కళ్ళు తిరుగుతున్నాయి వేగానికి. అలవాటు లేనితనానికి భయం కూడా వేస్తుంది. అబ్బో! అంత ఎత్తునుంచి జారిపడితే కళ్ళు తిరిగి పడిపోతే_
రాట్నం ఆగింది. బితుకుబితుకుమని చూస్తూ దిగిపోయింది, ఉత్సాహం ఆగక వేణు అలాగే కూర్చున్నాడు.
"దిగువేణూ! తల త్రిప్పటంలేదూ? మళ్ళీ నడవలేవు కష్టం_"
నవ్వుతూ హీరోలా ఫోజుపెట్టి అన్నాడు. "నేను అమ్మాయినా కళ్ళు తిరగటానికి-భయపడటానికి, వళ్ళు తిరగటానికి, వాంతి చేసుకోటానికి, ఏం భయపడొద్దు_ఇంకొకటో, రెండో రౌండ్సు తిరిగివస్తాను_"
బిక్క మొహం వేసుకుని అలాగేచూస్తూ నిలుచుంది. తిరుణాలకి చేరే జనంలో ఎక్కువ సమాఖ్య అమాయకులదే. సరదారాయిళ్ళు అంతా పైకీ క్రిందికీ చిత్రవిచిత్రం తిరిగే రాటాన్ని చూస్తే బహుముచ్చటేస్తుంది వాళ్ళకి. ఒకరినొకరు తోసుకుంటూ మేమంటే మేమని నెట్టుకుంటూ ఎగబడతారు.
ఆ గుంపు ఒకటి విరజను అక్కడినుండి దూరం వెళ్ళేలా చేసింది. అలాగే అలాగే ఎంతోదూరం వెళ్ళిపోయింది. వేణు విరజ విడిపోయారు.
రంగులరాట్నం ఎక్కి తిరుగుతున్నాడు వేణు. ఉత్సాహంతో ఉద్రేకంతో పైకీ క్రిందకీ బండి చక్రాల్లోని ఆకుల్లాకాక చక్రంలోని సంవత్సరంలా తిరుగుతున్నాడు. అక్కడా అనకుండా ప్రతిచోటునీ నిశితంగా పరిశీలిస్తూ రంగుల రాట్నానికై వేణుకై వెతుకుతూ తిరుగుతోంది విరజ.
అనుభవానికి హద్దుంది. ఎక్కడో ఓచోట__అలసి ఆనందాన్ని కావలసినంత అనుభవరుచి రంగులరాట్నం దిగ చుట్టూరా చూశాడు విరజ కోసం. ఎక్కడా కనిపించలేదు. అలాంటి ముఖమేలేదు. గాబరాగా ఆమెకోసం ప్రతి వారి ముఖంలోకి తొంగిచూశాడు. అంతా క్రొత్త. ఏ ముఖంలోనూ ఆ ఛాయలేదు. ఆ కాంతి లేదు. ఏనయనాల్లోనూ ఆ తళుకులేదు_ ఆ మెరుపులేదు_ కనీసం అలాంటి ఛాయలున్న వాళ్ళయినా అగుపించలేదు.
తిరిగినచోటే తిరిగాడు. చూసిన చోటే చూశాడు! మా విరజండీ? నా అంత ఎత్తే వుంటుంది. తెల్లగా అందంగా వుంటుంది. మిలమిల మెకసే కళ్ళతో చలాకీగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ వుంటుంది. ఏమండీ? ఎక్కడా మీరు చూళ్ళేదూ?"
కొందరు వింతగా చూశారు. మరికొందరు హేళనగా నవ్వారు. కొందరు వినిపించుకోనేలేదు_విన ముసలాళ్ళు మాత్రం అయ్యో! పాపం అన్నారు. ఎవరేమన్నా అతనికి విరజ మళ్ళీ కనిపించలేదు.
ఇక నిరాశ చేసుకుని తిరుణాలలో ప్రతి స్థలాన్ని విడవకుండా చూశాడు. నిరాశే ఎదురైంది. పైన ఎండ. తలని మాడ్చేస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో ఆకలి. హృదయంలో వేదన. మనిషిని ఒకచోట నిలవనీయకుండా వున్నాయి.
దప్పిక ఎక్కువై ఒకచోట తీపిసోడా త్రాగాడు. ఏమీ రుచించలేదు. విరజలేకుండా అంతవరకూ ఏమీ అనుభవించలేదు. ఇక రుచి అనేది ఎక్కడ దొరుకుతుంది? భగవాన్.
ఎక్కడుంది విరజ? ఎక్కడ? ఎక్కడ?
విరజా?
ఎక్కడుందని వింటుంది? ఎక్కడని వినిపిస్తుంది? ఎంత గట్టిగా అరిచినా తనమాట తన చెవుల్లోనే గింగురుమని మ్రోగుతుంది. అంతేకాక విరజకూడా కనిపించటంలేదు.
తన పిలుపు ఎంతో నిష్ప్రయోజనమవుతోంది పిలిచి పిలిచి పిలుపు ఆగిపోవలసిందే కానీ పిలుపందటం అంటూ వున్నట్టులేదు.
సాయంకాలం వరకూ అలా తిరిగాడు, వెదకడంలో ఎన్నుమార్లు అవే దుకాణాల్ని అవే వింతల్ని చూశాడు. ఏ ఒక్కటీ ఇంపుగా కనిపించలేదు. వివరంలేకుంటే తనకివన్ని ఇంత దూరమౌతున్నాయా?
మెల్లి మెల్లిగా వేరేవూళ్ళకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. చెరుకు గడలు, తినుబండారాలు, క్రొత్త క్రొత్త వస్తువులు....ఎన్నో ఎవరి కిష్టమైనవి వాళ్ళు_వాళ్ళ వాళ్ళ కిష్టమైనవి తీసుకుని వెడుతున్నారు.
అక్కడే వుండదలచుకున్నవారు సత్రాలు వెతుక్కుంటున్నారు. రాత్రి తల దాచుకోటానికి__ తిండికోసం యత్నాలు సాగిస్తున్నారు కొందరు.
కాల్లీడ్చుకుంటూ గట్టిగా ఆమెకోసం అరుస్తూ ఇంటి దాటి పట్టాడు. ఒకవేళ తను కనిపించలేదని ఆమె గాతనక వెతుక్కుంటూ వూరి కెళ్ళిందేమోనని దారంట, దారంతా ప్రతి ధ్వనించేట్టు అరుస్తున్నాడు.
రెమ్మలు గాలికి కదులుతున్నాయో, అతనిపిలుపుకే జలదరిస్తున్నాయో తెలియటంలేదు. గాలిచేసే సవ్వడి కొమ్మల్లోనే సహజమో తెలీదు. ఇకపోతే వేణు నినాదాన్ని విరజాశృతిపుటాలకి అందజేయాలని మనోవేగంతో వెడుతుందేమో?
అతనలాగా పిలుస్తున్నాడు గట్టిగా.... ఇంకా గట్టిగా సత్తువంతా కూడదీసుకుని.
వి__ర__జా__
వి_ర_జా_
"విరజా!"
కుదుపుతో లేచాడు.
ఎదురుగా సావిత్రి_రేగిన కురులతో, వాడిన ముఖంతో, నలిగిన శరీరంతో, ఎంత అందంగా వుంది__అబ్బ! ఆ జారిన బొట్టు! కదిలిన కాటుక!
తన ముఖంలోకి తదేకంగా తన్మయత్వంతో చూస్తూన్న భర్తని ప్రశ్నించింది.
"ఏమిటి బావా? ఎందుకలా అరిచాడు? విరజా! విరజా! అంటూ అరిచారు ఏమిటిబావా?"
తల త్రిప్పుకున్నాడు. కిటికీలోంచి బయట తెలవారుతూ అంతకుపూర్వం జరిగే మార్పులన్నీ యధాతధంగా మెల్లి మెల్లిగా జరుగుతున్నాయి__
అన్నీ గుర్తుకువస్తున్నాయి. భయంకరమైనకల_తను లేచాడు__ఇక్కడవచ్చి పడుకున్నాడు_ మగతగా కళ్ళు మూసుకుంటే ఆనాటి విరజ, ఆమె స్మృతులు అన్నీ గుర్తుకు వచ్చాయ్ చక్కగా_ ఒక్కొక్కటే సంఘటనలు మనసులో మెదిలాయ్__ బాథకాని బాధని సృష్టించాయి.
ఎక్కడుంది విరజ? ఎక్కడుంది_వి_ర_జ_ తన విరజ?
అతని మనసు బరువెక్కిపోతోంది. సావిత్రి ప్రశ్నకు జవాబివ్వకుండా కూర్చున్నాడలాగే.
అంతలో పేరంటాళ్ళు తలుపుదగ్గరకూడి చప్పుడు చేశారు-నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయింది సావిత్రి.
5
"మురళీ"
".... .... .... ...."
"బ్రతుకంటే తీయని స్వప్నం అనుకుని భ్రమించే వారిలో మొదటివాడిని నేను. ఎప్పుడూ ఉజ్వలమైన భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ అందుకోటానికి మధురమైన సోపానాల్ని నిర్మించుకుంటూ ముందుకు సాగాలని కోరుకునేవాడిని. కానీ ఎప్పుడూ భగవంతుడు నాలాంటివారిని రంపపుకోత కెరచేస్తూనే వుంటాడు. బహుశ ఆయనకూడా అందులో అస్వతంత్రుడేమో? వెనుకటి జన్మలో చేసుకున్నంత దానికి తగినంత ఈ జన్మలో వస్తుందంటారు. అప్పుచేసుకున్నాక తీర్చటం యిచ్చాక వసూలు చేసుకోవటం సర్వసామాన్యమే-అయినా వ్యాపారాల్లో కష్ట నిష్టూరాలనేవి వుండనే వుంటాయి. ఏనాడు ఏ తప్పుచేశానోకాని యీరోజు అనుకోలేని, ఆపుకోలేని ఆవేదనకి లోనవుతున్నాను. యీ వేదనని తీర్చేవారుకాని, తీరే మార్గంకాని నాకు ఎంత వెదికినా కనిపించటంలేదు.
నిట్టూర్పుతో ఆగాడు. అతనిలో ప్రజ్వలిస్తున్న దుఃఖాన్ని చూసి భుజంపై ఓదార్పుగా చేయిడిస్తూ అన్నాడు.
"వేణూ! ఎంత దుఃఖంలోనైనా గుండెచెదరనివాడివి. నాకు తెలిసినంతవరకు ఏనాడూ విషమ పరిస్థితులు నీఛాయలకే రాలేదు. ఎప్పుడూ పరిస్థితుల్ని లొంగదీసుకుని వాటిని బానిసలుగా చేసుకుని హాయిగా జీవితం గడిపేవాడివి. వాటికి లొంగిపోవటమంటూ ఏనాడూలేదని ధైర్యంగా పలుకుతూ దైన్యులకి ధైర్యం ప్రసాదించేవాడివి. సొసైటీలో పేరున్న డాక్టరివి. నీకేం లోటు. అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ తమ తమ స్వహస్తాల్లో నిన్ను కౌగిలించుకున్నాయ్. చెప్పు వేణూ! ఎందుకిలా వేదనకు లోనవుతున్నావ్? ఎందుకింతగా నీలో నిరాశ ప్రవేశిస్తోంది? ఏం జరిగింది? చెప్పు....ఊరికే దుఃఖపడటంవల్ల అయ్యేదేముంది?"
మురళి ముఖంలోకి తదేకంగా చూసి అన్నాడు.
"దుఃఖపడితేకూడా ఏమీకాదని తెలియటం వల్లనే మరీ దుఃఖం మురళీ! విజ్ఞానంలో అజ్ఞానం ఇదేనేమో? తెలిసినా తెలియకపోయినా దుఃఖాన్ని అణుచుకోవటం అసాధ్యం మురళీ! ఆ పొంగుచల్లారే వరకూ అది అంతే యీ బాధ!__ ఇదేబాధ ఏ నెలక్రిందటో కలిగివుంటే అప్పటి స్థితి వేరుగా వుండేది. అసలు అది యీనాడు బాధగా కూడా అయ్యేదికాదు.... అంత అదృష్టం కూడానా యీ అభాగ్యుడికి? మనసు ఒకవయిపు....మనిషి ఒకవయిపు....మనసులోని పొరల్లో ఒకటి. ఒకవయిపు మరోకటి మరోవయిపు_ఎందుకని ఏమిటని అడిగితే జవాబేం చెప్పను మురళీ"