బ్రౌనీ చర్యలు వింతగా వున్నాయి.
అదేపనిగా తోకాడిస్తూ సుదేష్ణాదేవి వేపు చూస్తోంది బ్రౌనీ.
"బ్రౌనీ కమ్ హియర్" పిలిచింది సుదేష్ణాదేవి బ్రౌనీ రాలేదు. పిలవగానే వచ్చి, కాళ్ళకు చుట్టుకునే బ్రౌనీ రాకపోతే__
లేచి బ్రౌనీని పట్టుకోబోతూ ఒక్క క్షణం అద్దంలోకి చూసిన సుదేష్ణాదేవికి కన్పించిన వింత దృశ్యానికి నోటమాట రాకుండా నిశ్చేష్టురాలైపోయింది.
వెంటనే ఆమె చూపులు బీరువావేపు మళ్ళాయి. బీరువా డోరు దగ్గరగా తెరచి ఉంది, ఆ డోరుని ఎవరో తెరవడానికి ప్రయత్నించినట్టుగా అస్పష్టంగా వినిపిస్తున్న చప్పుడు. ఒక్క అంగలో ముందుకు దూకి దొరు తెరిచింది.
లోన__
కింద అరలో, పట్టుచీరలమీద మర్రాకుమీద పడుకున్న బాలకృష్ణడిలా తేజ!
"తేజా!"
అది పిలుపుకాదు, అరుపుకాదు-దాదాపు నలభై నిమిషాలపాటు, ఆ కన్నతల్లి అనుభవించిన మానసిక బాధకు ఆకృతి.
రెండు చేతులతో తేజను గుండెలకట్టుకుంది. జుట్టును నిమురుతూ, ఒళ్లంతా ముద్దులు పెట్టేస్తోంది.
"ఒరే కన్నా! ఎలా బీరువాలో కెళ్ళావురా? ఈ అమాయకపు తల్లిని పరీక్షించడానికి దాగున్నావా? ఎంత భయపెట్టేశావురా? నన్నెప్పుడూ ఇలా పరీక్షించకేం" తనలో తను మాట్లాడేసుకుంటోంది.
ఒక ఉద్వేగం, ఒక ఉల్లాసం, తన్మయం కలగలిసిన, ఇంద్ర ధనసు వెన్నెల మాతృత్వపు మనోహర అనుభూతి దృశ్యం.
భరించలేని ఆనందం, కళ్ళల్లో కన్నీటి బిందువులుగా మారగా, ఆ బిందువులు ఆ చిన్నారి నుదుటమీద దీవనల అక్షింతల్లా పడ్డాయి.
నోరంతా తెరచుకుని బోసినవ్వులు నవ్వుతూ తేజ, తల్లి కంఠాన్ని తన చేతుల్తో చుట్టేయగా-
"ఆయా- బాబు ఇక్కడే వున్నాడు. దొరికాడు" అంటూ కొడుకుతో సహా లోన్నించిబయటకు వచ్చింది సుదేష్ణాదేవి.
ఆ మాటకు కిందవున్న జనం, ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంటూ- బిల బిలమంటూ మేడమెట్లవేపు పరుగెత్తారు.
ఇవ్వేమీ అర్ధంకాని బ్రౌనీ తోకాడిస్తూ, అందరివేపూ విచిత్రంగా చూడసాగింది.
౦ ౦ ౦
విశాలమయిన భవనంవేపు చూసి, నలువేపులా జనమెవరూ తిరగడంలేదని నిర్ధారణ చేసుకుని గాల్లోకి రివ్వుమని ఎగిరాడు.
మనిషంతా నల్లగా బ్యాట్ మాన్ లా ఉన్నాడు. అతని కళ్ళు హండ్రెడ్ వాల్ద్సు బల్బుల్లా ఎర్రని కాంతితో వెలుగుతున్నాయి.
చేతిలో పొడవాటి కట్టి తళతళమని మెరుస్తోంది.
పక్షిలా గాల్లోనే భవనంచుట్టూ తిరిగి, కిటికీలోంచి ఆ బెడ్ రూమ్ లో కొచ్చి, గిర్రుమని తిరుగుతున్న ప్యాన్ రెక్కలమీద వాలాడు.
అతని చూపులు కసిగా, కింద యూఫోమ్ బెడ్ మీద పడుకున్న వ్యక్తిని చూస్తున్నాయి.
పటపటమని రెక్కల్లాంటి చప్పుడికి, బెడ్ మీద పడుకున్న వ్యక్తికి అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది.
ఫ్యాన్ కి వేలాడుతున్న వికృతాకారం వేపుచూసి కెవ్వున కేకవేస్తూ, దిగ్గున లేవబోయాడు- కానీ లేవలేకపోయాడు.
"సేవ్_మీ_సేవ్_మీ_ రక్షించండి, రక్షించండి" భయంతో అరుస్తున్నాడతను.
సరిగ్గా అదే సమయంలో-
బ్యాట్ మాన్ లాంటి వ్యక్తి చేతిలోని కత్తి, పై నుంచి సర్రుమని వచ్చి, కింద అతని గుండెల్లో దిగబడింది.
నెత్తురు ఫౌంటెన్లో విరజిమ్మిన నీళ్ళలా పైకి విరజిమ్మింది.
"సేవ్-మీ-సేవ్-మీ- రక్షించండి, రక్షించండి" బెడ్ మీద దొర్లుతూ అరుస్తున్నాడతను.
రివ్వుమని ఫ్యాన్ రెక్కలమీంచి, కిటికీమీదవాలి, వికృతంగానవ్వి, భీకరంగా చప్పుడు చేస్తూ వెళ్ళిపోయాడా వ్యక్తి.
అప్పుడు చూశాడు ఆ వ్యక్తి ముఖాన్ని...ఆ ముఖాన్ని గుర్తుపట్టిన అతని పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ మనిషి ముఖం తేజ ముఖం!
౦ ౦ ౦
బెడ్ మీద దొర్లుకుంటూ అరుస్తున్నాడతను. అతనిపేరు సత్యనారాయణ, కానీ అందరూ సత్తిపండు అంటూంటారు.
ఆ అరుపులకి, పక్కగదిలోంచి భీమ్ భాయ్ వచ్చి___
"హేయ్ గురూ! మిట్టమధ్యాహ్నం..ఏంటీ పులకరింతలు?" అంటూ గట్టిగా అతని వీపుమీద ఒక్కటిచ్చాడు.
సత్తిపండు కళ్ళిప్పాడు.
"ఆ తేజగాడు భూతంలా అంతయిపోయి, నన్ను చంపేసాడు. కత్తితో పొడిచి చంపేసాడు. నేను చచ్చిపోయాను. పూర్తిగా..." సత్తిపండు ముఖంనిండా చెమటలు పట్టేసాయి.
"నువ్వు చావలేదు- నిన్నెవడూ చంపలేదు - ఇది నిజం కావలిస్తే నిను గిల్లుకుని టెస్ట్ చేసుకో" లూజు లూజు నిక్కరు, లూజు, లూజు షర్టు, గుండు, చిన్నసైజు రౌడీలా ఫోజు పెడుతూ అన్నాడు వాడు.
"నన్ను గిల్లుకోవడం ఏంట్రా బడుద్దాయ్! నిన్ను గిల్లుతా" అని భీమ్ బాయ్ చేతిమీద గట్టిగా గిల్లాడు. భీమ్ బాయ్ భీకరంగా అరిచాడు.
"ఒరేయ్ అంతగా అరుస్తావేంట్రా బాడీగార్డు ఫ్రెండూ....మధ్యాహ్నం వచ్చిన పీడకలలు నిజమవుతాయంటారు" అంటూ, అటూ ఇటూ చూసి.
"ఒరేయ్! ఆ తేజగాడు నన్ను మర్డర్ చెయ్యడానికి ప్లానేసాడ్రా" అన్నాడు దిగులుగా సత్తిపండు.