Previous Page Next Page 
విరిజల్లు పేజి 8


                                                           4

    ప్రాతఃకాలపు సూర్యుడు లేలేత వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. చెట్టా పట్టా లేసుకుని నడుచుకొంటూ వెడుతున్నారు వేణూ- విరజా.
    "విరజా_, నొప్పి తగ్గిపోయింది కదూ?"
    "ఊ"
    తర్వాత ప్రశ్నించటానికి ఏమీ లేకపోయింది, కానీ ఆమెతో అనుక్షణం మాట్లాడుతూ ఉండాలని అంతులేని ఆశ అందుకు అవకాశం మాత్రం అప్పుడప్పుడూ మాత్రం దొరుకుతుంది. చంకన వ్రేలాడుతున్న సంచిలో నుంచి ఓ పొట్లం విడదీస్తూ అన్నాడు.
    "తింటావా విరజా?"
    "వద్దు"
    "ఎందుకు?"
    అతనివేపు తీక్షణంగా చూసింది. ఆమె కళ్ళలో మెదిలిన బాధను గమనించి "తిను విరజా!" అన్నాడు.
    మవునం పొట్లంలోని వేపుడు అటుకుల్ని తినసాగింది.
    తినటం ముగించబోతూ అన్నాడు.
    "విరజా! నీ కధ చెబుతావా?"
    నోట నిండుగావున్న అటుకుల్ని తినేసి కొంచెం ఆగమన్నట్లు సైగ చేసి తర్వాత అంది.
    "ముందు దాహం వేస్తోంది. అది తీరాక తర్వాత! పద"
    దూరాన కనిపిస్తున్న ఓ గిలకబావి వద్దకు వెళ్ళి నీళ్ళు తోడుకుని త్రాగారు.
    "ఇలా దాహం దొరకని స్థలాల్లో బావుల్ని త్రవ్వించి బాటసారులకి పిపాస తీర్చుతున్న ఆ అజ్ఞాత వ్యక్తులకి ఏవేవో తెలియని పుణ్యలోకాలు లభ్యమవుతాయట కదా?"    
    "నిజం విరజా! గుస్త దానాలంటే_ గుప్తదాతనింటే_ ఇలాగేనేమో.... .... సప్త సంతానాలల్లో ఉపయోగపడేది ఇదేనేమో బహుశా"
    తృప్తిగా దప్పిక తీర్చుకుని తిరిగి దారిపట్టారు. కొద్దిదూరం నడిచాక చెప్పటం సాగించింది.
    "ఆయన పరమ ఆచారవంతుడు. నిత్యం గాయత్రి ఉపాసన సాధ్యమైనంత అత్యధికం చేసేవారట. ప్రతిరోజు ప్రార్ధనపూజ చేసుకుని కానీ బయటకు వచ్చేవారు కాదట....
    గోష్పాదమంత జుట్టు, ముఖాన గంధాక్షతలు, తెల్లగ్లాస్కో పంచె, భుజాన వల్లెవాటుగా జరీపంచె, ఇది ఆయన వేషమట.
    ఇరవయ్యోఏట మన మరదల్ని చేసుకుని హాయిగా కాపురము చేస్తూ మూడు సంవత్సరాలు నిండుగా గడవక పూర్వమే తండ్రిని, తాతని చేశారట. కుమారుడిని చూస్తూ మనుమడిని చూస్తూ ఆయన హాయిగా కాలం వెళ్ళ బుచ్చుతూ ఓ రోజు సంతోషంతో అలాగే మూసిన కన్నుని మరి తెరువ లేదట.
    తండ్రిగారు చనిపోయాక దాయాదులు ఆస్థికోసమై దావా వేశారట. అంతకుపూర్వం పట్నముఖం ఎరుగని ఈయన కోర్టుముఖాన్ని చూడవలసి వచ్చిందట.
    వ్యవహారరీత్యా అక్కడ లాయర్ గా వున్న ఓ క్రిస్టియన్ యువతితో పరిచయం అయిందట. అపూర్వమైన శోభతో ఆనాఘ్రతమైన సౌందర్యంతో అప్సరసలా వెలిగిపోతున్న ఆమెను చూశాక_ తొలిచూపులనీ_ ప్రేమనీ_ ఏమిటేమిటో అవన్నీను నాకు తెలియదూ_ నీకు తెలియదూ_ ఇదంతా మా నాన్న చెప్పిందే_ ఆయన తమతండ్రిగారిని గురించి ఎప్పుడు అక్షరం పొల్లు పోకుండా చెప్పి ఆయనపై తనకుండే గౌరవ భావాన్ని పితృదత్తంగా నాకు చేశారు. అన్నీ అయ్యాయి.
    కానీ, ఈయన పెళ్ళయినవాడు_ ఆమె అవివాహిత_ అభ్యంతరంలేదు మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి_ కానీ సాంప్రదాయ మొకటే కాక కుటుంబ గౌరవాలతో బాటు భార్య ముఖం కూడా అడ్డు వచ్చేది ముద్దులను మూటకట్టే ముసిముసి నవ్వులు లేలేత గోర్వెచ్చని ఎండల్లాచురుకుమనిపించేవి.
    ఏమీ అనలేక మనసుని చంపుకోలేక అడ్డంకుల్ని దాటలేక ఒకరినొకరు దూరంగావుంటూ మమతానురాగాలు మనసుల్ని మదిస్తుంటే అంది అందకుండా ఉండేవారట. అనుక్షణం మనసులు నీతికి, అవినీతికీ న్యాయానికీ, అన్యాయానికీ ప్రేమకి, పెళ్ళికి సంఘర్షణ జరుగుతూ వుంటే అటూ ఇటు చెప్పలేక లంచం తీసుకున్న న్యాయమూర్తిలా ఉండేవారట.
    ఈయన పనిమీద పట్నం వెళ్ళినప్పుడు, ఆమె ఏదో పిక్నిక్ అని ఇక్కడకి వచ్చినపుడు ఇద్దరూ కలుసుకునేవారు. అందులో చూచేవారికి క్లయింటు లాయరూ కలుసుకున్నట్లు తప్ప మరేమీ గోచరించేది కాదు. కానీ పరస్పరం కలుసుకున్న ఏకాంతంలో మనసుల్ని మరోమారు విప్పుకుని జారిపోబోతున్న కన్నీటిని ఆపుకుని ఒకరినొకరు విడలేకవిడిచిపోయేవారు.
    ఒక్కోసారి విధి అను- మరేదయినాసరే. మానవులని వికృత చేష్టల ద్వారా సహాయం చేస్తుంది. అది గమనించలేక మూర్కలోకం ఏదో అన్యాయం చేశాడంటుంది. భగవంతుడి పంచాయితీలో అన్యాయం అనేది వెతికినా బొత్తిగా ఆవగింజ అంతయినా దొరకదు.
    గర్భవతిఅయిన భార్య ప్రసవించలేక నానా యాతనలుపడి చివరికి అసంతానంతో సహా కనిపించని దూరతీరానికి వెళ్ళిపోయింది. స్మృతి మాత్రమే మానవుడికి మిగిలేదని చెబుతూ....
    జంటగావున్న గుండెల్లో ఓటిజారిపోయింది. మరోదాన్ని ఓటిదాన్ని చేసింది.... గుండెలో పడినగాయాన్ని మాన్పుకోలేక జీవన్మరణ సందిలో జీవించ సాగారు.
    కాలం మాత్రం ఆగదు. ఏది ఎలా అయినా_ నిర్లిప్తంగా నిర్వికారంగా, నిశ్చలంగా తన కాలచక్రాన్ని తిప్పుతూ ఉంటుంది- ఎవరికోసము ఎందుకూ ఆగదు.
    ఒకటి రెండు పచ్చని వసంతాలు గిర్రున తిరిగాయి. విధురత్వాన్ని భజస్తున్నరొకరు. విషాదాన్ని భుజిస్తున్నారొకరు, జీవితం అనేది. చొరవ చేసుకుని అందుకునే వాళ్ళకే ఆనందాన్నిస్తుంది. ఆసూత్రాన్ని నమ్ముకుని పెళ్ళి చేసుకున్నారిద్దరూ_
    సాంప్రదాయాల్ని తొలి సంతానాన్ని ఏకయిక వారసుడిని, తండ్రిగారిని వదిలేసి ఒట్టి చేతులతో ప్రియురాల్ని ఇల్లాలుగా చేసుకుని వచ్చేశారు.
    కావలసిన వారికోసం కులాన్ని, మతాన్ని, సాంప్రదాయాన్ని, సిరిసంపదల్నీ త్యజించి వచ్చేశారు. ఆమెతో కలిసిపోయారు. క్రైస్తవమతం పుచ్చుకున్నారు. ఏనాడూ వారిమధ్య కుల మత ఆచార భేదములు తల ఎత్తలేదు. అలా అయ్యాం క్రిష్టియన్ గా_
    విరజ పూర్వీకులగాధ విన్నాక అతని హృదయంలో ఏదో మెలిపెట్టినట్లయింది.
    "వేణూ....ఇప్పుడు చెప్పు నేను....నేను....ఎవర్ని?" అమాయకంగా ప్రశ్నించింది.
    నవ్వుతూ అన్నాడు. "ఏ కులమైతేనేం విరజా! మర్యాదా మన్ననా కావలసింది_మనసునిండా కుళ్ళుని నింపుకుని మా కులం పెద్దదనే వారికన్నా మాకులు మేలు గుణం ప్రదానం- మనసు ముఖ్యం__మైత్రి అవసరం__అంతే"
    అర్ధంకాని ఆలోచనలతో విరిసీవిరియని మనసులతో ముందుకు సాగారు.
    ఉదయంనుంచి ఒకటి రెండు గంటలుమాత్రమే గడిచినా చేతనయినంతవరకూ చేతనాల్ని తపించేస్తున్నాడు అరుణుడు.
    తిరుణాలకి రకరకాల వ్యక్తులు వస్తారు, పలురకాలైన పిండివంటల దుకాణాలొస్తాయి. వింతవింతైన విశేషాలుంటాయి.... పసి మనసుల్ని భ్రమింపచేసే రంగురంగుల ఆట బొమ్మలుంటాయి__కన్నె మనసుల్ని కరగించే జడకుచ్చులు, జడసింగారాలు, గాజులు, రకరకాల నకిలీ నగలుంటాయి__
    పలురకాల వ్యక్తులు కలుస్తారు. దొంగలు__దోపిడీ దారులు__చోరులు__నీచులు__ఘరానాబురఖాక్రింద దేహ తాపాన్ని తీర్చుకోవాలనుకునేవారు__ప్రియులు__ప్రియురాండ్రు__బిచ్చగాళ్ళు_సాధువులు_సన్యాసులు_ మంత్రగాళ్ళు_ అభిసారికలు_అభిసారికా గమనులు_ పలురకాలు, పలువిధాలు.  
    జీవితమంతా చీకటిమూలల్లో చిక్కుకుని ఇలాంటి అపూర్వ సమయాల్లో దొరికినంత స్వాతంత్ర్యాన్ని అనుభవించాలనివచ్చే అమాయకులు అధికం.
    ఒక్కొక్కటే చూస్తూ అక్కడక్కడే తినుబండారాల్ని కొనుక్కొని తింటూ కుంటీ గ్రుడ్డికి ఒకటి రెండు దానంచేస్తూ అన్నీ వరుసగా చూస్తూ వస్తున్నారు.
    జంతర్ మంతర్ చూశారు... మ్యూజిక్ లాంపు చూశారు__భూతద్దాలలోంచి కాశీనగరాన్ని, గాంధీగారి మరణానికి దుఃఖిస్తున్న గోమాతని, తాజ్ మహల్ని చూశారు. అపూర్వ అనుభూతి పొందారు.
    రంగుల రాట్నం__! అబ్బ! ఎంతబావుంది. ఒకసారి అలా పైకి మరోసారి క్రిందకి.
    "వేణూ!"
    అటేధ్యాసగా చూస్తున్న వేణు పలక్కపోవటంతో మరోసారి తట్టి పిలిచింది.
    "ఊఁ"
    ఆశగా రంగులరాట్నంవేపు చూసింది__అర్ధమైందతనికి. నవ్వుతూ అన్నాడు "పద"
    గిర్రున పైనుండి క్రిందికి తిరుగుతూ క్రిందికీ పైకీ తిప్పుతూ వుంటూ ఒక్కసారి పాతాళానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చి తిరిగే స్వర్గద్వారాల్ని చూపిస్తున్నట్టుంది.

 Previous Page Next Page