"ఎందుకూ వాడలా పరిగెత్తడం?" అడిగాడు పాణి.
"దొరోరి బండి కాదుండి, మనిషి ఉరకకుంటే ఎట్లా? ఈ ఎడ్లేమన్న చెప్పిన మాటింటయనుకున్రా! బండీకిందెవరన్న పడి చస్తేట్ల?"
"వాడు పరిగెత్తకుంటే ఏమౌతుంది?"
"అమ్మొ! బతుకుతాడుండి? తోల్లొల్వడుదొర! ఓసారేమైందనుకున్నరు. దొరను, దొర్సాన్నీ తీస్కపోతాన్న. ఇయ్యేం ఎద్దులుండీ. చచ్చింది కాని, దాని అమ్మ.....జింకోలే ఉరికెడిదనుకోరి. ఇట్ల ముల్లుగర్ర చూపిచ్చిన్నా చేతికి దొరక్కుండ ఉరికెడియండి మోటార్ గాడోలే (మోటారుబండి) చాకలైలగాడు ముంగలురుకుతాండు. జరదూరం పోయేటార్కల్ల ఉర్కలేక చిన్నగ నడ్వసాగించాడనుకోరి. బండికి పరదలు (తెరలు) కట్టున్నయా, దొర చూడలేదుండి. లోపట్నుంచే అడిగిండుండి. "ఏమ్రా కచ్చడమేమో చీమనడ్కనడుస్తదీ" అని. "ఆయిలుగాడు నసుగుత నడుస్తాండు దొరా" అని చెప్పిన్నుండి. "ఉరకమను గాడ్దికొడుకును, ఏం చస్తాండా" అన్నడుండి దొర. "ఒరే అయిలుగా దొరురుకుమంటుండ్రా ఉరుకు" అని కూకేసిన్నుండి. జరదూరం ఉరికిండో లేదో మళ్ళ నిలబడ్డడుండి. ఇగ బండికూడ నిలబడ్డదనుకోరి. నీ బాంచను, బండి నిలపడంగనే పులై దిగిండనుకోరి దొర. నీకాల్మొక్త, కోపమొస్తే దొరమనిషి కాడుండి. శివమెక్కుతది. నాచేతినుంచి ములుగర్ర గుంజుకొని వానిమీదికి ఉరికిండమకోరి. కడుపు కట్టుకుని కూకున్నోడల్ల నీబాంచనూ. దిగ్గునలేచి నిలబడ్డడుండి. "దొర కడుపుల్నొప్పి, నీగులాపోన్నీ ఉరకలే"నని ఏడ్వసాగించనుకోరి. దొరేమన్న ఇన్నడనుకున్రా! అబ్బ, ములుగర్ర తీసుకొని ఏం జబిరిండు, ఏం జబిరిండు (ఎంత బాదారు,). ఇట్ల తోల్లూడొచ్చినయున్రి, ఆ డాడనే పడిపోయిండా, దొరొచ్చి బండి మల్పమన్నడుండి. బండి మల్పిన. మల్ల ఊళ్లకే పోయినం ముంగల మనిషిలేక."
"అయిలుగాడే మైనాడు?"
"ఏమైతడుండి? నాలుగొద్దులు నవిసిండు (జబ్బునపడ్డాడు) మల్ల బట్టలుత్కపోయిండు."
పాణికి చాల బాధ అయింది. బండి ముందు పరుగెత్తేవాణ్ని పరిగెత్తొద్దందా మనుకున్నాడు. కాని, ఇవ్వాళ ఆపుతే ఆగిపోయేదా? అదొక శాసనం. అదొక అధికారం, అదొక ప్రభుత్వం. అది మార్చడం తనకు చేతనౌనా అనుకున్నాడు. వెనక్కు చూస్తే బెడ్డింగు, పెట్టె నెత్తిన పెట్టుకొని మరొక మనిషి పరుగెత్తుకుని వస్తున్నాడు. అది బండ్లో పెట్టకూడదూ?
మనిషి పరుగెత్తకుంటే ఏం అనుకున్నాడు.
అతనిమాట చెల్లుతుందా అక్కడ!
7
రెడ్డిగారు వంకరకర్ర పట్టుకొని పొలానికి వెళ్ళడానికి వరండాలోకి వస్తే గేటుదగ్గర నేలమీద కూర్చొని ఉన్న అహమ్మద్ మియా లేచి నేలకు చేతులానించి ముఖానికి అంటించుకొని "దండంపెడ్త గులాపోన్నీ" అన్నాడు.
"ఏమ్ర పుల్లిగ" అనబోయి "అహమద్ మియా సాబ్ సలామ్" అన్నారు రెడ్డిగారు వెటకారంగా.
"ఏట్ల అహమద్ మియా, కాట్ల అహమద్ మియా యాడి అహమద్ మియా నుండి. పుల్లిగాడనురి. నీ కాల్మొక్త. బుద్ధిలేక తురకల్లి కలిసినం. పుల్లిగా డనురి నీ బాంచిను వాలిచ్చిన గుడ్డలన్ని కాలబెట్టినం, పేర్లు మార్చుకున్నం బాంచిను. నీ గులాపోల్లం ఎట్లనన్న మల్ల కులంల కలుపురి" అని నేలమీద పడి దండం పెట్టాడు. చివరి పదం అనేప్పుడు గొంతు జీరవోయింది.
"ఏమైందిర గట్లేడుస్తాన్రు? తుర్కమురిపెం తీర్నాది? లంజకొడుకులు, అప్సర్ల (ఆఫీసర్లు) మైతమనుకున్నర్లే చావండట్లనే. ఆ తుర్కోల్లకాడికే పోయి ఫిర్యాద్ చేస్కోపో."
"అట్లంటే ఎట్ల బతుకటం నీ బాంచను. నీ పాదాలకాడ పడుంటే టోండ్లం. ఎట్లనన్న చేసి మల్ల కులంల కలుపురి గులాపోన్ని. నా తోలొలిచి చెప్పులు కుడ్త."
"ఇంతల్నే ఏమైందిరా?"
"ఎట్ల చెప్పం దొర! తుర్కల్ల చేర్నం కాదుండి. ముత్తాలమ్మక్కోపమొచ్చి గూడెంల పది గొడ్లను, నలుగురు మనుష్షుల్ను మింగిందుండి..."
ఇంకేదో చెప్పబోతూండగానే "లగ్గమైనాదిర బిడ్డది" అడిగారు రెడ్డిగారు.
"హయ్యొ నీ కాల్మొక్త లగ్గమాడిదుండి? లగ్గం చేసుకోమన్నరు కదుండి పిలగాణోలు, మేం తురకల్ల కలిసినమని"
"తుర్కపోరడు దొర్కలే యాన్నన్న?"
"అందర మొకటేనని నీతుల్చెప్పిండు కాదుండాయిన. తీర వచ్చ టార్కల తురకలు రానిస్తాన్రనుకున్రా మమ్ముల! మదార్ సాబు సుత అన్నడుండి. "హసే మీ రెక్కడి తురకల్రా? ఈ కల్పెట్టుకుంటే నెమిలైతాద్రా కాకి? ఇటు కులపోల్లు రానీయ్యకుండైన్రు. అటు తుర్కోలు రానియ్యకుండైనుండ్రి."
"బావుల్తవ్విస్తమన్నరు. బంతులు పెట్తమన్నరు కాదుర."
"నీ కాల్మొక్త. మాకాబాయిలొద్దు. ఆ బంతులొద్దు. మీ కాళ్ళకాన్నె పడుంటం, కులంల కలుపురి. కోమటాయన అప్పు పుట్టకనియ్యపోయే, కుమ్మరోడు కుండ లియ్యకపోయే! మంగలాయన గొరగడాయె, వడ్లాయన పనులు చెయ్యననె, కులపోరు పిల్లల్నియ్యమన్రి చేస్కొమన్రి, ఇగ ఊళ్లెట్లుంటం గులాపోళ్ళం. ముత్తాలమ్మకు సుత కోపమొచ్చి మింగుతాందే, బోనాలు (ఘటాలు) పడ్తనంటే బైండ్లోడు (హరిజనుల పురోహితుడు) పట్టనియడాయే. బాద్రాయికి ఏటను (మేకను) నరుకుతమంటే ఊళ్లోల్లు నరక నియ్యరైరి. ఇగెట్ల బతుకుతముండి? ఎట్లనన్న చేసి కులంల కలుపురి, మీ బాంచోల్లమై పుడ్తం."
"అరె పుల్లిగా, తురుకోడు అందర్ని కలుపుతుంటడు. వాని కులమే అట్లరా. మరి మన బాపనాయ్న నిన్ను కులంల కల్పుకోటాన్ని ఒప్పుకుంటాడ్ర. అట్లనే చావురి. కోమటాయింతోన్చెప్పి బాకీ లిప్పిస్త పని పాటలోండ్లతోని పన్జెయ్యమని సెప్పత ఎనకటెట్లున్నదో అట్లనే పడుండాలె. ఇన్నావా? తోకలేపిన్రో! ఏరికెనా?" అని మీసం మెలేశాడు.
"చచ్చినట్లు పడుంటం నీ బాంచను. ముత్తాలమ్మకు పూర (పూర్తిగా) అగ్గురమెస్తే గూడానిగ్గూడమె తింటధి. కులంల కలుపురి నీ బాంచనుగులాపోల్లమై పుడ్త" అని నేలమీదపడి మొక్కాడు.
"ఎట్ల చేస్తన్రా?"
"బస్తీలొకడు కండ్లబడిండుండి. తురకోల్లను తెలుగోల్లను చేసేటోల్లున్నరట. నీ బాంచను అని కాల్పట్టుకొని ఈడికి తోలమని చెప్పిన గులాపోన్ని. తోల్తనన్నడు గాని దొరోరు చెప్పుకుంటే తోల్తాడుండి? చీటిరాసి పంపురి కాల్మొక్త."
"ఆర్యసమాజ పోరున్నరు కాని, వీళ్ళు తురకల్ను చేస్తమంటే వాళ్ళు బాపన్లను చేస్తమంటరు. చూస్తాలే."
"ఎట్లనన్న చెయ్యిరి నీ బాంచను. కొట్టెటోరు మీరే. పెట్టెటోరు మీరే" అని తల నేలకానించి దండంపెట్టి వెళ్ళిపోయాడు.
రెడ్డిగారు పొలానికి వెళ్ళారు.
8
సారంగపాణి హైద్రాబాదు స్టేషనులో దిగాడు. ఏదో తురకదేశానికి వచ్చినట్టనిపించిందతనికి. ఎటు చూచినా తెలుగు అక్షరం కనిపించలేదు. పోర్టర్ సైతం ఉర్దూలో మాట్లాడుతున్నాడు. అంతా షేర్వానీలు, రూమీ టోపీలే ధరించి ఉన్నందున తురకలెవరు? కానివారెవరు? గుర్తించడం కష్టంగా ఉంది. కూలివానిచేత పెట్టె, బెడ్డింగు మోయించుకొని బైటికివచ్చేవరకల్లా టాంగావాళ్ళు ఎగబడ్డారు. ఒకడు సామాను లాక్కుపోయి టాంగాలో పెట్టుకున్నాడు. లైసెన్సుకూలీ చేతిలో బేడపెడ్తే అది పారేసినంతపని చేసి "ఆఢాయానేదో" అన్నాడు. పాణికి అదేమీ అర్ధం కాలేదు. అతడు ఏక్, దో, తీన్ విన్నాడు కాని ఈ కొత్తపధం వినలేదు. మరొక అణా ఇచ్చి చూతాం అని కూలివాని చేతిలో మరొక అణా వేశాడు. అనుకున్నదానికంటే అర్ధణా ఎక్కువ ముట్టడంతో వాడు సలాం చేసి వెళ్ళిపోయాడు. టాంగాను వెతుక్కొని ఎక్కాడు పాణి. బండి సాగింది. విశాలమైన రోడ్డు, ఉన్నతమైన సౌధాలు, అందంగా ఉంది నగరం. అరబ్బులు, పఠాన్లు విరివిగా తిరుగుతున్నారు కత్తులు, కఠార్లు ధరించి. అరబ్బులు పొట్టిగా ఉంటారు. చారల లుంగీలు ధరించిన పఠాన్ లు చాలా పొడవైనవారు. పైజమా, మోకాళ్ళవరకొచ్చే కమీజూ, పెద్ద తలపాగా ధరించి ఉంటారు. నల్లనిముసుగు వేసుకొని దయ్యాలవలె ఉన్నవారు-ఆడవారు-రోడ్లవెంట తిరుగుతున్నారు. అయితే ఎక్కడ చూచినా తెలుగు అక్షరం కనిపించలేదు పాణికి. తెలుగుదేశానికి తలమానికంలాంటి మహానగరంలో తెలుగువాడుగానీ, తెలుగుదనంగానీ, తెలుగు అక్షరంగానీ కనిపించలేదంటే బాధపడ్డాడు పాణి. తెలుగు తల్లిని సగానికి చీల్చి, బొట్టూ, తాళీ తీసివేసి, ముసుగువేసి, ఉర్దూ మాట్లాడమని హింసిస్తున్నట్లనిపించింది పాణికి. ఈ దవుర్జన్యాన్నీ, ఈ క్రౌర్యాన్నీ తెలంగాణలోని కోటి తెలుగువాళ్ళు ఎలా సహిస్తున్నారా అనిపించిందతనికి. కొండా వెంకటప్పయ్య పంతులు, ఆంధ్ర మహాసభ గుర్తుకు వచ్చాయి. వెంటనే అతడు విన్న తెలంగాణా ఆంధ్రోద్యమ పితామహుడు మాడపాటి హనుమంతరావుగారి పేరు గుర్తుకు వచ్చింది.
టాంగావానికి తెలుగు వచ్చేమో తెల్సుకుందామని "నీ పేరేమి?" అని అడిగాడు పాణి.
"పెంటయ్య."
"తెలుగొచ్చా"
"తోడెం తోడెం (కొద్దికొద్దిగా) వస్తది"
"ఇక్కడెవరూ తెలుగు మాట్లాడరేం?"
"సర్కార్ ముసల్మాన్లది కాదుండి. తెల్గంల బాత్ చీత్ (మాట్లాడితే) చేస్తే గైర్ (పరాయి) మనిషనుకుంటరు."
"తురంకేస లుంటేనే తోడెం ఇజ్జతుంటది (గౌరవం) కాకుంటే కొట్టి చంపుతరు తురకోండ్లు. తురకోండ్లల్ల ఇత్తెహాద్ (అయికమత్యం) శానుంటది. పొట్టేగాండ్లుబీ వచ్చి ఝాగ్డా (తగాదా) పెట్టుకుంటరు. ఒకదఫా (ఒకసారి) ఒక వాఖ్ఖయా (సంగతి) గుజరాయించింది (జరిగింది రాయించింది) అయ్యోరోడ్ల పొట్టెగాడు (పిల్లవాడు) బొట్టుగిన పెట్టుకొని పైదల్ (కాలినడక) పోతునాడు సీతరామ్ బాగ్ కెల్లి. నేను సవారి దింపి వస్తున్న. మదర్సనుంచి వస్తున్న తుర్కపోరలు ఇట్కె పెడ్డల్తో కొట్టిన్రు అయ్యోరోండ్ల పోరన్ని. పోరన్కి జఖమ్ (గాయం) అయింది. ఖాన్ (నెత్తురు) బహాయించింది (కారింది). గిలగిల తన్నుకొని జమీన్ (నేల) మీద పడిపోయిండు. టాంగా అట్లనే నిలబెట్టినా, తుర్కపోరండ్ల పిఛా (వెంబడించా)చేసిన. పోరలుర్కబట్టిన్రు గని సడక్ న (రోడ్డున) పోతున్న తుర్కోడు చూసిండు. "క్యోం మార్తాహై పొట్టాంకో" అన్నాడు. "ఖామాఖా (ఉట్టిగనే) మారేసాబు (కొట్టారండీ) పొట్టెకో నాలుగు లగాయించిన (తగిలించాను) అస్పాస్లున్న (చుట్టుప్రక్కలున్న) తురకోండ్లంత కూడిన్రు, జబిరిన్రు నన్ను. జఖమైంది నెత్తిన. దవఖాన్ల పడ్డా ఒక్క తెనుగోడు రాలేదు. ఇన్నవా?" అని తలగుడ్డ తీసి కుట్లుపడిన గుర్తులు చూపించాడు.