"నిన్నెవరూ మర్డర్ చెయ్యకుండా ఉండడానికి, బాడీగార్దింగ్ కే_"కదానన్ను తీసుకొచ్చిందీ- అయామ్ హియర్- డోన్ట్ వర్రీ- మై ఫ్రెండ్ ధీమాగా అన్నాడు భీమ్ భాయ్. పేరుకి ఖీమ్ భాయే కానీ, రమణారెడ్డిలా సన్నగా, పొడవుగా ఉంటాడు భీమ్ రావ్ అనే భీమ్ భాయ్.
గబగబా బెడ్ మీంచి లేచి, నీళ్ళు తాగి, సేదదీరి,
"లాభంలేదు ఇక ఉపేక్షించకూడదు- ఉపేక్షిస్తే కంసుడ్ని కృష్ణుడు మర్డర్ చేసినట్లు, ఆ గుంటవెధవ నన్ను మర్డర్ చేసేస్తాడు- అంచేత- మనమే ముందస్తుగా-"
"ఏం ముందస్తు-ఎవడైతే నీకు విలన్ గా తయారవుతాడని అనుకొంటున్నావో, ఎవడికి కోట్లాది ఆస్తి వెళ్ళిపోతుందని, నువ్వు భయపడుతున్నావో, అదే మీ పెదనాన్న కొడుకు, నీకు అన్నయ్య అయినా కాళేశ్వరప్రసాద్ గారాలపట్టి చిరంజీవి తేజేస్వరప్రసాద్ అనే తేజ- అరగంట నుంచీ కనబడడం లేదహో -" అరుస్తూ చెప్పాడు భీమ్ భాయ్.
"నిజంగా?!"
"అవును- ఒక్కసారి రూమ్ బయటకొచ్చి చూడు-అంతా నంతలా ఉంది-"
"ఎవడైనా కిడ్నాప్ చేసాడా-?" ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు సత్తిపండు.
"నా అనుమానం అదే-"
"వెరీగుడ్ కాగల కార్యం ఎవడో గంధర్వుడు చేసాడన్నమాట. హఁ హఁ హఁ కోట్ల ఆస్తిని కొట్టేయ్యాలనే నా ఆలోచనకు వాడు అడ్డు తొలగి పోయాడన్నమాట- ఇంకా- ఆ కాళేశ్వరప్ర-" సరిగ్గా అదే సమయంలో_
ధబ్ మని రూమ్ తలుపులు తెరచుకుని, విసురుగా లోనకొచ్చింది ఓ వంద కేజీల భారీ ఆకారం.
"ఇలా మీరిక్కడ- ప్లాన్స్ వేస్తూ ఉంటూనే ఉండండి- మీ అంత శుద్ద వాజమ్మల్ని నేనెక్కడా చూడలేదు-" అందావిడ గొంతు తగ్గించి.
ఆ భారీకాయం పేరు కోమలాంగి. సత్తుపండు భార్యామణి.
"ఏవైందే- మన కలలు నిజమయ్యే రోజులు దగ్గరపడుతున్నందుకు సంతోషించక-"
"సంతోషించనట్టే ఉంది- ఆ తేజగాడ్ని ఎవరో కిడ్నాప్ చేసేసారని, పీడా విరగడయిందని ఆనందించానా- బెడ్ రూమ్ లోనే ఉన్నాట్ట- వాడు దొరకడంతో, ఆ సుదేష్ణాదేవికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది." రుసరుసలాడుతూ పైటతో విసురుకుంటూ అంది కోమలాంగి.
భారంగా నిట్టూర్చి, సీరియస్ గా ముఖం పెట్టాడు సత్తిపండు.
"అన్నయ్య ఊళ్ళోలేని టైములో వీడు కిడ్నాప్ అయ్యాడని ఎంత ఆనందించానో- స్టోరీ అడ్డం తిరిగిందన్నమాట" త్రిబుల్ పైవ్ సిగరెట్ తీసి, షోగ్గా రజనీకాంత్ లా వెలిగిస్తూ అన్నాడు సత్తిపండు.
"ఇలా ప్లానువేసుకుని కలలు కంటుంటే, అన్ని స్టోరీలూ అడ్డమే తిరుగుతుంటాయి" చిరాగ్గా అంది కోమలాంగి.
"ఈ చాణక్యుని వారసుడ్ని తప్పుగా అంచనా వెయ్యకు- ఫర్ ఫెక్ట్ కిడ్నాపింగ్ కి, ఆ తర్వాత మర్డర్ కి నేనెప్పుడో సిస్టమెటిక్ గా ప్లాన్ వేసాను- మనం, ఇలాగే- ఇక్కడే ఉంటాం- పనులన్నీ చకచకా జరిగి పోతాయి. మాయమైపోయిన కొడుకుకోసం వెతికి వెతికి, విసిగి, విసిగి వేసారి వేసారి ఆ కాళేస్వరప్రసాద్, వాళ్ళావిడ పిచ్చెత్తిపోతారు-అప్పుడు ఈ ఆస్తి - మ....న...దే-
పెద్దగా నవ్వుతూ చెప్పాడు సత్తిపండు. అప్పుడు విప్పారిన ముఖంతో అడిగింది కోమలాంగి.
"ఏంటా ప్లాన్- నాతో చెప్పండి-"
అటూ ఇటూ చూసి చెప్పడం ప్రారంభించాడు సత్తిపండు.
ప్లానంతా విన్నాక భీమ్ భాయ్ గుండెలు ఠారెత్తిపోయాయ్.
"అ...య్య...బా...బొ...య్_" అన్నాడతను.
"నోర్ముయ్ చంపేస్తాను- ఈ పాయింట్ ఎక్కడైనా లీకయిందో ముందు నిన్ను మర్డర్ చేస్తా- జాగ్రత్త-"
సరిగ్గా అదే సమయంలో లోనికి ఇద్దరు పిల్లలొచ్చారు. అబ్బాయికి ఏడేళ్ళు అమ్మాయికి అయిదేళ్ళు.
"డాడీ_ డాడీ- అన్నయ్య నాతో కిడ్నాపింగ్ ఆట ఆడతాట్ట_ రమ్మంటున్నాడు-" గోముగా అంది ఆడపిల్ల డాలీ.
"మీకి ఆటలు ఎవడు నేర్పాడ్రా బాబోయ్_" తల బాదుకున్నాడు సత్తిపండు.
౦ ౦ ౦
హైదరాబాద్ ఎయిర్ పోర్టు- బొంబాయి నుంచి వచ్చిన ఎయిర్ బస్ లాండయి పది నిమిషాలైంది.
మరో మూడు నిమిషాల తర్వాత బ్రీఫ్ కేస్ తో లాంజ్ లోకొచ్చాడు కాలేస్వరప్రసాద్. నలభై తొమ్మిదేళ్ళ కాళేశ్వరప్రసాదు కంచువిగ్రహంలా ఠీవిగా ఉంటాడు.
అప్పటివరకూ ఆయన కోసమే ఎదురుచూస్తున్న పి.ఎ. రమాకాంత్ ఎదురుగా వెళ్ళి విష్ చేస్తూ బ్రీఫ్ కేసు అందుకున్నాడు.
"గుడ్ ఈవెనింగ్ రమాకాంత్- ఈజ్ దేర్ ఎనీ ఇంపార్టెంట్ న్యూస్-" చేతిగడియారంవేపు చూసుకుంటూ అడిగాడు కాళేస్వరప్రసాద్.
"నో సర్- ఎవ్వెరిథింగ్ ఓకే-" చకచకమని అడుగులేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న కాలేస్వరప్రసాద్ వెనక, పరిగెడుతున్నాడు పి.ఎ.
బయట లాన్ పక్కన-
సరికొత్త బి.ఎమ్ డబ్ల్యూ కారు మిలమిలా మెరుస్తోంది. ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన ఆ కారును తేజ పుట్టిన సందర్భంలో కొన్నాడాయన.
నేవీ బ్లూ యూనిఫారమ్ లో ఉన్న డ్రైవర్, బ్యాక్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోగా ఠీవిగా లోనికి అడుగేసాడు.
మార్నింగ్ భార్యకు ఫోన్ చేసినపుడు, తేజను ఎయిర్ పోర్టుకి తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయినందుకు, మూడురోజులై కొడుకును చూడనందుకు మనసులో ఏదో వెలితిగా ఉందతనికి.
బొంబాయిలో 'ఇంటర్నేషనల్ కిడ్స్' షాపులో కొడుకు కోసం లక్షరూపాయలు పెట్టికొన్న బొమ్మలు గుర్తుకొచ్చాయి. బొమ్మలు నలభై ఎనిమిది గంటల్లో కార్లో ఫ్లయిట్ లో హైదరాబాద్ కొచ్చి, డైరెక్ట్ గా హోమ్ డెలివరీ చేయబడతాయి. ఫోన్ లో సుదేష్ణాదేవి, కొడుకు నోటి వెంబడి "అమ్-మ్-" అని మాటలు వచ్చాయని చెప్పగానే-