ఆ రాత్రి రెడ్డిగారు వస్తారనుకోలేదు పాణి. క్రితం రాత్రి అంత కటువుగా మాట్లాడి వస్తాడా అనుకున్నాడు. తన మేలు కోరుకునేవాడెవడూ ధనమదాంధులకు నీతులు చెప్పరాదు. వంత పాడాలి అనుకున్నాడు. ధనం, అధికారం ఉన్నవాడు తాను తలచేదీ, చెప్పేదీ, చేసేదీ సరియైనదనుకుంటాడు. అది సరికాదని చెప్పేవాడు పిచ్చివాడనుకోవడమో, చేస్తాడు. రావణుడు విన్నాడా? భీష్మాదులు యుద్ధం ప్రమాదకరమని ఎన్ని నీతులు చెప్పారు దుర్యోధనునికి! విన్నాడా? వినకపోగా అందర్నీ తన శత్రువుల్ను చేసుకున్నాడు. అధికారం కంటికి ఒక పొర కప్పేస్తుంది. అది వాస్తవాన్ని చూడనివ్వదు. తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళంటుంది. అబ్బ - మూడుకాళ్ళతో ఎంత బాగా గెంతుతూందండి కుందేలు అనాలి. కాని, కుందేలుకు మూడుకాళ్ళుంటాయా! అంటే చచ్చాడన్నమాటే. వెనక ఒక ప్రభువు 'గోడ ఊగుతూంది చూశారా?' అన్నాట్ట. ప్రక్కనున్న వారంతా 'మహాప్రభూ! గోడ ఉయ్యాల్లా ఊగుతూంది' అన్నారట. దారినే వెళ్ళే ఒక ప్రయాణీకుడు 'మహాప్రభూ వీరంతా మిమ్మల్ని పిచ్చివారిని చేస్తున్నారు. గోడ ఊగడం లేదు, ఊగదు' అన్నాట్ట. ప్రభువు దగ్గరే ఉన్న ఒక భటున్ని పిలిచి అతని తలనరికెయ్యమన్నాట్ట! అది ప్రభువుల చిత్తం! నేను రెడ్డిగారికి వ్యతిరేకంగా మాట్లాడాను. వెళ్ళి మీరు చెప్పిందే సరైందండీ అని అంటే .... ...ఎలా వుంటుంది? కాని ఆ మాటంటే ఏం తిప్పలో! ఇప్పటికీ అయినా గ్రహించాడేమో వాస్తవం? నేనా మాట చెబితే మళ్ళీ తలక్రిందులవుతుంది! అనుకుంటూ ఉండగానే రెడ్డిగారు "పంతులూ- కరణం ఇంటికిపోయినవా?" అని అడుగుతూ ప్రవేశించారు. రాత్రి ఉదంతం మరచిపోయారు రెడ్డిగారు. మళ్ళీ దాన్ని ప్రస్తావించడం బాగుండదని, 'వెళ్ళానండీ, పాఠం కూడా ప్రారంభించాను' అన్నాడు పాణి.
"నారయ్య గారితో సుత కరణమే చెప్పతనన్నడు?"
"ఆ పాఠం కూడా కుదిరిందండీ! సీతకూ పాఠం ప్రారంభించాను"
'కారణం విషపు మనిషి, జర్ర హుషార్ గుండాలె!'
కరణం సుమారు ఇలాంటి మాటే అన్నాడు. వీరిద్దరి నడుమ ద్వేషం ఉందని గ్రహించాడు పాణి. ఇద్దరికీ మన్ననగా ఉండడం కత్తిమీద సాములాంటి దనుకున్నాడు. ఇది అధికార ద్వేషం. ఒకరిని మించాలని ఒకరు పందాలు వేసుకోవడం. అమాయక ప్రజలు వేలమంది ఒకటి అవుతే కావచ్చు కాని అధికార దాహం గలవారు కలవడం అసాధ్యం అనుకున్నాడు.
'నాకు ఆయనతో వ్యవహారం అసాధ్యం అనుకున్నాడు.
"అహ జర్ర ఎహత్యాత్ (జాగ్రత్తగా) గుండాల్నని చెపుతున్న!"
"చిత్తం అలాగేనండీ!"
"కుంటిదాన్ని నా బిడ్డ రంభ అంటుంటడు కరణం, నిజమేన?"
"పెద్ద అందకత్తేంకాదు కానీండి, ముక్కూ, ముఖమూ బాగానే ఉంటాయి."
"కరణం అట్లెందు కంటడు?"
"ఎవరి కూతురు వారి కలాగే కనిపిస్తుందండి."
తన మంజరి కూడ అంతేనా అనుకున్నాడు రెడ్డిగారు.
"ఆవిడ కరణంగారి కూతురేనాండి?" అడిగాడు పాణి.
"నీకూ షుబా (అనుమానం) అయినాది. ఆవలిస్తే పేగులెంచె టట్లున్నవు! అదంత పెద్ద కతలే. సరేగాని,
"సావిరహే తవదీనా..." పాడాడు పాణి.
"పాట శాన బాగున్నది పంతులూ! నిద్రొస్తుంది" అని లేచారు ఆవులిస్తూ, వళ్ళు విరుచుకుంటూను. వెళ్ళిపోతుంటే గుమ్మంపక్కన పళ్ళెం పట్టుకొని నుంచున్న పట్టుకొని నుంచున్న వనజ కనిపించింది.
"ఎప్పటినుండి నిలబడ్డవ్?" ఉరిమారు రెడ్డిగారు.
"ఇప్పుడే వచ్చిన!" నసిగింది వనజ.
"అన్నం ఆడ పెట్టిపోక ఎందుకు నిలబడ్డవ్?"
"మీ.....మీ.... మీరున్నరని."
"హు...." అని వెళ్ళిపోయారు రెడ్డిగారు.
వాస్తవానికి వనజ వచ్చి చాలా సేపైంది. పాట వింటూ అలా నిల్చిపోయింది. పాటలోని పదాలు తనకేమీ అర్ధంకాలేదు. కానీ, అతని పాట ఆమెను ముగ్దురాల్ను చేసింది. పాట ముగిసిం తరవాత అన్నం అక్కడ పెట్టి వెళ్ళిపోదామనుకుంది. కాని, దొర ఉండగా వెళ్తే పంతులు తనను మాట్లాడించడు అనుకొని అక్కడే నుంచుండిపోయింది.
గుమ్మం దగ్గరికి వచ్చి రెడ్డిగారిని సాగనంపిన సారంగపాణి సర్వం గ్రహించాడు. రెడ్డిగారు మెట్లు దిగిపోయారని ధ్రువపర్చుకొని "రా.... వనజా!" అన్నాడు. ఆమె గుండెలో వెన్నెల కాసింది
పళ్ళెం కావిడి పెట్టెమీద పెట్టి నుంచుంది వనజ.
"కూర్చో వనజా!" అన్నాడు ముందున్న కుర్చీ చూపుతూ.
ఇంద్రుని అర్దాసనం లభించినట్లు పొంగిపోయింది. అయినా కూర్చోలేదు. తనను వారితో సమంగా కూర్చోపెట్టుకొని మాట్లాడిన వారున్నారా? అబ్బ! పాణి ఎంత మంచివాడు! తన పేరు బావుందని తాను అందంగా ఉందనీ చెప్పినవాడేకాక తాను ఇంతకాలం నుంచీ పశువులా జీవిస్తున్నానని తనను గ్రహించేట్లు చేసినవాడు అతనే. అతడు తనకు దేవుడు. అతని సరసనా కూర్చోవడం?
"ఉహు" అన్నది.
"వనజా! తాయారు తెల్సా నీకు?"
"ఎవరూ?" అన్నట్లు కళ్ళెత్తి చూసింది.
"కరణంగారి కూతురు."
ఆ మాట వినగానే గుండెలో ఒక పెద్దరాయి పడినట్లూ, ఎదుట దయ్యం నుంచున్నట్లూ వణికిపోయింది వనజ.
"ఎందుకు అలా అయినావు?"
ఎందుకో ఆమెకూ తెలీదు.
"ఊరికేనే" అన్నది సంభాళించుకొని. "కుంటిదా?" అని అడిగింది. అసహనం కనిపించింది త్వరలో.
"అవును. ఎలాంటిది?"
"బాగా చూడలే. ఊళ్ళోరు పోరి మంచిదికాదంటరు. కరణప్పంతులు శాన సంబంధాలు తెచ్చిండు. లగ్గానికి ఎవ్వరూ చేసుకోనన్నరుట. కుంటిది గయ్యాళి దంటరు. నీకెందుకు?"
"పాఠం చెపుతున్నా నాఅమ్మాయికి."
వనజ ఒళ్ళు జల్లుమన్నదనే విషయం గ్రహించాడు పాణి.
"చెప్పకుంటేమైతది?"
"ఎలా మరి? వచ్చింది పాఠాలు చెప్పుకొనేందుకేగా?"
వనజకూ, తాయారుకూ స్పర్ధలున్నాయా అనుకున్నాడు.
"అసలు తాయారు కరణం కూతురేనా?"
"ఊహు.... కాదు." ఉత్సాహంగా జవాబు చెప్పింది వనజ. ఈలోగా ఎంకటి పిలుపు విని పరుగెత్తింది.
సారంగపాణికి అంతా విచిత్రంగా అనిపించింది. ఎవరూ గుండెవిప్పి మాట్లాడరు. రెడ్డిగారు ఒక్కసారి రాక్షసుడిగా మారిపోతాడు. కరణం విచిత్రమైన మనిషి ప్రతి మాటలోనూ ఏదో అంతర్ధానం ఉందన్నట్లు మాట్లాడ్డానిక ప్రయత్నిస్తాడు. వనజ ఏదో కొత్త గుండెవచ్చి రొమ్ములో చేరినట్లు మాట్లాడుతుంది. వనజకు తాయారంటే ద్వేషం ఎందుకో అర్ధం కాలేదు. సీతను తల్చుకుంటే ఈ అశోకవనంలో ఆమె ఒకతే సీతలా కనిపించింది. ఎంత సిగ్గు! ఎంత అణకువ! ఎంత శ్రద్ద! ఎంత తెలివి! కోటలో తనింతవరకు చూడని ఇంకో రెండు ప్రాణులు తెరచాటున ఉన్నాయి. వాటిల్లో ఎంత విషం ఉందో? ఎంత అగ్గివుందో! అనుకున్నాడు.
6
ఒకనాటి రాత్రి రెడ్డిగారు పాట వినడానికి వస్తే తాయారుకు వయొలిన్ తేవడానిగ్గాను తాను పట్నం వెళ్ళనున్నానని చెప్పాడు పాణి. కరణం తన వాడకానికి ఒక వంద రూపాయలిచ్చాడని కూడా చెప్పాడు.
"కరణం నూర్రూపాయిలిచ్చిండులే?" దాని వెనుక ఏదో నాటకం తప్పక ఉండి ఉంటుందన్నట్లుగా మాట్లాడారు రెడ్డిగారు.
"అవునండీ! ముందు వారే వెళ్ళివస్తామన్నారు. తర్వాత 'వాద్యాల మంచి చెడ్డలు నాకేం తెలుస్తాయి? నువ్వే కొనుక్కురా' అని డబ్బిస్తూ బట్టలూ, తల మసాలా, పోకచెక్కలూ మరేవేవో వ్రాసిచ్చి 'పంతులూ! పట్నం వెళ్తున్నావు. నీకూ ఏదేనా కొనుక్కోవాలని ఉంటుంది. ఇదిగో ఈ నూరు రూపాయలు నీ ఖర్చుకు' అని వేరుగా ఇచ్చారండీ. రేపు ఉదయం వెళ్దామనుకుంటున్నా!"
పాణి మాటలు వింటూనే రెడ్డిగారు ఆలోచన్లో పడిపోయారు. పంతుల్ను తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా కరణం? అతని ద్వారా తన రహస్యాలు బైటికిలాగాలని చూస్తున్నాడా? కాకుంటే నూరురూపాయిలిస్తాడా ఒక్కసారే. అదీ కరణం!
"పంతులూ! ఎట్లనన్న పట్నం పోతున్నవు కదు. ఇంకో ఫిడేలు తీస్కరా."
"ఎందుకొరకో తెలుస్తే ఎట్లాంటిది తేవాల్నో తెలుస్తుంది కదండీ!"
"అట్లనా? చిందరసాని సంగీతం నేర్చుకుంటనంటున్నది. నేనింక తస్ఫీయ (తీర్మానం) చెయ్యలే కానియ్యి, వాయిద్యం ఉంటే తప్పా యింట్ల?"
"చిందొరసానికి సంగీతం చెప్పించ దలుచుకుంటే వయొలిన్ వద్దండీ! ఫిడేలు కాస్త తక్కువరకం వాద్యం. గంభీరత ఉండదు. పూర్వం రాణులు వీణ నేర్చుకునేవారండీ! వీణ ముందు కూర్చున్నా గౌరవంగానూ, హుందాగానూ ఉంటుందండీ! అందమైన ఆడవారు వీణ ముందు కూర్చుంటే సరస్వతిలా ఉంటారండీ! సరస్వతికి వీణాపాణి అని పేరు కదండీ, తెమ్మంటే చక్కని వీణ తెస్తా. కాదంటే....