రెడ్డిగారు ఎన్నడూ వీణ చూడలేదు. కాని వీణముందు కూర్చుంటే మంజరి సరస్వతిలా వుంటుందని విని "అచ్చా అదేతే" అని "దొరసాన్లను ఏం కావాల్నో అర్చుకొని (కనుక్కొని) చెప్పుతా, నాకు మాత్రం గాజు బిందెలు కావాలే పది. కుండలంత పెద్ద గుండాలే. అబిద్ రోడ్ లో దొరుకుతాయనుకుంట. పత్తర్ ఘట్టిల మంచి జరీ చీరలు దొరుకుతాయి. నవాబులు కొనే దుకాణం ఉన్నది. ఆన్నించి నాల్గుచీరల్తే. రెండు చిందొరసానికి, రెండు పెద్దొర్సానికి. ఎసువంటియి తెస్తవో మెప్పించలే వాండ్లను, ఆన్నే "షాహీహల్వాయి" దుకాణాలున్నాయి. హుజూర్ కు(రాజుగారు) మిఠాయి పోతదాన్నుంచి. ఆన్నుంచి అయిదు సేర్ల మిఠాయితే. మక్క మసీదు ముంగల పక్కలకు వెండి రేకులు, బంగారం రేకులు అమ్ముతరు. అవి శాన మంచివి ఒంటికి. పది తులాల వెండి రేకు, ఒక తులం బంగారం రేకు తేవాలే. మరింకేం కావాల్నో అడిగి చెప్పుతా" అని వనజను కేకవేశారు. "వనజా! దొరసాన్లతో చెప్పు పంతులు రేపు పట్నం పోతాండని, ఏమెంకావాల్నో రాసియ్యమంచెప్పు" అని పాణి వేపు తిరిగి-
"పట్నంల హుషార్ గుండాలె. మంచి హోటల్ల దిగు. డబ్బు చేతినిండ కర్చు చెయ్యి. ఇన్నూరు రూపాయలు వాడుకో సరేగాని, జల్దేరావాలే. టెసనుకు సవారి కచ్చడం (ఎద్దుబండి, సుఖప్రయాణానికి తగినది) ఎప్పుడు తోలమంట?" అన్నారు.
ఇది వింటూనే ఉక్కిరిబిక్కిరైనాడు పాణి.
"చిత్తం. అలాగే వస్తానండి. రేపు వెళ్తున్నాగా - రెండు రోజులు పట్నంలో ఉంటా. నాలుగు సినీమాలు చూస్తా. సినీమాలంటే నాకు చెడ్డపిచ్చండీ. ఏనాటికైనా సినీమాల్లో పాడాలి. మీ దయ ఉంటే మూడోనాడు బైల్దేరతానండీ! నాలుగోనాడు ఉదయం పంపించండి కచ్చడం."
ఇంతట్లోకి డబ్బూ, మంజరి వ్రాసిచ్చిన జాబితా తెచ్చిచ్చింది వనజ. అవి రెండూ పాణికి అప్పగించి, జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్పి రెడ్డిగారు వెళ్ళిపోయారు.
ఆ తరువాత భోజనపు పళ్ళెం తీసుకొని వచ్చేసింది వనజ. పళ్ళెం కావిడి పెట్టెమీద పెట్టి "పట్నం పోతున్నరట. చెప్పసుతలేదు (చెప్పనుకూడా లేదు) అన్నది చిరుకోపంగా.
"నాకుమాత్రమేం తెల్సు? కరణంగారు స్వయంగా వెళ్తామన్నారు. ఇవ్వాళ ఉదయమే నన్ను వెళ్ళమన్నారు."
"అయినా నాకేమిటికి చెప్పుతరుగని-తాయారుకూ, సీతకూ చెప్పుతరు. దాసీదాన్ని...."
"వనజా! అంతకోపమా?" అని చెయ్యిపట్టుకొని లాగి పక్కన కూర్చోపెట్టుకొని, "తాయారంటే నాకిష్టమనుకున్నావా? అసహ్యం. పిచ్చి పిచ్చిగా చూస్తుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఇక సీత పెళ్ళయిన పిల్ల గదా, నువు అలా అనొచ్చా? కోపం వచ్చినా ఎంత అందంగా ఉంటావు!" అన్నాడు, వంచిన ముఖాన్ని చూడ్డానికి తాను వంగుతూ. వనజ తలెత్తింది. కళ్ళు ఎర్రగా వున్నాయి. "ఇప్పుడు నీకళ్ళు నిజంగా తామరరేకులే వనజా!" అని, "నీకోసం ఏం తెమ్మంటావు పట్నం నుంచి?" అని అడిగాడు.
కోపం దిగిపోయింది. దొర ఎన్నిసార్లు పట్నం వెళ్ళలేదు! ఎందరెందరికి ఎన్నెన్ని వస్తువులు తేలేదు? తన నెప్పుడైనా అడిగాడా-ఏం కావాలని? వాస్తవంగా తనకు కావలసిందేమిటి? నీలి ఆకాశపు రంగుచీర కట్టుకోవాలని తాను చాలాకాలం నుంచి అనుకుంటూంది? అట్లాంటి చీర తెచ్చి పెట్టమందామనుకుంది. కాని, ఎంత ఖరీదు అవుతుందో? అదీకాక, పంతులు తనకు చీరతెచ్చి పెడ్తే దొర ఏమనుకుంటాడు? దొరసానులు ఏమనుకుంటారు? పంతులు వాళ్ళ దృష్టిలో చులకనైపోతాడు. తనకు చీర లేకున్నా పరవాలేదు. పంతులు గౌరవానికి లోపం రాకూడదు అనుకున్నది.
"గులాబిపూలు" జవాబు చెప్పింది.
"ఉష్ ఇంతేనా? గంపెడు తెస్తా. సరేనా?"
తల ఊపింది సరేనని. "మళ్ళెప్పుడొస్తరు" అడిగింది.
"మూడు రోజులకు"
"మూడొద్దులకా?"
"ఎంతలో వెళ్ళిపోతాయి మూడురోజులు?"
వనజ మరిమాట్లాల్లేదు. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. మంజరి వ్రాసి ఇచ్చిన పట్టిక చూచాడు పాణి. ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. అక్షరాలు పట్టిచూస్తే మంజరి అందకత్తె కావాలి. బహుశా మంజరిది బంగారుఛాయ కావాలి. ఆ రంగునీళ్ళు నీలిచీర కట్టుకుంటే అందంగా వుంటారు. మబ్బుల్లో మెరుపులా ఉంటారు. కాబట్టి నీలాకాశపు రంగుచీర ఒకటి మంజరికి తేవాలి. లేతరంగు చీరలు తేవాలి. ఎలాంటి చీరెలు తేవాలంటే - వాటిని చూచి తన ఎన్నికకు ఆవిడ మురిసిపోవాలి. గులాబులు రెడ్డిగారు ఎన్నడూ తేనన్ని తేవాలి అనుకొని మంజరి వ్రాసిచ్చిన జాబితా చదివాడు.
"కుంకుమ రంగు రంగులది! తలనూనెలు, తలమసాలా, అత్తర్లు మొగిలి, గులాబి, చమేలి, మల్లే, మట్టి."
ఇంకా ఎన్నో వున్నాయి. అన్నీ అలంకరణ వస్తువులే. అన్నీ పాతవే. అందులో స్నో, పవుడర్, లిప్ స్టిక్, వగైరాల్లేవు. ఆధునిక అలంకరణలన్నీ తేవాలనుకున్నాడు. ఏదో కొత్తదనం చూపించాలనుకున్నాడు. అందర్నీ మురిపించాలనుకున్నాడు. అవే ఆలోచనల్లో పడుకొని నిద్రపోయాడు.
తెల్లవారుజామున వచ్చి గదితలుపులు తట్టిలేపాడు ఎంకటి. "గాడికి యాళైతాంది (బండికి వేళఅవుతూంది) ఎల్లిగా డొచ్చిండు. కచ్చడం తయారైంది. మల్లిగాడు సామానులు సరుదుకుంటాండు. నీలుకాగి తయారుగున్నై, లేచి స్నానం చెయ్యి" అన్నాడు. పాణి లేచిచూస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
"ఇగో యాప్పుల్ల, పండ్లు తోముకుంటార్కల్ల మల్లొస్త" అని వెళ్ళిపోయాడు ఎంకటి.
పుల్ల నోట్లో వేసుకొని గదినుంచి బయటికి వచ్చాడు. వరండాలో ఉన్న పిట్టగోడనానుకొని పండ్లు తోముకుంటున్నాడు. ఊరు స్పష్టంగా కనిపిస్తూందక్కన్నుంచి. పొగమంచు నిండింది ఊరినిండా. ఆ ఊరికి గడీ ఒక కోటలాగుంది. గడిముందు ఒక పెద్ద పెంకుటిల్లుంది. అది పశువుల దొడ్డి! దానికి ముందరే రెండు పెద్ద వేపచెట్లున్నాయి. వాటిమీద అరుగులు కట్టివున్నాయి. అవి రెడ్డిగారి కచ్చేరీలు. అక్కడ కూర్చొనే వారు తగాదాలు పరిష్కారం చేస్తుంటారు. శిక్షలు విధిస్తుంటారు. గడి పక్కనుంచి వెళ్ళే తిన్నని బాటన వెళ్ళితే కుడివైపు ఒక పెంకుటిల్లుంది. అది సావిడి. అధికార్లు వస్తే దిగేచోటు. ఆ రాచబాటకు అటు ప్రక్కా ఇటు ప్రక్కా చిందరవందరగా గొందులున్నాయి. పైన చూచిన పెంకుటిల్లు తప్ప మిగతావన్నీ గుడిసెలే. అక్కడక్కడా చింతచెట్లూ, వేపచెట్లూ, రావిచెట్లూ ఉన్నాయి. మొత్తంమీద లంకలాంటి ఈ గడీ తప్పితే సుమారు మిగతా ఊరంతా పూరిగుడిసెలే - ఏ ఒకటో రెండో తప్ప. ఈ గడీ ఒక మహా వటవృక్షం. దీని నీడన ఏ గడ్డీ మొలవడానికి వీల్లేదు. ఒక ప్రాణికోసం కాకుంటే ఒక్క కుటుంబం కోసరమే ఈ వూరంతా వెలిసినట్లుంది. ఊరంతా రెడ్డిగారి దయా ధర్మాలమీద జీవించాల్సిందే. ఆయన పెడితే తినాలి. కొడితే పడాలి. ఆయన దొర - ప్రభువు! ఆయనదే శాసనం, మరే శాసనానికి ఆయన లొంగరు.
ఎంకటి వచ్చి స్నానానికి పిలుస్తే ఆలోచనల్లోంచి తేరుకొని గబగబా పండ్లు తోముకుంటూ స్నానాల గదికి వెళ్ళాడు పాణి. గదికి తిరిగి వచ్చి బట్టలు వేసుకునేవరకు ఉపాహారపు పళ్ళెం తీసుకొని వచ్చింది వనజ. అది చూచి ఆశ్చర్యపోయాడు పాణి. 'అంత తెల్లవారుజామున ఫలహారమా, వనజా!' అన్నాడు. చూస్తె వెన్నముద్ద, కొద్దిగా కారం, పెద్ద పెద్ద పూరీలు ఉన్నాయి.
"పట్నం చేరేటాల్కల్ల ఎంత పొద్దయితదో ఎరికేనా?"
"వనజా! నీ కెందు కింత శ్రమ?"
"కష్టమేమున్నది? నేనేమన్నా వండిన్నా? పెట్టినా? వండినోడు ఈరిగాడు. చెప్పింది దొరసాని, తెచ్చిందాన్ని నేను."
"వనజా! నువ్వెంత మంచిదానివి!"
వనజ కళ్ళు పెద్దవి చేసి చూసింది. "మల్లెప్పుడొస్తరు" అని అడిగింది.
"చెప్పాగా రాత్రి."
"జల్ది రాలేరా?"
"ఇంకా త్వరగానా?"
తలవంచుకొని గోళ్ళు గిల్లుకుంటూ "ఊ!" అన్నది.
"పిచ్చిదానా!" అని రెండుచేతుల్తోనూ భుజాలు పట్టుకొని "మూడురోజులేగా. నాలుగోరోజు ఇక్కడుంటా" అన్నాడు.
పాణి తింటుంటే వనజ నుంచుంది. మౌనంగా గడిచిపోయింది కాలం.
ఎంకటి వచ్చి "కచ్చడం తయారైంది. ఎల్తారా?" అన్నాడు. మెట్లు దిగుతే సవారి కచ్చాడం సిద్దంగా ఉంది. సవారి కచ్చడంలో మంచంమీద తెల్లని పరుపు ఉంది. రెండు పెద్దపెద్ద దిండ్లు పెట్టి వున్నాయి. చెప్పులు వదిలి బండెక్కి వెనక్కి తిరిగిచూస్తే వనజ నుంచొని వుంది. చాకలివాడు చెప్పులుతీసి బండ్లో మంచం క్రింద పెట్టాడు. గజ్జెలు ఘల్లుమని బండి కదిలింది. గేటు దాటేదాకా అక్కడే నుంచొని చూసింది వనజ.
బండి సాగిపోతూంది ఊళ్లోంచి. కరణం ఇల్లూ, కోమట్ల ఇండ్లూ దాటింది. గుడిసెలవాళ్ళు జొన్నలుదంచుకుంటూ పాటలు పాడుతున్నారు.
"నువ్వన్న చుక్కల్లు రాజమామిళ్ళు - నా చేతిరోకండ్లు నల్లరోకండ్లు
చేయించు అన్నయ్య చేవరోకండ్లు - వేయించు అన్నయ్య వెండి పొన్నుల్లు
సువ్వని నే నొక్క పోటేసిటేను - చుక్కలు పిక్కటిల్లు సూరన్న (సూర్యుడు) కదలు అస్సని నేనొక్క పోటేసితేను - ఆకసమ్ము కదలు ఆ రాజు కదలు
తమల పాకుల మీద వడ్లెండపోసి - రాచిలక పోచిలక వడ్లు దంతాము
రాచిలక దంచినవి రాసులడ్డాయి - పోచిలక దంచినవి పోగులడ్డాయి
రోకలి చిన్నాది, రోలు చిన్నాది - నాతోటి పోటేసే చెలియ చిన్నాది
రోకలికి రోటికి రెండు దండాలు - మమ్ముకన్న తల్లికి వెయ్యిదండాలు."
ఆ పాట పండితులు వ్రాసిపెట్టిందికాదు. ఎవరు వ్రాసిందో కూడ తెలియదు. పాడేవారికి సంగీతం రాదు. శాస్త్రం తెలియదు. అయినా ఆ పాట మార్గశిర మాసపు ఎండలా ఉంది పాణికి. పాట వినరాకుండా పోయి బండి ఊరుదాటితే బండి ముందుకు చూచాడు పాణి. బండి ముందు పరుగెత్తుతున్న ఒక మనిషి కనిపించాడు. అదొక అధికార చిహ్నం. అదొక లాంఛనం. ఎద్దులకంటే ముందు పరుగెత్తాలి వాడు. ఎద్దులు తరుముతుంటే పరుగెత్తాలి వాడు. ఆ ఎద్దులకు దొరికిన తిండి వాడికి దొరకదు. ప్రత్యేకంగా సవారీ కచ్చడం కోసరమే పోషిస్తారు వాటిని. ఎప్పుడో నెల కొకసారి పనిపడుతుంది వాటితో. అలా తిని బలిపిన సవారీ ఎద్దులముందు ఈ మనిషి పరిగెత్తాలి.