సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ చీఫ్ పరిగెత్తుకుని వచ్చాడు.
"మేడమ్! మీరేమీ అనుకోకపోతే- పోలీస్ కంప్లయింట్ ఇద్దాం!"
ఒక్కసారి తల పైకెత్తి, ఎర్రబడ్డ కళ్ళతో అతనివేపు చూసింది సడన్ గా ఆమె కుడిచేయి పైకి లేచింది__ఆ సెక్యూరిటీ చీఫ్ చెంప ఛెళ్ మన్న శబ్దం, ఆ హాల్లో ప్రతిధ్వనించింది.
"ఇడియట్...ఇడియట్...వాడికేం నడకొచ్చా- పరుగెత్తి బయటకు పారిపోవడానికి...కొత్త వ్యక్తులెవరూ లోపలికి రాలేదని మీరే అంటున్నప్పుడు- బాబు బయటికెళ్ళే అవకాశమే లేదు! అవునా?"
"అవును మేడమ్! సారీ మేడమ్..."
"సెర్చ్...నా ఎదురుగుండా ఎవరూ ఉండడానికి వీల్లేదు!" ఒక పక్క ధైర్యాన్ని చిక్కబరచుకొంటూ ఆర్డర్స్ వేసినా, పచ్చి ఇసక పెళ్ళలు, పెళ్లలుగా రాలిపోతున్నట్టు -ఆమె మనసు బాధగా మూలుగుతోంది.
శూన్యం వేపు చూస్తున్న సుదేష్ణ, ఒక్కసారి ఉలిక్కిపడింది. దానిక్కారణం- ఆమె మనసులో మెదిలిన దారుణమైన ఆలోచనే!
పాక్కుంటూ బాబు, స్విమ్మింగ్ ఫూల్ వేపు వెళ్ళాడేమో- ఆ ఆలోచన రావడంతోనే ఒక్క ఉదుటున లేచి, బిల్డింగ్ లోని ఎడమ ద్వారం లోంచి బయటికొచ్చింది.
ఎదురుగా స్విమ్మింగ్ ఫూల్, లేత నీలపు చీరలా మెరుస్తూ__
ముందుకు అడుగేసింది సుదేష్ణాదేవి, కంపిస్తున్న హృదయంతో.
౦ ౦ ౦
కోర్టు రూమ్ కిక్కిరిసిపోయి లేదు.
ఇలాంటివన్నీ మామూలే అన్నట్టుగా జడ్జీగారు తాపీగా వచ్చి, అంతకన్నా హేపీగా ధర్మాసనమ్మీద కూర్చున్నారు.
బోనులో, కిక్కిరిసి పోయిన సిటీ బస్సులో నిలబడినట్టుగా నిలబడిన ఆ ముగ్గురి వేపూ చూసి-
"రైల్వే స్టేషన్ లోంచి, యాభై వేల రూపాయల్ని దొంగిలించారని మీ మీద అభియోగం! దానికి మీ సంజాయిషీ ఏమిటి?"
"సంజాయిషీ లేదు- గాడిదగుడ్డూ లేదు బాబయ్యా! మా చేతులారా మేమే యాభైవేల రూపాయల్ని దొంగిలించాం బాబయ్యా! రైల్వే ఎస్. ఐ. ని కొట్టి పారిపోయింది కూడా మేం ముగ్గురమే బాబయ్యా!"
"గుడ్!" చిరునవ్వు నవ్వారు జడ్జీగారు.
"పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించబడి బాబయ్యా!" వీర్రాజు మొరపెట్టుకున్నాడు జడ్జీగారితో.
"మరి ఎఫ్.ఐ.ఆర్. పేపర్స్ తో, సెల్ లో చాలీ కాచుకున్నది మీరేనా?"
"మేవేఁనండయ్యా! అబద్దం ఎందుకూ- ఖైదీలు చలి కాచుకోవడానికి ప్రతి స్టేషన్ లో కట్టెల్ని గవర్నమెంట్ సప్లయ్ చెయ్యాలి__అది మా డిమాండ్!"
జడ్జిగారు పి.పి. వేపు చూసి, పేపర్స్ మీద ఏదో రాయడం మొదలెట్టారు.
"ఓయ్__పీ.పీ.!" రహస్యంగా పిలిచాడు వీర్రాజు.
తనని బోనులోంచి ముద్దాయి రహస్యంగా పిలవడం చూసి, విచిత్రంగా చూస్తూ-
"ఏంటీ?' అనడిగాడాయన విస్మయంగా.
"ఒక అయిదు నెలలైనా శిక్ష వేయిచవ్యా బాబూ- చచ్చి నీ కడుపునా పుడతాం!"
"పడుద్ది- పడుద్ది! కంగారు పడకండి."
"ఏం పడుద్ది? మాకు గనక కఠిన కారాగారశిక్ష పడకపోతే__ఓయ్ పీపీ! నీకూ, ఆ ఎస్.ఐ.కీ పడుద్ది- అంతే!" స్వరం తగ్గించి హెచ్చరించాడు పోతురాజు.
"వీళ్ళెవరండీ బాబూ- కోర్టులోనే మనల్ని బెదిరిస్తున్నారు?" సి.ఐ. వేపు చూస్తూ అన్నాడు పి.పి.
జడ్జీగారు తీర్పు చెప్పడం ప్రారంభించారు.
"ముద్దాయిలు దొంగతనం చేయడం, ఎస్ ఐ.ని కొట్టడం, స్టేషన్ లో చలి కాచుకోవడం, ఈ చర్యల్ని నిరసిస్తూ, ఇలాంటి దొంగతనాలను చెయ్యొద్దని మందలిస్తూ వారంరోజులపాటు వారిని జైల్లో ఉంచమని ఆదేశిస్తున్నారు."
"మేము ఒప్పుకోము" గట్టిగా అరిచాడు సేతురాజు.
"ఈ అన్యాయం నశించాలి. చిన్న నేరానికయినా పెద్ద శిక్షను...సంవత్సరాల తరబడి శిక్షను విధించాలి. అంతే" శృతి కలిపాడు వీర్రాజు.
"మర్యాదగా పదండి-అరవకూడదు" సి.ఐ. అన్నాడు కోపంగా.
సరిగ్గా అదే సమయంలో టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని అందుకుని సి.ఐ. వేపు విసిరాడు పోతురాజు.
అది సి.ఐ నుదుటికి తగిలి కిందపడింది. నుదుటిమీద రక్తం, ఆ దృశ్యాన్ని జడ్జీగారు స్వయానా చూశారు.
"ఈ దుందుడుకుతనానికి ఇంకో రెండురోజులు ఎక్కువ శిక్షను విధిస్తున్నాను" కంగారుగా చెప్పాడాయన.
"నేనుకూడా పి.పి.ని పేపరు వెయిట్ తో కొడతాన్రా" వీర్రాజు ఉబలాట పడ్డాడు.
సరిగ్గా అదే టైముకి ముగ్గుర్నీ పోలీసులు కోర్టు హాల్లోంచి బయటకు లాక్కెళ్ళిపోయారు.
౦ ౦ ౦
డ్రాయింగ్ రూంలో నిస్త్రాణంగా కూర్చుని, అలవోకగా తలెత్తి, బెడ్ రూమ్ లోకి చూసింది సుదేష్ణాదేవి.
బెడ్ రూంలో నిలువెత్తు డ్రెస్సింగ్ టేబుల్, దానికి కొంచెం దూరములో ఓ మూలకి గాడ్రేజ్ బీరువా, ఆపక్కన ఏ.సీ. మిషన్.
డ్రెస్సింగ్ టేబుల్ ముందు తోకాడిస్తూ, అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ టేబుల్ కీ, గాడ్రేజ్ బీరువాకి మధ్యన పరుగెడుతున్న బ్రౌనీని ఆశ్చర్యంగా చూస్తోందామె!