్తుగావున్న ఒక దిబ్బదగ్గరకు వచ్చారు. అక్కడ కొన్ని తాడిచెట్లు మాత్రం ఉన్నాయి. చక్రాలూ, టాపూ లేని ఒక పాత జీపుకారు తుప్పుపట్టి బోర్లాపడివుంది.

    "ఇలా కూర్చుందాం" అన్నాడతను.

    "ఊ"

    దిబ్బమీద ఇద్దరూ కూర్చున్నారు. ఆకాశంమీద చంద్రుడు వడలిన పువ్వురేకులా ఉన్నాడు. ఇద్దరి నీడలూ వెనక్కి పొడుగ్గా సాచుకుని ఉన్నాయి.

    "యూబా చిత్రమైనవాడు" అన్నాడతను.

    "ఔను"

    "మరి....."

    ఆమె కనులు పైకెత్తి "ఏమిటి?" అంది.

    "ఏదో చెప్పబోయి మరచిపోయాను" అన్నాడతను. జేబులోనికి చెయ్యి పోనిచ్చి తీసివేసి.

    ఆమె వింతగా చూసింది. అతను నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు. తాటిచెట్టు పక్కనుండి ఒక ముంగిస పరిగెత్తుకు వెళ్ళింది. గుడ్డి వెన్నెలలో పట్టణపు మేడల కొసలు మెరుస్తున్నాయి. దూరంగా డేరాల నీడలు యిసుకలో మెత్తగా పరుచుకున్నాయి. అంతా విచిత్రమైన నిశ్శబ్దం.

    అతను చటుక్కున నవ్వాడు. ఆమె కంగారుగా ముంగురులు పైకి తోసుకుని "ఏం?" అంది.

    "ఏముందీ- ఎందుకో వచ్చింది ఏడుపులాంటి నవ్వు" అన్నాడు.

    అతను జేబులో చెయ్యిపెట్టి తీసివేశాడు. పళ్ళు పటపటా కొరుకుతూ  "యుద్ధం!" అన్నాడు.

    ఆమె మాట్లాడలేదు. అతను ఆమెకేసి చూశాడు. ఆమె కళ్ళమ్మట నీటిచుక్కలు రాలుతున్నాయి. అతను తెల్లబోయాడు. జాలి అతని మొహంలో ప్రసరించింది.

    "ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నాడు విసుగ్గా జాలిగా.

    ఆమె జవాబు యివ్వలేదు. అతడు ఆమె దగ్గరగా జరిగి ఆమె తలనీ, చెక్కిళ్ళనీ నిమిరాడు. ఆమె వొరిగి అతని వక్షంమీద తలని ఆన్చింది. అతనామె పెదవుల్ని మెల్లగా మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరి పక్కగా ఒకరు ఒదిగి పడుకున్నారు.

    "రేపు ఆఫీసరు వస్తాడు పరీక్ష చేసేందుకు" అన్నాడతను.

    "ఉహూఁ" అందామె.

    "ఇక్కడ బావుంది కదూ - పీడకలలు వచ్చే నిద్రకన్నా?" అన్నాడతను. అతను తిరిగి జేబులోనికి చెయ్యిపోనిచ్చి తీసివేశాడు.

    "ఎందుకు ఇందాకట్నుంచి జేబు తడుముకుంటున్నారు!" అంది ఆమె అతని జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ.
    అతను నవ్వాడు.  "సిగరెట్లకోసం -లేవన్నమాట మరచిపోతుంటాను"

    మధ్య మధ్య ఏవో అస్పష్ట రవాలు దూరంగా డేరాలనించి వినవస్తున్నాయి. కృష్ణపక్షపు గుడ్డివెన్నెలలో ఆ నగరం తనలో తానొదిగిన పెద్ద తాబేలులా వుంది.

                     **********************

 Previous Page Next Page