అనేకమంది రక్తం అది. అనేకులు తమకి తెలియకుండానే చచ్చిపోయారు. చచ్చిపోతామనుకోకుండా చచ్చిపోయారు. చంపబడ్డారు. పిల్లలూ తల్లులూ వృద్దులూ -విరిగిన కాళ్ళు, పొడిచిన కళ్ళూ, పేగులూ, మాంసమూ - అందరూ ఆరిపోయిన ప్రమిదలులా, ఆడుకుని పారవేసిన మట్టి బొమ్మలులా ఉన్నారు. అందరూ అరుస్తూ చచ్చిపోయారు. ఆ అరుపులు గుండెల్ని చీలుస్తున్నాయి. ఆ అరుపులు పోలీసుల్ని మాత్రం చీల్చడంలేదు.
జిన్నా కారు మలబారు హిల్సువైపు వెళ్ళసాగింది. కారు వెనకనే అరుపులు వెంబడించాయి. కారును వెంబడిస్తూ రక్తం ప్రవహించింది. కారులో జిన్నా ఉన్నాడు. జిన్నా చాలా గొప్పవాడు. జిన్నా తన భావాన్ని వెంబడిస్తున్నారు. డ్రైవరు అతివేగంగా కారు నడుపుతున్నాడు. జిన్నా చేతిలో వార్తాపత్రిక ఉంది. వార్తా పత్రికలో యిలా వుంది.
కలకత్తాలో రెండువేల మంది మరణం.
వార్తాపత్రిక కలకత్తా అయిపోయినది. వార్తాపత్రికలో కలకత్తా వీధులూ గల్లీలూ కనపడ్డాయి. పిచ్చిగా మత్తుగా రేగిన జుట్టుతో ఒకరి నొకరు ఆ వీధుల్లో పొడుచుకుంటున్నారు. ఒక భావం కోసం పొడుచుకుంటున్నారు. ఒక మాట కోసం మాటలు మాటల్ని పొడుచుకోవు. ఒక మాట కోసం మనుష్యులు మనుష్యుల్ని పొడుచుకుంటున్నారు. మాటలు చచ్చిపోవు. మనుష్యులు చచ్చిపోతారు. మనిషి మాటని సృష్టించాడు. మాట మనిషిని బంధించింది.
కలకత్తా, లక్నో, అలహాబాద్, అహమ్మదాబాద్, బొంబాయి. పంజాబ్ . ప్రతి నగరంలో ప్రతీవీధిలో గల్లీలో తాను నిలుచున్నట్టూ, ఎవరినో పొడిచినట్టూ ఎవరి చేతనో పొడవబడుతూన్నట్టూ ఊహించుకున్నాడు జిన్నా. అతని క్రాపు రేగింది. అతని కోటు గిండీలు వదులయ్యాయి. అతను దోషిలా బాధపడ్డాడు మనిషిలా జాలిపడ్డాడు. సంఘంలా జలదరించాడు. విశ్వంలా విస్తుపోయాడు. తన భావం కోసం యింత ఘోరం జరిగింది. తనని లోకం అంతా చూస్తోంది. ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. చరిత్ర తన కోటు గుండీలు విప్పి తన లోపల పరీక్షిస్తుంది. కొందరు తనని శిక్షించారు. తనని ఖండఖండాలుగా చీల్చివేశారు. కొందరు తనని హేళన చేశారు. తన కోటు తనకి తిరగేసి తొడిగారు. కొందరు తనని పొడిచారు. పూలమాలలు వేశారు.
"అల్లహో అక్బర్" అన్నారు.
వరండా ముందు కారు ఆగింది. రాజకీయవేత్తలూ, భక్తులు, పత్రికా విలేఖరులూ స్తంభాల్ని ఆనుకున్న స్తంభాల్లా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో కంగారు ఉంది. చీకాకువుంది. ప్రశ్నవుంది. 'నీ భావం మిమ్మల్ని ఎక్కడకు తీసుకు వెళ్ళింది? తీసుకు వెళుతుంది? ఈ రక్తపాతానికీ, మీ భావానికీ సంబంధం ఏమిటి? అమాయకంగా సుఖంగా వెళ్ళే మా కుటుంబాలలో ఈ హఠాత్ మృత్యువూ భయమూ ఎన్నాళ్ళని భరించం?'
ఆ ప్రశ్న వాళ్ళ కళ్ళల్లో పెద్దమౌనంగా ఉంది. ఆ మౌనం భయంకరమైన శబ్దంలా ఉంది. చచ్చిన జీవుల మౌనం! వాళ్ల భార్యల చచ్చీచావని ప్రాణాల మౌనం, ఆ వరండాలో పోర్టికోలో పేరుకుంది. ఆ మౌనం ఎలుగుబంటిలా కూర్చుంది. పులిలాగ పంజా చరచింది.
ఒక భావంతో పదికోట్లమందిని ఒకటిగా చేశాడు. ఒక భావంతో పదికోట్లమందిని ముప్పైకోట్ల జనం నుండి వేరుచేశాడు. అందరూ ఇదేచేస్తారు. రాజకీయవేత్తలపని వేరుచేయడం. ఒక జాతి అంటే తక్కిన మానవ సంఘంతో వేరుపడిన ఒక సమూహం అన్నమాట. ఎంత బాగా వేరుచేస్తే అంత పెద్ద నాయకుడవుతాడు. ఫాసిజం అని ఒక దేశం వేరుపడింది. మరొక యిజం అని వెలుగునూ ఇంకో దేశం వేరుపడింది. మతం, నీతి, విజ్ఞానమూ మనిషినీ మనిషినీ వేరుచేస్తున్నాయి. నక్షత్రాన్నీ వెలుగునూ వేరుచేస్తున్నాయి. పువ్వునీ పువ్వురేకుల్నీ వేరుచేస్తున్నాయి. గుండెకి గుండెకీ మధ్య ఒక అగాధం తను సృష్టించాడు. ఆ అగాధాన్ని తానిప్పుడు దాటలేడు. పూడ్చలేడు. నిజానికి ఆ అగాధంలోనే తానున్నాడు.
కానీ రక్తపు మరక వుంది, అక్కడ ఆ గుండెమీద. ఆయాకి కనపడలేదు -తనకి కనపడింది. అది ఒక నిజం! అది ఒక ఛాలెంజి! ఆ రక్తపు మరక యిలా అంది. "నీ భావం అబద్ధం, నీ భావం అనవసరం" తనే నిజం అంది. భావంకన్నా , మనుష్యులకన్నా , ప్రభుత్వాలకన్నా, సిద్దాంతాలకన్నా తానే నిజం అంది. తనకోసమే యివన్నీ అంది. ఆ రక్తపు మరకని చూశాడు. తిరిగి జిన్నా కళ్ళు మూసుకున్నాడు.